రేవంత్ కు ‘బీసీ’ గండం ?

. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అని బీసీ సంఘాల నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు.

Update: 2024-09-26 07:30 GMT

రేవంత్ కు బీసీ గండం తప్పేట్లు లేదు. ఎందుకంటే బీసీల రిజర్వేషన్లపై డిమాండ్లు రోజురోజుకు పెరిగిపోతోంది. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అని బీసీ సంఘాల నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ విషయంలో వివిధ రాజకీయపార్టీల్లోనే బీసీల నేతలంతా ఏకమవుతున్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం ‘సమగ్ర కులగణన-సామాజికన్యాయం’ అనే అంశంపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రస్ధాయి అఖిలపక్ష సదస్సు జరిగింది. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ రాపోలు జ్ఞానేశ్వర అధ్యక్షతన సదస్సు జరిగింది. సదస్సుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ ఎంఎల్సీ ఎల్ రమణ, రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ ఛైర్మన్ బీఎస్ రాములు తదితరులు పాల్గొన్నారు.

సదస్సు ప్రధాన డిమాండు ఏమిటంటే రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందేనని. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కామారెడ్డిలో జరిగిన బీసీల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పై హామీని ప్రకటించింది. నిజానికి 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేది కూడా అనుమానంగానే తయారైంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై పెద్దగా మాట్లాడటంలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు రిజర్వ్ చేయబోతున్నట్లు ఏఐసీసీ అగ్రనేతల దగ్గర జరిగిన నిర్ణయమే అమలు కాలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలకు ఇచ్చింది 24 సీట్లు మాత్రమే. ఏఐసీసీ నిర్ణయం ప్రకారం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు రావాల్సింది. నిర్ణయాలు తీసుకోవటం వేరు అవి ఆచరణలోకి రావటం వేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. బీసీల టికెట్ల విషయంలో అసెంబ్లీ ఎన్నికల్లోనే నిర్ణయం అమలుకాలేదు. ఇక స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలవుతుందా అని పార్టీలోనే అనామానాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అన్నది రేవంత్ కు పెద్ద గండంగా తయారవబోతోంది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచకపోతే రాష్ట్రప్రభుత్వంతో యుద్ధమే జరుగుతుందని గుజ్జ సత్యం హెచ్చరించటం గమనార్హం. సమగ్ర కులగణతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని సత్యం అభిప్రాయపడ్డారు. కాని రేవంత్ ఆలోచన ప్రకారం ఇప్పటికిప్పుడు కులగణన సాధ్యంకాదు.

అందుకనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితా ప్రకారమే స్ధానికసంస్ధల ఎన్నికలను కూడా నిర్వహించేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సిఫారసుచేసింది. రేవంత్ కూడా దీనికే సుముఖంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే బీసీలకు రిజర్వేషన్లు 24 నుండి 50కి పెంచటం సాధ్యమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇదే విషయమై నవనిర్మాణ సంఘర్ణ సమితి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ మధుసూధనా చారి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ శాతం పెంచుతుందనే నమ్మకం లేదన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఇస్తామని చెప్పిన 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేది కూడా ఇపుడు అనుమానంగానే ఉందన్నారు. ఎందుకంటే రాజకీయంగా బీసీల ఎదుగుదలను రాజకీయపార్టీలు అంగీకరించలేకపోతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఏవేవో సాకులు చెప్పి బీసీల రిజర్వేషన్ శాతాన్ని తొక్కిపెడుతున్నట్లు ఆరోపించారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ శాతాన్ని కేసీఆర్ ప్రభుత్వం 30 నుండి 24 శాతానికి తగ్గించినట్లు మండిపడ్డారు. సర్పంచుగా పోటీచేయాలంటే రు. 5 కోట్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీచేయాలంటే కనీసం రు. 10 కోట్లు అవసరం అవుతుందని చెప్పి ఆర్ధిక కోణంలో కూడా బీసీలను రాజకీయపార్టీలు తొక్కిపెట్టేస్తున్నట్లు ఆరోపించారు. ఇపుడు బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు 50 శాతం కాదు గతంలో హామీ ఇచ్చినట్లుగా 42 శాతం రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీ సంఘాలు ఏమి చేస్తాయనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News