రసాయనాలు తగ్గించి సేంద్రీయాన్ని పెంచాలి
రైతు సంక్షేమం, సేంద్రీయ సాగుపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రైతు సేవా కేంద్రాల బలోపేతం, భూసారం పెంపుకు ఆదేశాలు జారీ చేశారు.
రసాయనాలు తగ్గించి సేంద్రీయాన్ని పెంచాలి భూసారం పెంచాలి అని, ఆ దిశగా రైతులలో అవగాహన పెంచేందుకు కర్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో రైతుల సంక్షేమం, ఉత్పాదకత పెంపు, సేంద్రీయ సాగు ప్రోత్సాహం, భూసారం మెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
రైతు సేవా కేంద్రాల బలోపేతం
సీఎం చంద్రబాబు రైతు సేవా కేంద్రాలను (RSKs) మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాలు రైతులకు ప్రభుత్వ సేవలు, సాంకేతిక సహాయం, సమాచారం అందించే కీలక వేదికలుగా మారాలని సూచించారు. "రైతు సేవా కేంద్రాలు రైతులకు ఒకే చోట అన్ని సేవలు అందించే వన్-స్టాప్ సెంటర్‌లుగా ఉండాలి" అని ఆయన ఉద్ఘాటించారు. ఈ కేంద్రాలను రీ-ఓరియంటేషన్ ప్రక్రియ ద్వారా పునర్వ్యవస్థీకరించి, రైతులకు సులభతరం చేయాలని, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
సేంద్రీయ సాగు, భూసారం పెంపు
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ సాగును ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. "ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు, రైతులకు ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుతాయి. ఈ విషయాన్ని రైతులకు వివరించాలి" అని ఆయన పేర్కొన్నారు. భూసారం పెంపు కోసం ఉపయోగించే పోషకాలలోని లోపాలను సవరించి, తదుపరి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంచి పోషక విలువలతో పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలని సీఎం ఉద్ఘాటించారు.
క్షేత్రస్థాయిలో అమలు, అవగాహన
క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బందికి పూర్తి అవగాహన ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. సేంద్రీయ సాగు, భూసారం మెరుగుదల, రైతు సేవా కేంద్రాల ద్వారా సేవలు సమర్థవంతంగా అమలు కావాలని ఆదేశించారు. "రైతుల ఆదాయం పెంచడమే మన లక్ష్యం. దీనికి సాంకేతికత, అవగాహన, సమర్థవంతమైన సేవలు కీలకం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.