రేవంత్ సెంటిమెంటునే నమ్ముకున్నారా ?

పై ముగ్గురిని జనాలు రెండోసారి గెలిపించారంటే అప్పటి పరిస్ధితులు వేరని రేవంత్ మరచిపోయినట్లున్నారు. అలాగని కాంగ్రెస్ ను జనాలు రెండోసారి గెలిపించకూడదని ఏమీలేదు.

Update: 2024-09-15 07:00 GMT

రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలను చూస్తే రెండోసారి అధికారంలోకి వచ్చే విషయంలో సెంటిమెంటునే బాగా నమ్ముకున్నట్లు అర్ధమవుతోంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఏమన్నారంటే గతంలో చంద్రబాబునాయుడు, వైఎస్సార్, కేసీఆర్ కు ప్రజలు రెండుసార్లు వరుసగా అవకాశం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ను కూడా రెండోసారి గెలిపిస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. పై ముగ్గురిని జనాలు రెండోసారి గెలిపించారంటే అప్పటి పరిస్ధితులు వేరని రేవంత్ మరచిపోయినట్లున్నారు. అలాగని కాంగ్రెస్ ను జనాలు రెండోసారి గెలిపించకూడదని ఏమీలేదు. అయితే జనాలు ఏ పార్టీని ఎందుకు గెలిపిస్తారో ? ఏ పార్టీని ఎందుకు ఓడగొడతారో ఎవరూ చెప్పలేరు.

చంద్రబాబును రెండోసారి గెలిపించారంటే అందుకు మాజీ ప్రధానమంత్రి ఏబీ వాజ్ పేయ్ కారణమని చెప్పాలి. జనాలు ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీని గెలిపించారు కాని చంద్రబాబును కాదు. ఎన్టీఆర్ కు వెన్నుపోటుపొడిచి ముఖ్యమంత్రి కుర్చీని చంద్రబాబు 1995లో లాక్కున్నారు. తర్వాత 1999లో బీజేపీతో పొత్తు+కార్గిల్ యుద్ధం పుణ్యమాని టీడీపీ రెండోసారి గెలిచింది. అలా చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక దివంగత ముఖ్యమంత్ర వైఎస్సార్ నాయకత్వం, పాలనలో సంస్కరణల కారణంగా కాంగ్రెస్ రెండుసార్లు 2004, 09 అధికారంలోకి వచ్చింది.

కేసీఆర్ విషయం తీసుకుంటే పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఇక్కడ పాలన, నాయకత్వం కన్నా సెంటిమెంటు ఎక్కువగా ప్లే చేసింది. 2014లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జనాలు సెంటిమెంటుతో టీఆర్ఎస్ ను గెలిపించారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణా ఏర్పాటుకు ఐదేళ్ళు సరిపోలేదని అనుకున్న జనాలు భావోద్వేగంతో టీఆర్ఎస్ ను రెండోసారి కూడా గెలిపించారు. అప్పటికే ప్రతిపక్షాలను కేసీఆర్ చీలికలు పేలికలు చేసుండటం కూడా టీఆర్ఎస్ విజయానికి అనుకూలించింది. అయితే 2023 ఎన్నికలకు జనాల్లో భ్రమలన్నీ తొలగిపోయాయి. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చివరి రెండునెలల్లో బాగా పుంజుకుని అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో పీసీసీ ప్రెసిడెంటుగా పనిచేసిన రేవంత్ కన్నా ఈ విషయం బాగా తెలిసిన వాళ్ళుండరు.

కాబట్టి చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ రెండుసార్లు వరుసగా గెలిచారు కాబట్టి కాంగ్రెస్ కూడా రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందని అనుకుంటే పొరబాటనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం లేదా ఓడటం అన్నది రేవంత్ చేతిలోనే ఉంది. మంచి పాలనతో జనాలను మెప్పించగలిగితే జనాలు ఓట్లేస్తారు లేకపోతే లేదు. ఇపుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలే అయ్యింది. పాలనతో జనాలను మెప్పించి ఆకట్టుకోవటానికి రేవంత్ కు ఇంకా నాలుగేళ్ళ సమయముంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎంతకాలం ఉంటారో ఎవరూ చెప్పలేరు. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి, దూకుడు తగ్గించి, జనహితమే లక్ష్యంగా రేవంత్ పాలన చేస్తే జనాలు మెచ్చి కాంగ్రెస్ కు రెండోసారి పట్టం కట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు రేవంత్ పాలనకు మంచి మార్కులే పడతాయి. భవిష్యత్తు సంగతి ఎవరూ చెప్పలేరు కదా.

Tags:    

Similar News