హైడ్రాకు ఇక ఫుల్ పవర్స్

భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలో చేయబోయే ప్రతి నిర్మాణానికి ముఖ్యంగా కమర్షియల్ నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-09-11 04:40 GMT

హైడ్రా విషయంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అదేమిటంటే భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలో చేయబోయే ప్రతి నిర్మాణానికి ముఖ్యంగా కమర్షియల్ నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా నుండి అనుమతి తీసుకున్న తర్వాతే సదరు నిర్మాణాలకు చట్టబద్దత వస్తుంది. లేకపోతే అక్రమ నిర్మాణాలుగానే నిలిచిపోతాయి. బ్యాంకులతో పాటు ఇతర ఆర్ధిక సంస్ధలు కూడా కొనుగోలుదారులకు అప్పులివ్వాలంటే హైడ్రా అనుమతిని కీలకంగా పరిగణించే అవకాశముంది. హైడ్రా నుండి ఎన్ఓసీ లేకపోతే బిల్డర్లకు, కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు రుణాలు ఇవ్వవు.

రుణాలు తీసుకోకుండానే బిల్డర్లు, రియల్టర్లు నిర్మాణాలు చేసినా, కొనుగోలుదారులు కొనేసినా జీహెచ్ఎంసీ ఇంటినెంబర్ ఇవ్వకుండా, నీటి కనెక్షన్ రాకుండా, కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చేందుకు లేకుండా చట్టం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ చట్టంలో అవసరమైన సవరణలు చేసి సరికొత్త బిల్లును తయారుచేయాలని రేవంత్ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. సవరణలతో బిల్లు తయారైన తర్వాత పరిస్ధితులను బట్టి అవసరమైతే ముందు ఆర్డినెన్సును తీసుకొస్తారు. తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించుకుని దాన్ని గవర్నర్ ఆమోదంతో చట్టం రూపంగా మార్చాలని రేవంత్ అనుకుంటున్నారు.

నిర్మాణాలకు, కొనుగోళ్ళకు హైడ్రా అనుమతి తప్పనిసరిచేస్తే చెరువులు, కాల్వలు, కుంటల్లో అక్రమనిర్మాణాలు జరగకుండా నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. నిజానికి హైడ్రా లాంటి వ్యవస్ధ రియల్ ఎస్టేట్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ యాక్ట్(రెరా)ను కేంద్రప్రభుత్వం చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది. అపార్ట్ మెంట్లు, గ్రూప్ హౌసింగ్, విల్లాల్లాంటి భారీ కమర్షియల్ నిర్మాణాలు చేపట్టే ప్రతి బిల్డర్, రియల్టర్ రెరా నుండి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలి. ఈ ఎన్ఓసీ ఆధారంగానే జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్ శాఖలు ఇళ్ళ నెంబర్లు, మంచినీటి పైప్ లైన్, కరెంటు కనెక్షన్ సర్వీసునెంబర్ కేటాయించాలి. అయితే రాజకీయదన్ను ఉన్న బిల్డర్లు, రియల్టర్లు రెరాను ఏమాత్రం లెక్కచేయటంలేదు. అపార్టమెంట్లలాంటి భారీ నిర్మాణాల్లో కొనుగోలుదారులకు తర్వాత ఏదైనా సమస్యవస్తే కోర్టులు కూడా రెరా అనుమతులను పరిశీలిస్తున్నది.

అయితే చాలామంది కొనుగోలుదారులకు రెరా అన్నది ఒకటుందని కాని రెరా అనుమతిపత్రం ఉన్న స్ధిరాస్తులనే కొనుగోలుచేయాలని చాలామందికి తెలీదు. అందుకనే రెరా అన్నది కాగితాలకే పరిమితమైపోయింది. తమ అనుమతిలేని నిర్మాణాలకు రెరా ఫైన్ వేయగలదే కాని నిర్మాణాలు చేయకుండా ఆపలేందు, అలాగే అనుమతి తీసుకోలేదని వాటిని కూల్చేసే అధికారం రెరాకు లేదు. అందుకనే రెరా అన్నది కోరలు లేని పాములాగ తయారైంది. అయితే రెరా తరహాలోనే రాష్ట్రప్రభుత్వం హైడ్రాకు చట్టబద్దత కల్పించబోతోంది. ఇపుడు హైడ్రా అంటే ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా అంతగా పాపులరైపోయింది. అగ్రిమెంటు దశలో ఉన్న నిర్మాణాలకు కొనుగోలుదారులు చెరువులు, కాల్వలు,కుంటలు, బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ అనే విషయాలను బిల్డర్లు, రియల్టర్లతో మాట్లాడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే తమ డబ్బులు వెనక్కు తీసుకుని అగ్రిమెంటును రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం.

కాబట్టి హైడ్రా అంటే ఏమిటి ? దేనికోసం ఏర్పాటైంది అనే విషయం జనాలకు బాగా తెలిసింది. అందుకనే నిర్మాణాలకు,కొనుగోళ్ళకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేస్తే ఎన్ఓసీ తీసుకోకుండా చేసే నిర్మాణాలను కూల్చేసే అధికారాలు హైడ్రాకు కల్పించబోతుండటంతో అక్రమనిర్మాణాలు ఆగిపోతాయని ప్రభుత్వం భావిస్తున్నది. మరిదంతా ఎంత తొందరగా పూర్తవుతుందో చూడాలి.

Tags:    

Similar News