స్మార్ట్ పాలనంటే బ్లాక్ లో యూరియా కొనుక్కోవడమా చంద్రబాబూ!

ఆంధ్రాలోనూ బ్లాక్ మార్కెట్ కి తరలిపోతున్న యూరియా!..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపణ;

Update: 2025-08-22 11:28 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలిపోతున్నాయా? ఎరువుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అవును, ఇది నిజమే అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ . రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టి, ఎరువులను సక్రమంగా సరఫరా చేసినందుకు తగు చర్యలు చేపట్టాలని ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన ఏమన్నారంటే..
'రాష్ట్రవ్యాప్తంగా యూరియా డిఏపి వంటి ఎరువులు అందక రైతులు రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. ఇది చాలా బాధాకరం. రాష్ట్రమంతా స్మార్ట్ పాలన జరుగుతోందని, గత ఏడాదికాలంగా పరిపాలన గాడిలో పెట్టామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ రైతాంగానికి ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది.
రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ రైతులు పంట సాగు తగ్గించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద అసలు పంటలే మొదలు కాలేదు. కానీ అప్పుడే ఎరువులు దొరకడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారంటే బ్లాక్ మార్కెటింగ్ ప్రభావం ఏ మేరకు ముందు అర్థమవుతోంది.
యూరియా పైన 100 రూపాయలు, డీఏపీ పైన 200 అదనంగా బ్లాక్ లో అమ్ముతున్నారంటే ప్రభుత్వాధికారులు, విజిలెన్స్ డిపార్ట్మెంట్, పోలీసులు ఏం చేస్తున్నారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని ప్రచారం చేయమని చెబుతున్నారు. కనీసం రైతులకు ఎరువులు కూడా సరఫరా చేయకుండా, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు సాగుతుంటే సుపరిపాలన ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నాం. మార్క్ ఫెడ్ కి 50%, ప్రైవేట్ కి 50% సరఫరా చేస్తామని చెబుతున్నారు. మార్కెఫెడ్ కి ఇచ్చే ఎరువుల శాతాన్ని మరో 10 శాతాన్ని పెంచాలి. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలి. అందుకోసం ఒక రాష్ట్ర మంత్రి పర్యవేక్షణలో, సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి ఎరువులను సక్రమంగా సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం' అని రామకృష్ణ పేర్కొన్నారు.

Similar News