Revanth |రేవంత్ వ్యూహం మార్చాడా ?

పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన చేరికలను చూసిన తర్వాత ఈ విషయం అర్ధమవుతోంది.

Update: 2024-12-06 05:06 GMT

రేవంత్ రెడ్డి వ్యూహంలో మార్పులు చేసినట్లే ఉన్నాడు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన చేరికలను చూసిన తర్వాత ఈ విషయం అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బొమ్మ ఆధ్వర్యంలో బీజేపీ ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు, బీఆర్ఎస్ అసిఫాబాద్ మాజీ ఎంఎల్ఏ ఆత్రం సక్కు కాంగ్రెస్(Congress) లో చేరారు. ఇప్పటివరకు రేవంత్(Revanth) టార్గెట్ అంతా బీఆర్ఎస్(BRS) ఎంఎల్ఏలు, ఎంఎల్సీలపైనే ఉంది. బీఆర్ఎస్ ను లేవకుండా దెబ్బకొట్టడమే టార్గెట్ గా ఇప్పటివరకు కారుపార్టీకి చెందిన 10 మంది ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలను కాంగ్రెస్ లోకి లాగేసుకున్నారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy), కేపీ వివేకానందగౌడ్ కోర్టులో కేసులు వేయటంతో రేవంత్ జోరు తగ్గించారు.

అయితే వీళ్ళ కేసును విచారించిన తెలంగాణా హైకోర్టు(Telangana High Court) వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఫిరాయింపు ఎంఎల్ఏల(Defection MLAs)పై వేటు వేసేవిషయంలో అసెంబ్లీ స్పీకర్ కు తాము గడువు నిర్దేశించలేమని స్పష్టంగా తీర్పిచ్చింది. కోర్టు తీర్పుతో ఫిరాయింపుల్లో ఫుల్లు జోష్ మొదలైంది. అలాగే మరిన్ని ఫిరాయింపులకు తెరలేపటానికి రేవంత్ కూడా లైన్ క్లియర్ అయినట్లే అనుకోవాలి. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో కేసీఆర్(KCR) కూడా ఇలాంటి ఫిరాయింపులు చాలానే చేశారు. తాము అధికారంలో ఉన్నపుడు ఫిరాయింపులకు యధేచ్చగా పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్(KTR), హరీష్(Harish) లు ఇపుడు అదే ఫిరాయింపులు ఎదురుతిరిగి తమ మెడకే చుట్టుకునేటప్పటికి గిలగిల్లాడిపోతున్నారు. కోర్టుతీర్పుతో లైను కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి తొందరలోనే మళ్ళీ ఫిరాయింపులు ఉంటాయని అనుకోవాలి. అయితే ఇపుడు రేవంత్ మార్చిన వ్యూహం ఏమిటంటే మాజీలను కూడా చేర్చుకోవాలని. అదికూడా బీఆర్ఎస్ నుండి మాత్రమే కాదు బీజేపీ నుండి కూడా వలసలను ప్రోత్సహించాలని.


ఇందులో భాగంగానే బీజేపీ(BJP) మాజీ ఎంపీ సోయం బాపూరావుతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ ఆత్రంసక్కును కాంగ్రెస్ లో చేర్చుకున్నది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి ఫిరాయింపులు, వలసలను ప్రోత్సహించిన రేవంత్ మొదటిసారి బీజేపీ నుండి కూడా చేర్చుకున్నారు. మామూలుగా అయితే తమ పార్టీనుండి ఇతర పార్టీల్లోకి వలసలు జరగటాన్ని బీజేపీ అంగీకరించదు. మిగిలిన పార్టీలు కూడా బీజేపీలో నుండి నేతలను లాక్కునేందుకు ఆసక్తి చూపదు. పదేళ్ళ హయంలో కేసీఆర్ ఫిరాయింపులు, వలసలన్నీ టీడీపీ, కాంగ్రెస్ నుండే ప్రోత్సహించారు కాని బీజేపీ జోలికి వెళ్ళలేదు. కారణం ఏమిటంటే కేంద్రంలో బీజేపీ చాలా బలంగా ఉండటమే. ఇతర పార్టీల నుండి ప్రజాప్రతినిధులను, నేతలను బీజేపీ లాక్కుంటుంది కాని తమ పార్టీలో నుండి ఇతర పార్టీల్లోకి చేరిన నేతల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. చేరిన నేతలతో పాటు చేర్చుకున్న పార్టీలను కూడా ముప్పుతిప్పలు పెడుతుంది.

ఎలాగంటే దర్యప్తుసంస్ధలను ఉసిగొలిపి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఇప్పటికే చాలామంది పార్టీమారిన నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు కొదవేలేదు. కర్నాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సా, మిజోరం లాంటి రాష్ట్రాల్లో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ కూడా పదేళ్ళల్లో ఎప్పుడూ బీజేపీ జోలికి పోలేదు. అలాంటిది రేవంత్ ధైర్యంగా బీజేపీ మాజీ ఎంపీ బాపూరావును చేర్చుకున్నారు. అంటే ఏదో పెద్ద వ్యూహంతోనే ఉన్నారని అర్ధమవుతోంది. తొందరలోనే జరగబోతున్న స్ధానికసంస్ధల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాజీ ప్రజప్రతినిధులను, ద్వితీయశ్రేణి నేతలను కూడా ప్రతిపక్షాల నుండి చేర్చుకోవాలని డిసైడ్ అయినట్లున్నారు. ఇందులో భాగంగానే బాపూరావు, సక్కులను చేర్చుకున్నారు. భవిష్యత్తులో ఇంకెతమంది ప్రజా ప్రతినిధులతో పాటు మాజీలను చేర్చుకుంటారో చూడాలి.

Tags:    

Similar News