అత్తమామలను నరికి చంపిన అల్లుడు
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.;
పుట్టింటికి వెళ్లిన భార్య ఇంటికి రాలేదని, ఆమెను కావాలనే రాకుండా చేస్తున్నారనే కసిపెంచుకున్న ఓ అల్లుడు అత్తమామలను దారుణంగా కత్తితో నరికి చంపాడు. అత్యంత దారుణమైన ఈ దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. ఇద్దరి వ్యక్తులను కత్తితో నరికి చంపడంతో స్థానికంగా ఈ హత్యలు కలకలం రేపింది. నల్లజర్ల మండలానికి చెందిన రామకోటేశ్వరరావుకు అదే మండలం ఘంటావారిగూడెంకు చెందిన నాగేశ్వరితో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గతేడాది వరకు వారి కాపురం సవ్యంగానే సాగింది. ఏడాది క్రింత కుటుంబ గొడవలతో నాగేశ్వరి తన భర్త రామకోటేశ్వరరావుపై కోపంతో తన పుట్టింటికి వచ్చింది. మెట్టింటికి వెళ్లేందుకు నిరాకరిస్తూ ఏడాది కాలంగా ఇక్కడే ఉంటోంది. అత్తమామలే తన కుమార్తె నాగేశ్వరిని ఇంటికి పంపడం లేదని వాళ్ల మీద అల్లుడు రామకోటేశ్వరరావు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం నాగేశ్వరి ఇంటికి వచ్చాడు రామకోటేశ్వరరావు. అప్పటికే ఏడాదిగా కసితో రగిలిపోతున్న రామకోటేశ్వరరావు అత్త శారద, మామ బాబూరావులపై కత్తితో దాడి చేసి ఇద్దరినీ నరికి చంపాడు. భార్యపైన కూడా దాడికి ప్రయత్నించాడు. కానీ ఆమె తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు నిందితుడు రామకోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.