తెలంగాణా నిరుద్యోగులకు రేవంత్ దసరా కానుక

2024 జనవరి-ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్ష నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేసిన ప్రభుత్వం సరిగ్గా దసరా పండుగ సందర్భంగా అంటే 9వ తేదీన నియామక పత్రాలు అందించింది.

Update: 2024-10-09 12:12 GMT

మంగళవారం వరకు నిరుద్యోగులుగా ఉన్న డీఎస్సీ అభ్యర్ధులు బుధవారం నాడు ఉద్యోగులైపోయారు. 2024 జనవరి-ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్ష నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేసిన ప్రభుత్వం సరిగ్గా దసరా పండుగ సందర్భంగా అంటే 9వ తేదీన నియామక పత్రాలు అందించింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ చేతుల మీదుగా కొందరు అభ్యర్ధులు అపాయిట్మెంట్ లెటర్లు అందుకున్నారు. మొత్తం 11,062 పోస్టులకు పరీక్షలు నిర్వహించి అభ్యర్ధులకు ఎంపిక చేసింది ప్రభుత్వం. అయితే వెయ్యిపోస్టులకు సంబంధించి కోర్టుల్లో కేసులు పడటంతో ఇపుడు ప్రభుత్వం 10,062 మందికి మాత్రమే ప్రభుత్వం నాయామక పత్రాలను అందించింది.

రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొందరికి అపాయిట్మెంట్ లెటర్లు అందించిన ప్రభుత్వం మిగిలిన అభ్యర్ధులకు జిల్లాల్లో డీఈవోల ఆధ్వర్యంలో నియామకపత్రాలు అందుకునేలా ఏర్పాట్లుచేసింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు కేసీఆర్ హయాంలో 2017లో డీఎస్సీ నిర్వహించినా 2019లో నియామక ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన మూడేండ్ల తర్వాత డీఎస్సీ పరీక్షను ఎందుకు ఆలస్యంగా నిర్వహించాల్సొచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. 2019లో ప్రక్రియ ప్రారంభమైనా 2022 వరకు ఇదే వ్యవహారం సరిపోయింది. రెండో డీఎస్సీ 2023లో నోటిఫికేషన్ జారీచేసినా ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో డీఎస్సీ నోటిఫికేషన్ పెండింగులో పడిపోయింది.



 అప్పుడు పెండింగులో పడిపోయిన డీఎస్సీ నోటిఫికేషన్ కే రేవంత్ ప్రభుత్వం మోక్షం కల్పించింది. తొందరలోనే అంటే రాబోయే ఫిబ్రవరిలో మరో 6 వేల పోస్టులకు డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. టీచర్లే ప్రభుత్వానికి మార్గదర్శకులుగా చెప్పారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో 30 వేల స్కూళ్ళుంటే 34 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నట్లు రేవంత్ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ళకు పిల్లల్ని పంపాలంటే తల్లి, దండ్రులు నామోషీగా ఫీలవుతున్నట్లు చెప్పారు. స్కూళ్ళకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, సంగరేణి నుండి అటెండర్లను నియమించామని, గ్రామాల్లోని స్కూళ్ళకు టాయిలెట్లు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. 25 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్ళను సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్ళుగా మార్చబోతున్నట్లు రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాదాన్యత ఇస్తున్నట్లు వివరించారు. 75 ఐటిఐలను రు. 400 కోట్లతో అప్ గ్రేడ్ చేసి అడ్వాన్సుడు టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ మొత్తంలో టాటా కంపెనీయే భరిస్తోందని చెప్పారు. యువతీ, యువకులకు సాంకేతిక శిక్షణ ఇప్పించి మంచి ఉద్యోగాలు ఇప్పించబోతున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది రాష్ట్రం నుండి 1.10 లక్షల మంది విద్యార్ధులు ఇంజనీరింగు పాస్ అవుతున్నట్లు చెప్పారు. ఇంజనీరింగ్ పాస్ అవుతున్న విద్యార్ధులందరికీ మంచి ఉద్యోగాలు రావటంలేదన్నారు. అందుకనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి సాంకేతిక నైపుణ్యాలను పెంచబోతున్నట్లు చెప్పారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకు ఉద్యోగాలు ఊడితే కాని నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఎద్దేవా చేశారు. కుటుంబంలోని సభ్యులు, దగ్గర బంధువులు, పార్టీలోని నేతలకు పదవులు ఇచ్చిన కేసీఆర్ నిరుద్యోగులకు కొలువులగురించి మాత్రం ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే 21 వేల టీచర్లకు ప్రమోషన్లు వచ్చినట్లు గుర్తుచేశారు. క్రీడలపైన కూడా తమ ప్రభుత్వం పెట్టిన దృష్టి కారణంగా రాబోయే ఒలంపిక్స్ పోటీల్లో మనదేశానికి తెలంగాణా నుండే బంగారు పతకాలు సాధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసమే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధుల్లో క్రీడలపట్ల ఆసక్తి పెరిగేట్లుగా టీచర్లు తమవంతు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తిచేశారు. డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్న విద్యార్ధులను క్రీడలవైపుకు మళ్ళించే గురుతర బాధ్యతలను టీచర్లు తీసుకోవాలని కోరారు. టీచర్ల సమస్యల పరిష్కారం బాధ్యతలను తమ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News