ఢిల్లీలో రేవంత్ దీక్ష ? ఇబ్బందులు తప్పవా ?
దీక్షలతో తనతో పాటు మిత్రపక్షాలు, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను కూడా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాడు;
రేవంత్ రెడ్డి చాలా పెద్ద ప్లానే వేశాడు. మార్చి రెండోవారంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్దత కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక్కరోజు దీక్షచేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ దీక్షలతో తనతో పాటు మిత్రపక్షాలు, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను కూడా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నీ రాజకీయపార్టీలను ఢిల్లీ(Delhi)కి తీసుకెళ్ళి నరేంద్రమోడి(Narandra Modi) ప్రభుత్వం మీద ఒత్తిడిపెడితే కాని చట్టబద్దంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) అమలు సాధ్యంకాదని రేవంత్(Revanth) అనుకున్నాడు. ఇందుకోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటుచేయబోతున్నాడు.
బీసీలకు స్ధానికసంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు అమలుచేస్తారంటు ప్రతిపక్షాలు బాగా గోలచేస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలంటే ముందు వాళ్ళ జనాభా ఎంతో తేలాలని కులగణన చేయించింది ప్రభుత్వం. అందులో బీసీలు, ముస్లింల్లోని బీసీలు కలిపి 56 శాతం ఉన్నట్లు తెలింది. అయితే కులగణనకు 3.5 లక్షల కుటుంబాల్లోని 16 లక్షల మంది ప్రజలు దూరంగా ఉండిపోయారు. తాము కులగణనకు సహకరించేదిలేదని చెప్పారు. దాంతో ప్రభుత్వం చేయించిన కులగణనంతా బోగస్ అంటు ప్రతిపక్షాలు ఆరోపణలతో విరుచుకుపడ్డాయి.
అందుకనే మరోసారి కులగణన చేయించాలని రేవంత్ డిసైడ్ అయ్యాడు. మొన్నటి 16వ తేదీన మొదలైన రెండోసారి కులగణన ఈనెలాఖరు 28 వరకు జరుగుతుంది. ఇపుడు జరుగుతున్న కులగణన కేవలం మొదటిసారి సర్వేకి దూరంగా ఉన్న 3.5 లక్షల కుటుంబాల కోసం మాత్రమే. ఇపుడు జరుగుతున్న సర్వే కూడా పూర్తయితే తెలంగాణలో కులాలవారీగా జనాభా ఎంతన్న విషయం కచ్చితంగా తేలుతుంది. 28వ తేదీన కులగణన పూర్తవ్వగానే ఆ నివేదికను క్యాబినెట్ పరిశీలించి అసెంబ్లీలో చర్చకు పెట్టాలన్నది రేవంత్ ఆలోచన. అందుకనే మార్చి మొదటివారంలో సుమారు నాలుగురోజులు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నాడు. కులగణనకు అసెంబ్లీ తీర్మానం చేయించటంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయించటమే ప్రత్యేక సమావేశాల ఉద్దేశ్యం.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించటం రేవంత్ చేతిలోని పనికాదు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వ పరిధిలోనిది. రిజర్వేషన్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారముంది. అందుకనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలన్న అసెంబ్లీ తీర్మానాన్ని రేవంత్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపాలని డిసైడ్ అయ్యింది. మార్చిలో ఎలాగూ పార్లమెంటు సమావేశాలు(Parliament sessions) జరగబోతున్నాయి కాబట్టి అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేట్లుగా నరేంద్రమోడీపై ఒత్తిడి తేవాలన్నది రేవంత్ ప్లాన్. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టి ఎందుకు ఆమోదింపచేస్తుందన్నది కీలకమైన ప్రశ్న. పార్లమెంటులో బిల్లుపెట్టి పాస్ చేసినా లాభం కాంగ్రెస్ కే. ఒకవేళ బిల్లు పెట్టడానికి కేంద్రప్రభుత్వం నిరాకరించినా లాభం కాంగ్రెస్ కే. ఈ విషయం మోడీకి కూడా బాగా తెలుసుకాబట్టే అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా బహుశా అధ్యయనం పేరుతో మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మోడీ ఆలోచనలు కాంగ్రెస్ కు బాగా తెలుసుకాబట్టే అసెంబ్లీతీర్మాన్ని కేంద్రానికి పంపటంతో ఊరుకోకుండా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడే ఢిల్లీకి వెళ్ళి దీక్షపేరుతో ఒత్తిడి తేవాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నాడు. జంతర్ మంతర్లో పెద్ద బహిరంగసభ నిర్వహించాలన్నది రేవంత్ ఆలోచన. ఇదేసమయంలో పార్లమెంటులో కులగణన రిపోర్టుపై చర్చకు రాహుల్ గాంధి, కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టాలని కూడా నిర్ణయించినట్లు పార్టీవర్గాల సమాచారం. తానొక్కడే ఢిల్లీలో దీక్షచేస్తే ఉపయోగం ఉండదుకాబట్టే మిత్రపక్షాలు, ప్రతిపక్షాలను కూడా తనతో పాటు తీసుకెళ్ళాలని నిర్ణయించాడు. మిత్రపక్షాలు ఎంఐఎం, సీపీఐ రేవంత్ తో ఢిల్లీకి వెళ్ళే అవకాశాలున్నాయి. మరి ప్రతిపక్షాలు బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు వెళతాయా ?
