జీపీఎఫ్ మోసంపై ఉపలోకాయుక్త సంచలన తీర్పు
నకిలీ ఐడీలతో ఉద్యోగుల జీపీఫ్ కాజేసిన వారిని లోకాయుక్త కఠినంగా శిక్షించింది. ఆఫీసుల్లోనే మోసకారులు ఉన్నారని గుర్తించాలని ఉపలోకాయుక్త రజని హెచ్చరించారు.;
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖలోని హైలెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సీ) విభాగంలో జరిగిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) మోసం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్యోగుల కష్టార్జిత పొదుపులను మోసపూరితంగా మళ్లించిన ఘటనలో బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప లోకాయుక్త పగిడి రజని సూచించారు. ఉద్యోగులు తమ జీపీఎఫ్ వివరాలను స్వయంగా ధృవీకరించుకోవాలని, అధికారులు పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఆమె ఆదేశారు.
నకిలీ ఐడీలతో జీపీఎఫ్ స్వాహా
ఈ మోసానికి సంబంధించి రెండు ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సంస్థకు అందాయి. సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ జి జయభారతి తన రూ.10 లక్షల జీపీఎఫ్ (పార్ట్ ఫైనల్) మొత్తం ఖాతాలోకి జమ కాలేదని, విశ్రాంత ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ డివి రామనంజన్న తన రూ.17,14,952లు జీపీఎఫ్ (ఫైనల్ పేమెంట్) మొత్తం అందలేదని ఆరోపిస్తూ ఫిర్యాదు నెం.1624/2021, 1625/2021 ద్వారా లోకాయుక్తను ఆశ్రయించారు. దర్యాప్తులో హెచ్‌ఎల్‌సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) విభాగంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ ఎ ప్రవేశ్ కుమార్ నకిలీ లబ్దిదారుల ఐడీలు సృష్టించి, ఉద్యోగుల జీపీఎఫ్ నిధులను నకిలీ బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు తేలింది. పర్యవేక్షణలో లోపాలు, లబ్దిదారుల వివరాల ధృవీకరణలో వైఫల్యాలతో ఇతర అధికారుల సహకారంతో ఈ మోసం జరిగినట్టు విచారణలో వెల్లడైంది.
సీఎఫ్ఎంఎస్ లో లోపాలు సరిచేయాలి
లోకాయుక్త సంస్థ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, క్రమశిక్షణా చర్యల ఫలితాల కోసం వేచి చూడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాది దారుల జీపీఎఫ్ మొత్తాలను వారి ఖాతాల్లోకి తక్షణం జమ చేయాలని, బాధ్యులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎఫ్‌ఎమ్‌ఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్‌లోని లోపాలను సవరించి సమస్య పునరావృతం కాకుండా చూడాలని సూచించింది. లోకాయుక్త ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందించి ఫిర్యాదిదారుల బకాయిలను వారి ఖాతాల్లోకి జమ చేసింది. అంతేకాక ఆ మొత్తాలపై 7.1 శాతం వడ్డీ చెల్లించడానికి కూడా ఆమోదం తెలిపింది.
బాధ్యులపై క్రిమినల్ కేసు
ఈ మోసంలో ప్రధాన బాధ్యులుగా గుర్తించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అనంతపురం హెచ్‌ఎల్‌సీ డివిజన్‌లో పనిచేసిన అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె వెంకటరమణారెడ్డి, ఎ వెంకట సురేష్ బాబు, సూపరింటెండెంట్లు పి ఎండి ఉస్మాన్, కె సుబ్రహ్మణ్యం (విశ్రాంత), జూనియర్ అసిస్టెంట్ ఎ ప్రవేశ్ కుమార్‌లపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 420 (మోసం), 406 (క్రిమినల్ ట్రస్ట్ బ్రీచ్), 409 (పబ్లిక్ సర్వెంట్ ద్వారా మోసం), 34 (సమాన ఉద్దేశంతో కలిసి చేసిన అపరాధం) కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రవేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లో ఐడీలను ధృవీకరించుకోవాలి
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంలో, బాధ్యులపై చర్యలు ప్రారంభించడంలో జలవనరుల శాఖ, ఆర్థిక శాఖల ప్రధాన కార్యదర్శులు చూపిన చురుకుదనాన్ని ఉపలోకాయుక్త పి రజని అభినందించారు. "ఉద్యోగులు తమ జీపీఎఫ్ ఉపసంహరణ లేదా తుది చెల్లింపు ప్రక్రియకు ముందు సీఎఫ్‌ఎమ్‌ఎస్ పోర్టల్‌లో తమ ఐడీలను వ్యక్తిగతంగా ధృవీకరించుకోవాలి. అసలు జీపీఎఫ్ వివరాలతో సరిచూసుకోవాలి. డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ అధికారులు నకిలీ ఐడీల ద్వారా నిధుల మళ్లింపును నిరోధించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి" అని ఆమె సూచించారు.
ఈ కేసు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాఠం
అన్ని ప్రభుత్వ విభాగాల్లో పర్యవేక్షణ నియంత్రణలను బలోపేతం చేయాలని, ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం అధికారులు జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలని రజని పేర్కొన్నారు. "నిర్లక్ష్యం లేదా మోసం కారణంగా ఏ ఉద్యోగి కూడా తన కష్టార్జిత పొదుపును కోల్పోకూడదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి" అని ఆమె హెచ్చరించారు. ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన పాఠంగా నిలిచింది. మోసాలను అరికట్టేందుకు సీఎఫ్‌ఎమ్‌ఎస్ వ్యవస్థలో మరిన్ని భద్రతా చర్యలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హెచ్ఎల్సీ విభాగం అంటే...
హైలెవల్ కెనాల్ (హెచ్‌ఎల్‌సీ) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జలవనరుల శాఖకు సంబంధించిన ఒక ముఖ్యమైన నీటిపారుదల వ్యవస్థ. ఇది కృష్ణా నది నుంచి నీటిని తీసుకొని రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాలకు సాగునీరు, తాగునీటి సరఫరా కోసం రూపొందించిన ఒక పెద్ద కాలువ వ్యవస్థ. హెచ్‌ఎల్‌సీ విభాగం ప్రధానంగా అనంతపురం, కడప, కర్నూలు వంటి జిల్లాల్లోని వ్యవసాయ భూములకు నీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ విభాగం జలవనరుల శాఖ ఆధీనంలో పనిచేస్తూ, కాలువల నిర్వహణ, నీటి పంపిణీ, మరమ్మత్తులు, ఇతర సంబంధిత పనులను పర్యవేక్షిస్తుంది. లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) అనేది ఈ విభాగంలో ఆర్థిక లావాదేవీలు, నిధుల విడుదలకు సంబంధించిన ఒక విధానం, ఇది ప్రాజెక్టుల నిర్మాణం లేదా నిర్వహణకు సంబంధించిన ఖర్చులను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది.