రేవంత్ ‘దెబ్బకు దెబ్బ’ వ్యూహం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు రేవంత్ పైన కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి కేసే పోలీసులు నమోదుచేసి అరెస్టు కూడా చేశారు.

Update: 2024-08-15 10:36 GMT

ఇపుడు నడుస్తున్నదంతా ప్రతీకార రాజకీయాలే. అధికారంలో ఉన్నపార్టీ తనిష్టారాజ్యంగా వ్యవహరిస్తే తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయిన తర్వాత దెబ్బకు దెబ్బ వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే కేటీఆర్ పై కేసు నమోదవ్వటమే ఇందుకు నిదర్శనం. పదేళ్ళ అధికారంలో అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ పైన రెండు విచారణ కమీషన్లు పనిచేస్తున్నాయి. వాటి విచారణ తర్వాత ఆ కమీషన్లు ఏమి రిపోర్టులు ఇస్తాయనే విషయం ఆసక్తిగా మారింది. రిపోర్టులిచ్చేవరకు కేసీఆర్ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదన్నది వాస్తవం.

అయితే ఈలోగానే పోలీసులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసు నమోదుచేశారు. ఎందుకంటే అనుమతి లేకుండా కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్ళారు. అక్కడ ప్రాజెక్టు మొత్తాన్ని ద్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. దాంతో అనుమతి లేకుండా ద్రోన్ కెమెరాని ఉపయోగించారని బృందానికి నాయకత్వం వహించిన కేటీఆర్ తో పాటు మరికొందరిపైన పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ కేసులో తనను పోలీసులు ఎక్కడ అరెస్టుచేస్తారో అనే భయంతో వెంటనే కేటీఆర్ కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన కోర్టు సెప్టెంబర్ 5వ తేదీవరకు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దాంతో సెప్టెంబర్ 5వ తేదీ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. 5వ తేది ముగిసిన వెంటనే పోలీసుల తరపున కచ్చితంగా ఏదో యాక్షన్ ఉంటుందనే ప్రచారం పెరిగిపోతోంది.

అసలు కేటీఆర్ అరెస్టు విషయంలో ఎందుకింత టెన్షన్ పడుతున్నట్లు ? ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు రేవంత్ పైన కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి కేసే పోలీసులు నమోదుచేసి అరెస్టు కూడా చేశారు. తర్వాత కోర్టులో ప్రవేశపెడితే జడ్జి 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. దాంతో రేవంత్ అప్పట్లో 14 రోజులు జైలులో గడిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2020లో రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ చేవెళ్ళ నియోజకవర్గం జన్వాడ గ్రామంలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించారు. ఆందోళనను అప్పట్లో కాంగ్రెస్ ద్రోన్ కెమెరాతో చిత్రీకరించింది. అందుకనే అనుమతిలేకుండా ద్రోన్ ఉపయోగించారనే కారణంగా పోలీసులు రేవంత్ తదితరులపై కేసులు నమోదుచేయటమే కాకుండా అరెస్టు కూడా చేశారు.

అనుమతిలేకుండా 2020లో ద్రోన్ ఉపయోగించారని పోలీసులు రేవంత్ పైన కేసుపెట్టి అరెస్టుచేసి కోర్టు ద్వారా రిమాండుకు తరలించిన విషయాన్ని రేవంత్ మరచిపోలేకపోతున్నట్లున్నారు. అందుకనే సమయం కోసం వెయిట్ చేశారు. ఇపుడు కేటీఆర్ తనంతట తానుగా జుట్టును రేవంత్ చేతికి అందించారు. మేడిగడ్డ సందర్శనకు అనుమతి తీసుకోలేదంటే ద్రోన్ కెమెరాలతో చిత్రీకరించటంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. కేసు నమోదైనట్లు తెలియగానే కేటీఆర్ క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. తమ హయాంలో రేవంత్ పైన కేసుపెట్టి అరెస్టుచేసి రిమాండ్ కు పంపినట్లే ఇపుడు తనను కూడా పోలీసులు కోర్టు ద్వారా రిమాండుకు పంపుతారనే టెన్షన్ కేటీఆర్లో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే అర్జంటుగా కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే కేటీఆర్ కోరుకున్నట్లు కేసును క్వాష్ చేయని కోర్టు సెప్టెంబర్ 5వ తేదీవరకు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే ఆదేశించింది. మరి సెప్టెంబర్ 5వ తేదీ తర్వాత ఏమి జరుగుతుందో చూడాలి.

రేవంత్ దెబ్బకు కేసీఆర్, కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నది మాత్రం వాస్తవం. పదేళ్ళ అధికారంలో కేసీఆర్, కేటీఆర్ ఏ విధంగా అయితే వ్యవహరించారో ఇపుడు రేవంత్ అచ్చంగా అలాగే వ్యవహరిస్తు దెబ్బకు దెబ్బ తీయక తప్పదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరీ సిద్ధాంతం ఎంతవరకూ వెళుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News