ఇరకాటంలో ప్రతిపక్షాలు
ఢిల్లీలో రేవంత్ చేయాలని అనుకుంటున్న దీక్ష విషయంలో ప్రతిపక్షాలు ఏమిచేస్తాయి ? అన్నది ఆసక్తిగా మారింది. దీక్షలో రేవంత్ కు సహకరిస్తే ఒకసమస్య, వ్యతిరేకిస్తే మరో సమస్యగా తయారైంది. సహకరిస్తేనేమో రేవంత్ ఆధిపత్యాన్ని ఆమోదించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అంగీకరించినట్లవుతుంది. దాంతో బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయటంలో రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని అనేందుకు ప్రతిపక్షాలకు అవకాశాలు ఉండవు. ఒకవేళ దీక్షలో పార్టిసిపేట్ చేయటానికి నిరాకరిస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో ప్రతిపక్షాలకు చిత్తశుద్దిలేదని రేవంత్ ఎదురుదాడులు మొదలుపెడతాడు. తమ ప్రభుత్వానికి ప్రతిపక్షల నుండి మద్దతు దొరకలేదుకాబట్టే కేంద్రం పట్టించుకోలేదని రేవంత్ గోలగోల చేస్తాడు. దాన్ని బీఆర్ఎస్, బీజేపీలు ఖండించే అవకాశాలు కూడా లేవు.
బీజేపీకి ఇంకా పెద్ద సమస్య
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలనే అసెంబ్లీ తీర్మానం విషయంలో బీజేపీ బాగా ఇబ్బందిపడటం ఖాయమే. తీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన తర్వాత ఢిల్లీలో చేయబోయే దీక్షకు ఎందుకు మద్దతు ఇవ్వటంలేదని అడిగితే బీజేపీ నేతల దగ్గర సమాధానముండదు. రేవంత్ దీక్షలో పాల్గొనాలంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఎంఎల్ఏలు వ్యవహరించినట్లే అవుతుంది. ఇందుకు బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించదు. ఒకవేళ దీక్షలో పాల్గొనకపోతే బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని రేవంత్, మంత్రులు చేసే ఆరోపణలను తిప్పికొట్టడం కష్టమే. ఈ నేపధ్యంలో బీజేపీ ఏమిచేస్తుందో చూడాలి.
బీఆర్ఎస్ సమస్య ఏమిటి ?
ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మరోక సమస్యను ఎదుర్కొంటోంది. అదేమిటంటే నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు, కవిత ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ మీద బయటతిరుగుతున్న విషయం తెలిసిందే. మోడీని డైరెక్టుగా ఏమన్నా అంటే బెయిల్ రద్దవుతుందేమో అన్న భయంతోనే కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవితలు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటంలేదని మంత్రులు పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరఓటమి తర్వాత నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ పల్లెత్తు మాటకూడా మాట్లాడటంలేదు. అసెంబ్లీలో తీర్మానం వరకు బీఆర్ఎస్ సానుకూలంగానే ఉండచ్చుకాని ఢిల్లీలో రేవంత్ దీక్షకు మద్దతు ఇస్తుందా అన్నదే అనుమానంగా ఉంది. మొత్తంమీద రేవంత్ ప్లాన్ తో ప్రతిపక్షాలు బాగా ఇబ్బందిపడేట్లుగానే కనబడుతోంది చివరకు ఏమి జరుగుతోందో చూడాల్సిందే.