స్వామినాథన్ సార్.. ఇండియాను ఇంకా ఆకలి 'రోగం' వెంటాడుతూనే ఉంది!

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లేకుంటే భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర ఎలా ఉండేదో స్వామినాధన్ లేకుంటే ఈ దేశ వ్యవసాయ రంగం ఎలా ఉండేదో ఊహించడం కష్టం.

Update: 2024-09-28 07:18 GMT

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లేకుంటే భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర ఎలా ఉండేదో స్వామినాధన్ లేకుంటే ఈ దేశ వ్యవసాయ రంగం ఎలా ఉండేదో ఊహించడం కష్టం. 20వ శతాబ్దంలో ఆసియా ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసిన వారిలో స్వామినాథన్ ఒకరని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ అగ్రీ మిషన్ సభ్యునిగా ఉన్న స్వామినాథన్ సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున మరణించారు. ఆయన మరణించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ దేశ అత్యున్నత పురస్కారం- భారత రత్న- ప్రకటించి గౌరవించింది.


స్వామినాథన్ మరణానికి ముందే ఈ దేశ హరిత విప్లవంపై చిటపటలు ప్రారంభం అయ్యాయి. భారతదేశం హరిత విప్లవాన్ని ప్రారంభించిన ఐదు దశాబ్దాలైంది. అయినా ఆకలిపై పోరు ఆగలేదు. పేదలు ఇప్పటికీ అలో లక్ష్మణా అంటూ ఆకలి కేకలు వేస్తున్నారు. 1951లో మనిషికి నికరంగా ఏడాదికి 144 కిలోల తిండిగింజలు కావాల్సి వచ్చేవి. 1971 నాటికది 171 కేజీలకు పెరిగింది. రెండు దశాబ్దాలలో పెరిగిన శాతం కేవలం 18.8 శాతం. ఏడాదికి ఒక శాతం కంటే తక్కువ. 2022లో అంటే స్వామినాధన్ చనిపోవడానికి ఏడాది ముందు కూడా ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాల హంగర్ ఇండెక్స్ లో ఇండియా స్థానం 107గా ఉంది. స్వామినాథన్ మొదలు పెట్టిన హరిత విప్లవం ఏమైనప్పటికీ భారతదేశంలోని పేదలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారన్నది నిజం.

పోషకాహార లోపం ఇంకా వెంటాడుతూనే ఉంది...
మొత్తం ఆహార ఉత్పత్తిలో ఇండియా పెరుగుదల దురదృష్టవశాత్తూ పోషకాహార లోపంలోనే ఉందన్నది నిజం. జనాభా పెరుగుతుంటే ఆహార ఉత్పత్తి తగ్గుతుందన్నది వాస్తవం. ప్రపంచ మొత్తంలో నాలుగింట ఒక వంతు పేదలు అర్థాకలితో ఉంటున్నారు. ఈ హిడెన్ హంగర్ ను తరిమి కొట్టాలని స్వామినాథన్ తుదికంటా ప్రయోగాలు చేశారు. అందులో భాగమే ఆనాటి హరిత విప్లవం. ఆ విషయాన్ని మరచిన చాలామంది ఈవేళ హరిత విప్లవంతో చాలా నష్టం జరిగిందని విమర్శలు చేస్తున్నారు. 1950ల నాటి అవసరం తిండిగింజలు. ఈనాటి అవసరం పర్యావరణ పరిరక్షణ లేదా భూసార పరిరక్షణ. పోషకాహార లోపానికి ఆయన సూచించిన పెద్ద విరుగుడు చిలకడ దుంప. పేదలు ఆహారంలో ఈ దుంపను వాడాలని ఆయన సూచించారు.
ఇప్పటికీ 50 శాతం వ్యవసాయ కుటుంబాలు పేదరికంలోనే...
భారతదేశంలోని 50శాతం వ్యవసాయ కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉంటున్నాయి. వ్యవసాయ రంగంలో తగినంత పెట్టుబడి పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. సబ్సిడీలపై బియ్యం, గోధుమలపై ఆధారపడటాన్ని కొనసాగించాయి. పోషకాహారాన్ని అందించడంలో విఫలమయ్యాయి. కోవిడ్-19 తర్వాత ఆ పరిస్థితి మరింతగా పెరిగింది. వ్యవసాయ ఆహార వ్యవస్థ సంస్కరణ విధానాల చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది.

