ఎస్సీ,ఎస్టీల కోసం జగన్‌పై షర్మిల నవ బాణాలు

ఎస్సీ, ఎస్టీలు స్వతహాగా కాంగ్రెస్‌ ఓటర్లు. వైఎస్‌ఆర్‌ పేరు చెప్పి జగన్‌ తమ వైపు తిప్పుకున్నారు. వారికి ఏ ఒక్కటి అందకుండా చేశారంటూ జగన్‌కు షర్మిల లేఖాస్త్రం.

Update: 2024-05-01 08:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని దళిత, గిరిజన ఓటర్లపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్ర విభజనకు ముందు 2009 వరకు ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌ పార్టీకి సంప్రదాయ ఓటర్లుగా ఉండేవారు. ఈ రెండు వర్గాల మద్దతు కొంత తెలుగుదేశం పార్టీకి ఉన్నా అధిక శాతం మాత్రం కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. అయితే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం, తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీని జగన్‌ ఏర్పాటు చేయడం, అప్పటి వరకు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత, గిరిజన వర్గాలు వైఎస్‌ఆర్‌సీపీ వైపు టర్న్‌ కావడంతో కాంగ్రెస్‌కు ఏమి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలను టార్గెట్‌గా చేసుకుంటూ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది. తాజాగా వైఎస్‌ షర్మిల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రాసిన బహిరంగ లేఖ కూడా ఇదే విషయాన్ని స్పష్ట చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో చర్చగా కూడా మారింది. బుధవారం రాసిన బహిరంగ లేఖలో తొమ్మిది ప్రశ్నలను షర్మిల సంధించారు. వీటికి బదులివ్వాలని సీఎం జగన్‌ను డిమాండ్‌ చేశారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా అని నిలదీశారు. సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపి వేశారని ప్రశ్నించారు. గతంలో అమలైన 28 సంక్షేమ పథకాలను ఎందుకు అర్దాంతరంగా ఆపేశారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయిందని మండి పడ్డారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్‌ పేరు ఎందుకు తీసేశారని, ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈ సారి ఎందుకు సీట్లు నిరాకరించారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయని, ఇది మీ వివక్ష కాదా అని నిలదీశారు. ఎస్సీ డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారని సీఎం జగన్‌ను షర్మిల ప్రశ్నించారు. స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నవ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఆ లేఖలో వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. తాజాగా సీఎం జగన్‌కు షర్మిల రాసిన లేఖలోని అంశాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇది వరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనో బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణాలు అధ్వాన్నంగా మారాయని ఆ లేఖలో విమర్శించారు. రాజ్యాంగ పరంగా వారికి దక్కాల్సిన హక్కులు కూడా దిక్కులేని దుస్థితి ఏర్పడిందని, బడ్జెట్‌ పరంగా సబ్‌ ప్లాన్‌ను మంటగలిపారని విమర్శించారు. దళితులపై దాడులు పెరుగుతున్నా పట్టించుకోలేదని, దళితులపై దాడులను నివారించి దళితులను కాపాడే నిర్థిష్ట చర్యలు చేపట్ట లేదని విమర్శించారు. దాడులకు తెగడబతున్న వారిలో అధికార వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పెత్తందార్లే ఉన్నారని లేఖలో ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరాలని, ఇకపై ఎలాంటి వివక్ష లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మాటవ్వాలని లేఖలో డిమాండ్‌ చేశారు.
Tags:    

Similar News