బీసీ ఓట్లకోసం రేవంత్ మాస్టర్ ప్లాన్

ఢిల్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతు ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయను నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు;

Update: 2025-07-24 09:00 GMT
Revanth and Bandaru Dattatreya

ఒకేదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉంటుంది రాజకీయాల్లో కొందరి వ్యూహాలు. ఎనుముల రేవంత్ రెడ్డి వ్యూహం కూడా అలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతు ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయను నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీనియర్ నేత, బీసీ(యాదవ)సామాజికవర్గానికి చెందిన బండారును ఉపరాష్ట్రపతిగా నియమిస్తే బీసీ సామాజికవర్గానికి న్యాయంచేసినట్లు అవుతుందని రేవంత్(Revanth) సూచించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ బీజేపీ సీనియర్ నేతను ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదించటం వెనుక దత్తన్న మీద ప్రేమకన్నా వ్యూహమే దాగున్నదని అర్ధమవుతోంది. వ్యూహం ఏమిటంటే బీసీ అస్త్రాన్ని ప్రయోగించి రాజకీయంగా బీజేపీని ఇరుకునపెట్టి కాంగ్రెస్ కు లబ్దిచేకూర్చటమే.

ఎలాగంటే దత్తన్నకు ఏమిపదవి ఇవ్వాలని బీజేపీ లేదా ఎన్డీయే పెద్దలకు రేవంత్ సూచించాల్సిన అవసరంలేదు. గతంలోనే బండారు సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానాకు గవర్నర్ గా కూడా పనిచేశారు. దత్తన్న సీనియారిటిని నరేంద్రమోదీ(Narendra Modi) బాగానే గౌరవించారు అనటంలో ఎలాంటి సందేహంలేదు. అయితే ఇవన్నీ తెలీకుండానే దత్తన్నకు ఉపరాష్ట్రపతి పదవి అనే ప్రతిపాదనను రేవంత్ పెట్టుంటారా ? నెవర్, రేవంత్ చాలా తెలివైనవాడు. అందుకనే వ్యూహాత్మకంగానే దత్తన్న పేరును ప్రతిపాదించారని అర్ధమవుతోంది. ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడమే. ఇపుడు తెలంగాణలో బీసీ వార్ జరుగుతోంది. బీసీల్లో మెజారిటి ఓట్లు ఏ పార్టీకి పడతాయో ఆ పార్టీదే స్ధానికఎన్నికల్లో ఘనవిజయం అని చెప్పాల్సిన పనిలేదు.

అందుకనే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు బీసీలను ఆకట్టుకునేందుకు దేని ప్రయత్నాలు అది చేసుకుంటోంది. ఇందులో భాగంగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానంచేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపింది. అయితే బిల్లు మూడునెలలుగా రాష్ట్రపతి దగ్గరే పెండింగులో ఉండిపోయింది. అందుకనే ప్రత్యామ్నాయంగా రిజర్వేషన్ల అమలుకు రేవంత్ క్యాబినెట్ ఆర్డినెన్స్ ను తెరపైకి తెచ్చింది. ఈఆర్డినెన్స్ ఇపుడు గవర్నర్ దగ్గర పెండింగులో ఉంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటం సాధ్యంకాదు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదని గతంలోనే సుప్రింకోర్టు తీర్పుంది. ఆతీర్పు ప్రకారం ఇపుడు ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లంటే మొత్తం రిజర్వేషన్లు 70శాతంకు చేరుకుంటాయి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా సవాలుచేస్తు కోర్టులో కేసువేస్తే ఆర్డినెన్సును కోర్టు కొట్టేస్తుంది.

