రేవంత్ సీరియస్ వార్నింగ్
కబ్జాదారులకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి చేసుకున్న, చేసిన నిర్మాణాలను వెంటనే ఖాళీచేసి వెళిపోవాలన్నారు.
కబ్జాదారులకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి చేసుకున్న, చేసిన నిర్మాణాలను వెంటనే ఖాళీచేసి వెళిపోవాలన్నారు. ఒకవేళ అక్రమనిర్మాణాలను ఖాళీచేయకపోతే హైడ్రానే వాళ్ళని ఖాళీచేయించి అన్నింటినీ కూల్చేస్తుందని గట్టిగానే హెచ్చరించారు. చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేయటంతో చాలా సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. కబ్జాలుచేసింది ఎంత పెద్దవాళ్ళయినా, ఆక్రమనిర్మాణాల్లో ఉంటున్నది ఎవరైనా సరే హైడ్రా ఉపేక్షించదని కూడా స్పష్టంగా చెప్పారు. పోలీసు అకాడమీలో బుధవారం జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో రేవంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతు అక్రమనిర్మాణాలను కబ్జాదారుల చెరనుండి విడిపించటం కోసం ఏర్పాటుచేసిందే హైడ్రా అని చెప్పారు. ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసిందో ఆ లక్ష్యాన్ని సాధించేదిశగానే హైడ్రా నడుస్తోందన్నారు. చెరువలను ఆక్రమించి ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లనో చేసిన అక్రమనిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే స్కీమ్ ఏమీ లేదని రేవంత్ అన్నారు. ఫాంహౌజుల్లోని డ్రైనేజి నీటిని కొందరు బడాబాబులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కలిపేస్తున్నారని మండిపడ్డారు. కొందరు దుర్మార్గులు చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించటం వల్లే వరదలు వస్తున్నట్లు మండిపడ్డారు.
ఇదే సందర్భంలో పోలీసులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతు పోలీసు ఉద్యోగం అన్నది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని అది ఒక భావోద్వేగంతో ముడిపడిన బాధ్యతగా వర్ణించారు. 24 గంటలూ ప్రజల కష్టనష్టాల్లో పాలుపంచుకోవాల్సిన బాధ్యతాయుతమైన ఉద్యోగంగా అందరు గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులు కీలకపాత్ర పోషించాల్సుంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఈ ఏడాదిలోగా మరో 35 వేలమందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నట్లు చెప్పారు.
పబ్లిక్ సర్వీసు కమీషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికీ అనుమానాలు అవసరంలేదన్నారు. పరీక్షలన్నింటినీ ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీ, డ్రగ్స్ వినియోగాన్ని కంట్రోల్ చేయటంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితరాలను కూడా రేవంత్ వివరించారు.