‘సెన్యార్’ వస్తోంది.. మళ్లీ అలజడి రేపుతోంది..!
మొంథా తుపాను వచ్చి నెల రోజులైనా గడవక ముందే ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు ముంచుకు రానుంది.
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-11-20 05:45 GMT
దాదాపు నెల రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది. ప్రాణనష్టం అంతగా లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగా తెచ్చి పెట్టింది. ఇప్పడు మళ్లీ అలాంటి తుఫానే రాష్ట్రాన్ని వణికించడానికి సన్నద్ధమవుతోంది. ఈ సంగతి తెలిసి దాని ప్రభావం ఎలా ఉండబోతోందో? అంటూ ఏపీ ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది.
22న అల్పపీడనంతో మొదలై..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22న అంటే శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఆపై ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి 24న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాల్లో వాయుగుండంగా మారనుంది. అనంతరం అదే దిశలో పయినస్తూ తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడనుంది. అది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం గురువారం ఉదయం వెల్లడించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఈనెల 22న అల్పపీడనం ఏర్పడినప్పటికీ దాని ప్రభావం రాష్ట్రంపై ఏమంత కనిపించదు. అయితే అది వాయుగుండంగా బలపడినప్పట్నుంచి (24 నుంచి) దాని ప్రభావం మొదలవుతుంది. 26 నుంచి 29వ తేదీ వరకు రాయలసీమపై అధిక తీవ్రత ఉంటుంది. ఆ తేదీల్లో రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 30న కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తుపాను తీవ్రత ఎలా ఉంటుంది?
రానున్న తుపాను తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై వాతావరణ అధ్యయన సంస్థలు వేర్వేరుగా అంచనాలు వేస్తున్నాయి. గత నెలలో సంభవించిన మొంథా తుపానుకంటే ఎక్కువ తీవ్రత ఉంటుందని కొన్ని సంస్థలు, దాదాపు అంతే తీవ్రత ఉండవచ్చని మరికొన్ని సంస్థలు చెబుతున్నాయి. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మాత్రం ఇప్పటివరకు దాని తీవ్రతపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తుపాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలు, గాలుల వల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అందువల్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలను వెంటనే కోసి నూర్చుకోవాలని సూచించింది. అదే సమయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ తుఫాన్ పేరు ‘సెన్యార్’..
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌కు ‘సెన్యార్’గా నామకరణం చేయనున్నారు. ఈ పేరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సూచించింది. సెన్యార్ అంటే యూఏఈలో అందమైన పువ్వు అని అర్థం. ఈ ‘అందమైన పువ్వు’ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చకుండా సజావుగా వచ్చి వెళ్లిపోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.
సెన్యార్ తీరాన్ని ఎక్కడ దాటుతుంది?
సెన్యార్ తుఫాన్ తీరాన్ని ఎక్కడ దాటుతుందన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఎందుకంటే? తొలుత అల్పపీడనం ఏర్పడి, ఆపై వాయుగుండంగా బలపడితే తీరం ఎక్కడ దాటుతుందన్న దానిపై ఒక అంచనాకు వస్తారు. అయితే ప్రైవేటు వాతావరణ సంస్థలు మాత్రం దక్షిణ కోస్తాంధ్రలో తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నాయి.
‘మొంథా’ నష్టం రూ.5,342 కోట్లు..
అక్టోబర్ 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా 27న తుపానుగాను, ఆపై తీవ్ర తుపానుగాను బలపడింది. దానికి థాయ్‌లాండ్ సూచించిన మొంథా అనే పేరు పెట్టారు. ఈ తుపాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద అక్టోబర్ 29 అర్ధరాత్రి సమయంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఆం్ర«దప్రదేశ్‌లో పలుచోట్ల 10–20 సెం.మీల వరకు భారీ వర్షపాతం నమోదైంది. ఒంగోలులో 25 సెం.మీల అత్యధిక వర్షపాతం రికార్డయింది. 87 వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. 249 మండలాల్లోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం చూపింది. 14 వంతెనలు, పలు రోడ్లు, 61 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇద్దరు చనిపోయారు. ఇలా మొత్తం రూ.5,342.10 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కాగా మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలపై ప్రభావం చూపించింది. అక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తెచ్చి పెట్టింది.
రైతుల్లో తీవ్ర అలజడి..
మొంథా తుఫాన్ తెచ్చిన నష్టాన్ని గుర్తు చేసుకుని రానున్న సెన్యార్‌తో ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోన న్న ఆందోళన రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో పంటలు చేతికొచ్చే వేళ సెన్యార్ తుఫాన్ ఏం కొంప ముంచుతుందోనని రైతుల్లో అలజడి రేగుతోంది.