‘రెడ్ బుక్‌లో అదే ఉంది’.. తాడేపల్లిలో నారా లోకేష్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లను సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి.

Update: 2024-08-16 06:29 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. రెడ్‌బుక్ రాజ్యాంగామే అమలవుతుందని, రెడ్ బుక్‌ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా అసలు రెడ్‌బుక్‌లో ఏముందో అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అయితే తాజాగా ఈ రెడ్‌బుక్‌లో ఏముందో చెప్పేశారా నారా లోకేష్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లను సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ ఈరోజు గుంటూరు జిల్లా తాడిపల్లి మండలంలోని నులకపేటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం తానే స్వయంగా ప్రజలకు అల్పాహారం వడ్డించారు. అన్న క్యాంటీన్ల ద్వారా చాలీచాలని జీతాలతో జీవిస్తున్న వారికి రూ.5 నాణ్యమైన ఆహారం అందిస్తాయని చెప్పారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు లోకేష్.

 

హిందూపురంలో బాలకృష్ణ

నిన్న చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించగా ఈరోజు మరో 99 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఇందులో భాగంగానే హిందుపురంలో బాలకృష్ణ.. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతన్ కూడా పాల్గొన్నారు. అనంతరం బాలకృష్ణ కూడా తానే స్వయంగా వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఆకలి తీర్చడానికి అప్పట్లో ఎన్‌టీఆర్‌ రూ.2 బియ్యాం అందించారని, ఇప్పుడు రూ.5 భోజనం పెడుతున్నామని అన్నారు. ఆగిపోయిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

‘‘అన్న క్యాంటీన్లు పేదల కడుపు నింపుతాయి. ఈ క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కావడం పండగ లాంటి విషయం. సీఎం చంద్రబాబుకు హిందూపురం అంటే ఎంతో ప్రత్యేక అభిమానం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వవైభవం మళ్ళీ తీసుకొస్తాం’’ అని ప్రకటించారు.

 

ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: లోకేష్

అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టాలను ఉల్లంఘించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టమని అన్నారు. ‘‘ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లను మాత్రమే శిక్షిస్తాం. రెడ్ బుక్‌లో కూడా అదే ఉంది. తప్పు చేసిన జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేయడం తప్పా. అన్యాయంగా అగ్రిగోల్డ్ భూములను కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవద్దా? వైసీపీ హయాంలో జరిగిన ప్రతి అవినీతి కుంభకోణాన్ని బయటకు తీసి చట్ట ప్రకారం శిక్షిస్తాం. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం. గోల్డ్ హబ్ ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి. త్వరలోనే భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటుకు కృషి చేస్తాం’’ అని వెల్లడించారు.

Tags:    

Similar News