ఫోన్ ట్యాపింగ్ పై సురేఖ సంచలన ఆరోపణలు

టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో కీలక నిందితులను బీఆర్ఎస్(BRS) నేతలు అమెరికా(America) నుండి రాకుండా కాపాడుతున్నట్లు మంత్రి ఆరోపించారు.

Update: 2024-11-17 10:46 GMT

టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో కీలక నిందితులను బీఆర్ఎస్(BRS) నేతలు అమెరికా(America) నుండి రాకుండా కాపాడుతున్నట్లు మంత్రి ఆరోపించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే టెలిఫోన్ ట్యాపింగ్ అంశం పెద్ద సంచలనమైంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు తమ ఫోన్లను కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తున్నట్లు రేవంత్(Revanth) తో పాటు కొందరు నేతలు ఆరోపణలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటిది ప్రభుత్వం మారగానే ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఆధారాలు వెలుగుచూశాయి. ఎప్పుడైతే ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు బయటపడి కొంతమంది పోలీసు అధికారులపైన కేసులు నమోదయ్యాయో వెంటనే ఇద్దరు ప్రముఖులు దేశంవిడిచి పారిపోయారు.

ఇక్కడ ప్రముఖులు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు(Prabhakar Rao), ఒక మీడియా అధినేత సుశీల్ రావు. మార్చి 15వ తేదీన డీఎస్పీ ప్రణీత్ రావు మీద ట్యాపింగ్ కేసు నమోదయ్యిందో లేదో అదేరోజున ప్రభాకరరావు, సుశీల్ రావు దేశం విడిచి అమెరికాకు పారిపోయారు. అప్పటినుండి వీళ్ళిద్దరిని హైదరాబాదుకు రప్పించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. వీళ్ళిద్దరు అమెరికాను వదిలి బయటకు వచ్చేదిలేదన్నట్లుగా గట్టిగా అక్కడే పాతుకుపోయారు. ట్యాపింగ్ ఆరోపణలను విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) వల్ల అయ్యేపని కాదని చెప్పి చివరకు సీబీఐ సాయాన్ని కూడా తీసుకున్నది ప్రభుత్వం. సీబీఐ అధికారులు అమెరికాలోని ఇంటర్ పోల్ అధికారుల సాయాన్ని కోరుతున్నారు.

ఇంటర్ పోల్ సాయం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ప్రభాకరరావు హైదరాబాదుకు వచ్చి సిట్ విచారణకు సహకరిస్తే కాని ట్యాపింగ్ లో అసలు సూత్రదారులు ఎవరన్న విషయం బయటపడదు. నిజంగానే ప్రభాకరరావు గనుక విచారణకు హాజరైతే బీఆర్ఎస్ లోని చాలామంది కీలక నేతలు గట్టిగానే తగులుకుంటారు. అందుకనే ప్రభాకరరావును అమెరికా వదిలి రావద్దని బీఆర్ఎస్ లోని కొందరు చెబుతున్నట్లుగా ఎప్పటినుండో ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే తాజాగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతు హైదరాబాదుకు రానీయకుండా బీఆర్ఎస్ నేతలే ప్రభాకరరావును ఆపుతున్నట్లు ఆరోపించారు. ఈవిషయమై తన దగ్గరఅన్నీ సాక్ష్యాధారాలున్నట్లు కూడా చెప్పారు. ప్రభాకరరావును అమెరికాలో ఉండేట్లుగా ఆపుతున్నది పలానా అని మంత్రి స్పష్టంగా చెప్పలేదు కాని ఆమె మాటల్లో మాత్రం ఎవరిని ఉద్దేశించి ఆరోపణలు చేశారో అందరికీ అర్ధమైపోతోంది. మరి దీనిపై కారుపార్టీ నేతల రియాక్షన్ ఏమిటో చూడాలి.

Tags:    

Similar News