ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని టార్గెట్ చేసిన రేవంత్

ఒలంపిక్స్ లో బంగారుపతకాలు సాధించేంతస్ధాయిలో క్రీడాకారులకు అత్యుత్తమ కోచింగ్ ఇప్పించాలన్నది రేవంత్ ఆలోచన.

Update: 2024-08-18 08:32 GMT

హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారా ? ఒలంపిక్స్ అన్నది క్రీడలకు సంబంధించినది కదా రేవంత్ రెడ్డి బంగారుపతకంపై టార్గెట్ పెట్టడం ఏమిటనే సందేహం వచ్చిందా ? ఒలంపిక్స్ క్రీడలకు సంబంధించినది అనటంలో సందేహంలేదు. రేవంత్ బంగారుపతకం పై గురిపెట్టారని చెప్పటంలోను తప్పులేదు. ఒలంపిక్స్ కు రేవంత్ కు సంబంధం ఏమిటి ? ఏమిటంటే ఒలంపిక్స్ లో బంగారుపతకాలు సాధించేంతస్ధాయిలో క్రీడాకారులకు అత్యుత్తమ కోచింగ్ ఇప్పించాలన్నది రేవంత్ ఆలోచన. ఇందుకోసం వీలైనంత తొందరలోనే హైదరాబాద్ లోనే అంటే ఫోర్త్ సిటీలో కొత్తగా 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నది రేవంత్ టార్గెట్.



ఇందుకోసం ఇపుడు హైదరాబాద్ శివారులో ఉన్న హకీంపేట స్పోర్ట్స్ సెంటర్ ను రేవంత్ సందర్శించారు. ఇపుడు అందులో ఉన్న సౌకర్యాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలోనే స్కిల్ యూనివర్సిటి ఏర్పాటు చేసినట్లే తొందరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఏర్పాటవబోయే యూనివర్సిటిలో 12 క్రీడాంశాలకు సంబంధించిన ప్రపంచస్ధాయి అత్యున్నత ప్రమాణాలతో స్పోర్ట్స్ అకాడమీలు ఉండబోతున్నట్లు చెప్పారు. 12 క్రీడాంశాలు ఏవన్న విషయాన్ని రేవంత్ ప్రకటించలేదు. అయితే ఏర్పాటుచేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటిని దక్షిణకొరియా సియోల్ లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటితో అనుసంధానం చేయబోతున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ తో పాటు స్టోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ యూనివర్సిటీయే ఎందుకంటే ఈమధ్యనే పెట్టుబడుల ఆకర్షణకోసం రేవంత్ అమెరికాతో పాటు దక్షిణకొరియాలో కూడా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలోనే రేవంత్ కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. దీనికి ప్రత్యేక కారణం ఏమిటంటే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటి ప్రపంచంలోని అత్యుత్తమ స్పోర్ట్స్ యూనివర్సిటీల్లో ఒకటి. ఈ మధ్యనే ముగిసిన ప్యారిస్ ఒలంపిక్స్ లో కొరియా 32 పతకాలు సాధించింది. ఈ 32 పతకాల్లో కొరియన్ స్టోర్ట్స్ యూనివర్సిటి విద్యార్ధులే 16 పతకాలు సాధించారు. ఇందులో కూడా ఆర్చరీలో వరుసగా మూడు బంగారు మెడల్స్ సాధించిన లిమ్ సీ హైయన్ కొరియా స్టోర్ట్స్ యూనివర్సిటీ విద్యార్ధే. ఇందుకనే రేవంత్ ప్రత్యేకంగా లిమ్ తో కొద్దిసేపు మాట్లాడారు.



 అంతర్జాతీయ స్ధాయిలో పతకాలు సాదించటంలో కొరియన్ నేషనల్ స్టోర్ట్స్ యూనివర్సిటికి చాలా ఘనమైన ట్రాక్ రికార్డుంది. అందుకనే రేవంత్ ప్రత్యేకంగా ఫోర్త్ సిటిలో ఏర్పాటు చేయబోతున్న స్టోర్ట్స్ యూనివర్సిటీని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటితో అనుసంధానం చేయాలని డిసైడ్ అయ్యారు. దీనివల్ల వివిధ క్రీడల్లో నిపుణులైన కొరియా కోచ్ లు, అత్యంత ఆధునికమైన శిక్షణ పరికరాలు, మెళకువలను మన క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నది రేవంత్ భావన. వీలైనంత తొందరలోనే స్టోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటిలో పనిచేస్తున్న నిపుణులు, ఆధునిక శిక్షణా పరికరాలను ఇక్కడికి తెప్పించాలని రేవంత్ అనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే 2028లో జరగబోయే లాస్ ఏంజిలిస్ ఒలంపిక్స్ లో హైదరాబాద్ స్పోర్ట్స్ యూనివర్సిటి విద్యార్దులు కచ్చితంగా బంగారు పతకాలు సాధిస్తారని రేవంత్ చాలా దీమాగా ఉన్నారు. 



ఇప్పటికే వివిధ క్రీడల్లో ప్రతిభచూపుతున్న వాళ్ళని స్పోర్ట్స్ యూనివర్సిటిలో చేర్చుకుని వాళ్ళకి కొరియా కోచ్ లతో కోచింగ్ ఇప్పించి బాగా సానపెడితే రాబోయే ఒలంపిక్స్ లో బంగారు పతకాలు సాధిస్తారని రేవంత్ ఆశిస్తున్నారు. స్టోర్ట్స్ యూనివర్సిటీలో ప్రపంచస్ధాయి సౌకర్యాలు, కోచ్ లు, వసతులను ఏర్పాటు చేయాలని రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం దేశంలోని అనేక ప్రముఖ కార్పొరేట్ సంస్ధలను భాగస్వాములను చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల నిధుల కొరత ఉండదని రేవంత్ ఆలోచిస్తున్నారు. రేవంత్ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, ఆచరణలోకి వస్తే గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా హైదరాబాద్ స్పోర్ట్స్ యూనివర్సిటి విద్యార్ధులు లాస్ ఏంజెలిస్ ఒలంపిక్స్ లో బంగారు పతకాలు సాధిస్తారేమో ? సంకల్పం మంచిదైతే ఫలితం అదే వస్తుందని పెద్దలు చెబుతారు కదా.

Tags:    

Similar News