ఆశల పల్లకిలో రోజా
‘జగన్ 2.0’ అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని కూటమి నేతలకు హెచ్చరికలు;
By : V V S Krishna Kumar
Update: 2025-08-22 08:31 GMT
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి రోజా ధీమాగా చెప్పారు.అప్పుడు ‘జగన్ 2.0’ అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు.ఈవీఎంల అవకతవకల వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించిన మాజీ మంత్రి,ప్రజలంతా వైసీపీ వైపే వున్నారని చెప్పుకొచ్చారు.అనకాపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో రోజా మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు.వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని,జగన్ అందించిన సంక్షేమం, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అందించలేకపోతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె విమర్శించారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. "వచ్చే ఎన్నికల్లో ప్రజలు మాకు కచ్చితంగా అవకాశం ఇస్తారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఇప్పుడు మాపై అక్రమ కేసులు బనాయిస్తున్న వారందరూ భవిష్యత్తులో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు" అని రోజా హెచ్చరించారు.హామీల అమలులో వైఫల్యం చెందిన కూటమి నేతలపై ప్రజలలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.