సుప్రీంకోర్టుకు చేరిన లడ్డు లడాయి.. చంద్రబాబుపై సుబ్రమణియన్ స్వామి, వైవీ సుబ్బారెడ్డి పిటిషన్

తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న వివాదం నిగ్గు తేల్చాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Update: 2024-09-23 10:07 GMT

తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న వివాదం నిగ్గు తేల్చాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే విధంగానే తిరుపతి ప్రసాదంలో వినియోగించే నెయ్యిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం వీలైనంత త్వరలోనే విచారణ చేపట్టనుంది. తిరుపతి లడ్డుపై వినిపిస్తున్నవన్నీ ఆరోపణలే తప్ప ఆధారాలు ఎక్కడా కనిపించడం లేదని, ఈ అంశం నిగ్గు తేల్చాలని సుబ్రమణియన్ స్వామి తన పిల్‌లో కోరారు. ఇది కోట్లాది మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన అంశంగా కూడా ఆయన తన పిల్‌లో వివరించారు. అదే విధంగా వైవీ సుబ్బారెడ్డి కూడా.. చంద్రబాబు వ్యాఖ్యల్లో వాస్తవమెంతో తేల్చాలని సుప్రీంకోర్టును కోరారు. ఆయన వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని, కావున ఈ అంశంపై సుప్రీంకోర్టు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లడ్డూ వివాదాన్ని అడ్డుపెట్టుకుని జగనే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారని, అన్య మతస్తుడు అన్న కారణంగానే జగన్‌పై లేనిపోని అభాండాలు మోపుతున్నారని, ఒక వ్యక్తిని కావాలనే టార్గెట్ చేయడం సరికాదని కూడా సుబ్బారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా సుబ్రణ్యం స్వామి, వైవీ సుబ్బారెడ్డి ఇద్దరూ కూడా రెండు పిటిషన్లు వేసినప్పటికీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన.. లడ్డూ వివాదాన్ని పరిష్కరించాలని, ఇందులో నిజానిజాలు వెలికితీయాలనే కోరారు.

ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వండి: సుబ్రమణియన్ స్వామి

తిరుమల తిరుపతి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల నూనె కలిసిందన్న వివాదాన్ని పరిశీలించడానికి కోర్టు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కమిటీ ఈ వివాదంలోని నిజానిజాలను వెలికితీయడమే కాకుండా.. తిరుపతి ప్రసాదం తయారీకి వినియోగించే ఇతర ముడిసరుకుల నాణ్యతను కూడా పరిశీలించి నిజాలు చెప్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ముడిసరుకుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి టీటీడీలో తనిఖీలు, పరిశోధనలు జరుగుతుంటాయి. ప్రసాదం తయారీకి వాడే ఎన్నో సరుకులను గుత్తేదారులు పంపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ముందుగా తిరుపతి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి శాంపిల్ మూలంతో పాటు.. దాని పరిశీలనకు సంబంధించి సమగ్ర రిపోర్ట్ సమర్పించేలా ఆంధ్రప్రదేశ్‌కు ఆదేశాలివ్వండి’’అని ఆయన తన పిల్‌లో కోరారు. అంతేకాకుండా నెయ్యిలో ఉన్న లోపాలకు సంబంధించిన రిపోర్ట్‌ను మీడియాకు వెల్లడించి ఉండకూడదని, దానిని టీటీడీ ఆలయ ట్రస్ట్ ఆఫీసర్లు, పాలకవర్గం హ్యాండిల్ చేసి ఉండాలని, కానీ కొందరు దీనిని తన రాజకీయ స్టేట్‌మెంట్‌కు అద్భుతమైన అవకాశంగా మార్చుకున్నారని చంద్రబాబుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.

విచారణ జరిపించాలి: వైవీ సుబ్బారెడ్డి

‘‘శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు. ఈ విషయంలో వాస్తవాలను వెలికి తీయడం కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ తిరుమలలో జరిగిన అవినీతికి సంబంధించి పూర్తి వెరాలను బయటపెడుతుంది. అదే విధంగా ఈ లడ్డూ వివాదాన్ని సీబీఐ లేదా ఇతర కేంద్ర ఏజెన్సీలు విచారించేలా ఆదేశాలివ్వండి’’ అని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ వివాదంపై మరికొందరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికొందరు నేరగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.

జోక్యం చేసుకోండి.. సీజేఐకి లేఖ

లడ్డు వివాదంలో జోక్యం చేసుకోవాలని సీజేఐ డీవై చంద్రచూడ్‌ను కోరుతూ న్యాయవాది సత్యసింగ్ ఓ లేఖ రాశారు. గత టీటీడీ బోర్డు హయాంలో శ్రీవారి ప్రసాదం తయారీలో మాంస ఉత్పత్తులు కలిశాయన్న వివాదంపై స్పష్టత రావాలని, ఇది కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఇందులో సీజేఐ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ‘‘హిందూ ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లఘించడంగా ఈ చర్య ఉంది. ఇది ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యంగ పరిరక్షణప దాడికి పాల్పడమే అవుతుంది. పవిత్ర నైవేద్యాన్ని మాంసాహార ఉత్పత్తులో కలుషితం చేయడం భక్తుల హక్కులను కాలరాయడమే అవుతుంది. ఈ వివాదంలో నిజానిజాలు తేల్చి, కోట్ల మంది మనోభావాలతో ఆటలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సీజేఐ జోక్యం చేసుకోవాలి’’ అని ఆయన కోరారు.

Tags:    

Similar News