కుటుంబ వ్యవసాయం, వ్యవసాయంలో బాధ్యతాయుతమైన పెట్టుబడి, లింగ సమానత్వం, మహిళా సాధికారత, పాఠశాలకు సంబంధించిన 35 చట్టాలను పార్లమెంటు ఆమోదించింది. పంట వ్యర్థాలు, ఇతర సమస్యలు దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలో స్వామినాథన్ కన్నుమూశారు.
భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో 2023 సెప్టెంబర్ 28న తమిళనాడులోని చెన్నైలోని తన నివాసంలో 98 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. స్వామినాథన్ 1949లో బంగాళాదుంప, గోధుమలు, వరి, జనుము, జన్యుశాస్త్రంపై పరిశోధన చేస్తూ తన వృత్తిని ప్రారంభించారు.
1960వ దశకంలో భారతదేశం ఆహార ధాన్యాల కొరత, భయంకరమైన కరువు అంచున ఉన్నప్పుడు స్వామినాథన్ తో పాటు నార్మన్ బోర్లాగ్, ఇతర శాస్త్రవేత్తలు అధిక దిగుబడి గల గోధుమ విత్తనాలను అభివృద్ధి చేశారు. ఇది భారతదేశంలో హరిత విప్లవానికి దారితీసింది. అందుకే స్వామినాథన్ను హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు.
స్వామినాథన్ వివిధ వ్యవసాయ పరిశోధనా ప్రయోగశాలలలో పరిపాలనా పదవులను నిర్వహించారు. ఇండిన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. 1979లో వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శి కూడా. 1988లో స్వామినాథన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ అధ్యక్షుడయ్యారు. స్వామినాథన్ వ్యవసాయ శాస్త్ర రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు, ప్రశంసలు పొందారు. 1961లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 1986 లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ లభించాయి.
భారత ప్రభుత్వం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్. 1989 పద్మవిభూషణ్ సత్కరించింది. ఆగస్ట్ 7, 1925 న కుంబకోణంలో జన్మించిన మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ వ్యవసాయ రంగంలో అనేక మార్పులకు ఆద్యుడు.
1943 నాటి బెంగాల్ కరువును ప్రత్యక్షంగా చూసి వైద్య విద్య నుంచి వ్యవసాయ రంగానికి మారారు. వ్యవసాయశాస్త్రంలో బ్యాచిలర్స్, సైటోజెనెటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. స్వామినాథన్ హైబ్రీడీ వంగడాల పెంపకం, వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణలో అనేక సమస్యలపై పరిశోధకులను విద్యార్థులతో కలిసి చేశారు.
భారత దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన పలు సూచనలు చేశారు. వ్యవసాయ వస్తువుల నాణ్యత, ఖర్చులకు తగ్గట్టుగా రైతులకు ఆదాయం ఉండేలా సంస్కరణలను ప్రతిపాదించారు. వ్యవసాయంలో పోటీతత్వాన్ని పెంచి ప్రపంచ మార్కెట్ కు ధీటుగా ఉండేలా భారతీయ రైతులు ఎదగడానికి కృషి చేశారు. అంతర్జాతీయ ధరలు గణనీయంగా పడిపోయినప్పుడు రైతులను దిగుమతుల నుండి రక్షించడం, స్థిరమైన వ్యవసాయం కోసం పర్యావరణ పాటుపడ్డారు.
భారత దేశ వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన ఎంఎస్ స్వామినాథన్‌కు ధాన్యం నిల్వల్లో స్వయం సమృద్ధి సాధించారు. ఇతర దేశాలకు కూడా ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందంటే దానికి కారణం.. ఎంఎస్ స్వామినాథన్ చేసిన పరిశోధనలు, తీసుకువచ్చిన సమూల మార్పులే కారణం. హరిత విప్లవాన్ని తీసుకువచ్చి దేశంలోని పంట పొలాల ముఖచిత్రాన్ని మార్చేశారు. దేశ అభివృద్ధికి పాడి పంటలు ప్రధానమని నిరూపించిన మహనీయుడు.
ఆకలితో ఎవ్వరూ చనిపోకూడదనే...
ఎంఎస్ స్వామినాథన్ పూర్తి పేరు.. మాన్‌కొంబు సాంబశివన్‌ స్వామినాథన్‌. ఎంఎస్ స్వామినాథన్‌కు 15 ఏళ్ల వయసు ఉండగానే.. ఆయన తండ్రి చనిపోవటంతో అప్పటికే వారి కుటుంబం నిర్వహిస్తున్న ఆస్పత్రిని చూసుకునేందుకు ఎంస్ స్వామినాథన్ వైద్య విద్యను చదవాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో దారుణ క్షామాన్ని చూసిన స్వామినాథన్‌.. ఆకలితో దేశంలో ఎవరూ చనిపోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వైద్య విద్యను చేయనని తన కుటుంబానికి తేల్చి చెప్పారు. అనంతరం కోయంబత్తూరులోని మద్రాసు అగ్రికల్చర్‌ కాలేజీలో ప్రవేశం పొందారు. అగ్రికల్చర్‌ కోర్సు చదవడమే అవమానంగా భావించే సమయంలో ఆ కోర్సు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
స్వామినాథన్ మృతి పెద్ద లోటే...
అగ్రికల్చర్‌ కోర్సులో జెనెటిక్స్, పంటలు, వాటి దిగుబడులు పెంచేందుకు అవలంబించాల్సిన విధానాల వైపు.. ఎంఎస్ స్వామినాథన్ అడుగులు వేశారు. పురుగులు, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడిని అందించే వంగడాలను.. మన దేశానికే కాకుండా యావత్‌ మానవాళికి మేలు జరుగుతుందని ఆయన నమ్మారు. ఈ క్రమంలోనే పీజీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అఖిల భారత సర్వీసులైన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో హాలెండ్‌లో అగ్రికల్చర్ కోర్సు చదివేందుకు ఆయనకు అవకాశం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లిన ఎంఎస్ స్వామినాథన్.. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ సాధించారు. అయితే విస్కాన్సిన్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ అధిక జీతంతో భారీ ఆఫర్‌ ఇచ్చినా దాన్ని తిరస్కరించి.. 1954 లో కటక్‌లోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. ఆ తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అడుగు పెట్టారు.
వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్రస్తుత తరుణంలో స్వామినాథన్ లాంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు లేక పోవడం నిజంగా లోటే.v


Tags:    

Similar News