ఇవన్నీ రేవంత్ కు కూడా బాగా తెలుసు. అందుకనే బీసీల మనసులను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా దత్తన్న పేరును రేవంత్ తెరపైకి తెచ్చినట్లు అర్ధమవుతోంది. తెలంగాణ(Telangana)లో బీసీల జనాభా 56 శాతమని కులగణనలో బయటపడింది. బీసీల్లోని 140 ఉపకులాల్లో ఐదు ఉపకులాలు మాత్రమే మొత్తం బీసీ సామాజికవర్గాలను డామినేట్ చేస్తున్నాయి. ఇందులో 20.71 లక్షల జనాభాతో యాదవులు గట్టి స్ధితిలో ఉన్నారు. దత్తన్న యాదవ ఉపకులానికి చెందిన వ్యక్తి పైగా బీజేపీ(BJP)తో పాటు ఇతర పార్టీల్లో కూడా వివాదరహితుడిగా పేరున్న నేత. ప్రతిఏడాది నిర్వహించే ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి పార్టీల రహితంగా హాజరయ్యే నేతలనుచూస్తే దత్తన్న ఎంతటి ముఖ్యనేతో అర్ధమైపోతుంది.

తెలంగాణలో మొదటినుండి బీసీలు ముఖ్యంగా యాదవులు టీడీపీతో ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు మద్దతుదారులుగా ఉన్నారు. కాబట్టి వీరిని బీఆర్ఎస్(BRS) కు దూరంచేయటం, బీజేపీ వైపు పోకుండా అడ్డుక్కోవటంతో పాటు కాంగ్రెస్ వైపు ఆకర్షించటమే రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. అంటే యాదవుల మద్దతు కోసమే రేవంత్ ప్లాను ప్రకారం దత్తన్న(Bandaru Dattatreya) పేరును ప్రయోగించినట్లు అర్ధమవుతోంది. రేవంత్ కు కూడా బాగా తెలుసు తాను ప్రతిపాదించినంత మాత్రాన బండారుకు నరేంద్రమోదీ ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వరని. అనుకున్నట్లుగానే పదవి రాకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యుండి బీజేపీ సీనియర్ నేత అయినా దత్తన్న మీద ప్రేమతోనే తాను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినట్లు రేపటి ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేసుకుంటారు. ఒకవేళ అదృష్టంకొద్దీ దత్తన్నకు ఉపరాష్ట్రపతి పదవి వచ్చేస్తే తాను డిమాండ్ చేయటంవల్లే నరేంద్రమోదీ ఇచ్చారని రేవంత్ చెప్పుకుంటారు.

షెడ్యూల్ 9లో చేర్చటం అసాధ్యం

తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్రప్రభుత్వం ఆమోదించదన్న విషయం తేలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లుకు కేంద్రం ఆమోదించాలంటే ముందు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. ఓటింగ్ ద్వారా బిల్లును షెడ్యూల్ 9లో పెట్టి నెగ్గించుకోవాలి. తర్వాత పార్లమెంటు తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపి ఆమోదం పొందిన తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత వస్తుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లుకు ఎన్డీయే ప్రభుత్వం ఆమోదిస్తుందని, సానుకూలంగా స్పందిస్తుందని ఎవరూ అనుకోవటంలేదు. షెడ్యూల్ 9లో చేర్చటం అయ్యేపనికాదని తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటనతోనే అర్ధమైపోయింది. ఢిల్లీలో రావు మీడియాతో మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును షెడ్యూల్ 9 లో చేర్చటం అసాధ్యమని తేల్చేశారు.

రేవంత్ ది డ్రామాలే : దినేష్ పటేల్

ఇదే విషయమై బీజేపీ నిజామాబాద్ బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి పటేల్ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయను రేవంత్ ప్రతిపాదించటం రాజకీయడ్రామాగా కొట్టిపారేశారు. దత్తన్నకు పదవి ఇచ్చే విషయమై నరేంద్రమోదీకి రేవంత్ సలహా అవసరంలేదన్నారు. కేంద్రక్యాబినెట్లో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చిన క్రెడిట్ మోదీకే దక్కుతుందని చెప్పారు. నిజంగానే రేవంత్ కు బీసీల మీద అంతప్రేముంటే ముఖ్యమంత్రిగా తాను తప్పుకుని బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల ఉద్దారకుడిగా రేవంత్ ముసుగు రాజకీయాలు చేస్తున్నట్లు పటేల్ మండిపడ్డారు.

Tags:    

Similar News