శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి
రాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని, రాయలసీమ ప్రాణాధారమై శ్రీశైలంను, ప్రజల విశ్వాశాన్ని కాపాడాలని బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు.
By : The Federal
Update: 2025-10-26 10:19 GMT
శ్రీశైలం రాయలసీమకు ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా, విజ్ఞానశాస్త్ర పరంగా అత్యంత ప్రాధాన్యమైన ప్రదేశం అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైలం మల్లికార్జునుడు, 18 మహాశక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబికాదేవి ఒకే సన్నిధిలో వెలసిన ఏకైక క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రం అని ఆయన వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రిశైలం పుణ్యక్షేత్రాన్ని కలపాలనే వదంతుల నేపథ్యంలో ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ...ఆధ్యాత్మిక వికాసానికే కాకుండా, మానసిక ఉల్లాసాన్నిచ్చే ప్రకృతి సంపదలతో రాయలసీమకు శ్రీశైలం ఆధ్యాత్మిక, ద్యాన, మానసికానంద కేంద్రంగా విరాజల్లుతుందని తెలిపారు.
ఇదే ప్రాంతంలో, కృష్ణమ్మ ప్రవాహాన్ని నియంత్రించి రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చడానికి, పంటలను పండించడానికి శాస్త్ర విజ్ఞానంతో రూపుదిద్దుకున్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆయన వివరించారు. 60 వేల ఎకరాల భూమిని రాయలసీమ ప్రజలు త్యాగంతో నిర్మించారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శ్రీశైలం దర్శనానికి విచ్చేసి క్షేత్ర ప్రాధాన్యాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాలున్న రాయలసీమ ఖ్యాతిని ప్రస్తావించిన విషయం ఆయన గుర్తు చేశారు.
ఈ నేపద్యంలో శ్రీశైలం క్షేత్రాన్ని కొత్తగా ఏర్పాటుచేస్తున్న మార్కాపూర్ జిల్లాలో కలుపుతారన్న వదంతులు రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది రాయలసీమ గౌరవానికి, అభివృద్ధి అవకాశాలకు పెద్ద దెబ్బ అవుతుందని ఆందోళన వ్యక్తపరిచారు. రాయలసీమకు గర్వకారణమైన శ్రీశైలం ప్రాంతాన్ని రాయలసీమకు దూరం చేసే ఏ ప్రయత్నాన్నైనా రాయలసీమ ప్రజలు ఎదురిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇది అత్యంత సున్నితమైన అంశం. ప్రజల భావోద్వేగాలకు ముడిపడిన ఈ అంశంపై వస్తున్న వదంతులను ప్రభుత్వం తక్షణమే ఖండించి అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఆధ్యాత్మిక కేంద్రాల ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేసిన గత పాలకులు దైవ మహత్యంతో ఇబ్బందులు పడిన విషయం ప్రస్తుత పాలకులు మరిచిపోవద్దని ఆయన హెచ్చరించారు.
గతంలో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రాయలసీమతో సహజ సంబంధాలు ఉన్నాయి. అనేక మంది గిద్దలూరు ప్రాంత వాసులు నంద్యాలలో ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారందరినీ మేము అన్నదమ్ములుగా భావించి ఆదరిస్తున్నాం. ఈ సంబంధాన్ని మరింత బలంగా కొనసాగించడానికి గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాయలసీమ ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని అత్యంత బాధ్యతగా తీసుకొని, శ్రీశైలం రాయలసీమలోని నంద్యాల జిల్లా పరిపాలనా పరిధిలోనే కొనసాగేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.