రతన్ టాటాకు ‘భారతరత్న’ కూడా తక్కువే

ఘనచరిత్ర సాధించిన రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్ కాదు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించినా తక్కువే.

Update: 2024-10-10 07:39 GMT

పారిశ్రామిక దిగ్గజం రతన్ నావల్ టాటా వెళ్ళిపోయారు. 83 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో ముంబాయ్ లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చివరి శ్వాస వదిలేశారు. వ్యాపారం చేయటం అంటే డబ్బు సంపాదించుకోవటం మాత్రమే కాదని, విలువలు, విశ్వసనీయతను కాపాడుకోవాలని చాటిచెప్పిన వ్యక్తి టాటా. దేశంలో ఎంతోమంది అపరకుబేరులున్నారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదాని లాంటి ఎంతోమంది సంపద అన్ని లక్షల కోట్లని, ఇన్ని లక్షల కోట్లరూపాయలని ఫోర్బ్స్ పత్రిక రెగ్యులర్ గా పెద్ద జాబితానే ప్రచురిస్తుంది. భారతదేశంలో కూడా వేలకోట్ల రూపాయల సంపదకు అధిపతులుగా ఉన్న వాళ్ళ పేర్లు ప్రముఖంగా కనబడుతుంటుంది. కాని ఒక్కసారి కూడా రతన్ టాటా పేరు ఆ జాబితాలోకి ఎక్కలేదు.

ఇపుడు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా పాపులరైన చాలామందితో పోల్చుకుంటే రతన్ ఎన్నో సంవత్సరాల ముందే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కాని ఎందుకని కుబేరుల జాబితాలో రతన్ టాటా పేరును మనం చూడలేదు ? ఎందుకంటే టాటా ఎప్పుడూ సంపాదన కోసమే వ్యాపారాలు చేయలేదు, పరిశ్రమలు స్ధాపించలేదు. వ్యాపారసామ్రాజ్యాన్ని ఎంతగా విస్తరించినా మానవ విలువలు, సేవ అన్నది చాల ముఖ్యమని రతన్ భావించారు. కాబట్టే సంపద పోగేసుకోవటం మీద దృష్టిపెట్టలేదు. ఒక అంచనా ప్రకారం టాటా గ్రూపు వ్యాపార సామ్రాజ్యం విలువ రు. 34 లక్షల కోట్లు. గ్రూపులో సుమారు 190 కంపెనీలున్నాయి. ఈ కంపెనీల్లో లక్షలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులను కేవలం సంపాదనకు పనికొచ్చే పనిముట్లుగానే కాకుండా మానవత్వంతో చూసుకున్నారు. కరోనా వైరస్ తో దేశమంతా ఇబ్బందులు పడిన కాలంలో తమ ఉద్యోగులకు నూరుశాతం అండగా నిలబడిన సంస్ధ టాటా గ్రూప్. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను కాపాడుతామని యాజమాన్యం అప్పట్లో విడుదల చేసిన ఒక సర్క్యులరే టాటా మానవతకు నిదర్శనం. ఎవరైనా ఉద్యోగి మరణిస్తే సర్వీసులో మిగిలిన కాలమంతా మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రతినెలా జీతం అందిస్తామని టాటా ప్రకటించారు. అలాగే ఫ్రంట్ లైన్ ఉద్యోగుల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల చదువు బాధ్యత కూడా యాజమాన్యమే తీసుకుంది. దేశం మొత్తంమీద ఉద్యోగులను కన్నబిడ్డల్లాగ చూసుకున్న యాజమాన్యం టాటా గ్రూప్ తప్ప మరోటిలేదేమో.

విలువలతో కూడిన వ్యాపారాలు చేయాలన్న టాటా తీసుకున్న నిర్ణయం వల్లే, ఆచరించిన సిద్దాంతాల వల్లే ఎప్పుడూ అపరకుబేరుల జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయారు. అందుకనే రిలయన్స్ కంపెనీ, అదాని కంపెనీల ముద ఎన్ని ఆరోపణలు, విమర్శలున్నా టాటా గ్రూప్ మీద ఎక్కడా ఒక్క ఆరోపణ కూడా వినబడలేదు. రతన తన సంపాదనలో 65 శాతం కేవలం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేసేవారు. రతన్ కు తెలంగాణాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. హైదరాబాద్ లో ఏరోస్పేస్ టెక్కాలజీ డెవలప్మెంట్ పై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. 2015లో ఏర్పాటైన టీ హబ్ ప్రారంభోత్సవంలో రతన్ పాల్గొన్నారు. గ్రూపులోని సుమారు 190 కంపెనీల్లో హైదరాబాద్ లో కనీసం 60 బ్రాంచీలు ఉన్నాయి. దేశంలో టాటా కంపెనీ పారిశ్రామిక పునాది పడింది రతన్ పుట్టకముందే అయినా దాన్ని ఆకాశమంత ఎత్తుకు విస్తరించింది మాత్రం నిస్సందేహంగా రతన్ టాటా అనే చెప్పాలి.

దేశాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించిన అతికొద్దిమంది పారిశ్రామికవేత్తల్లో రతన్ ముందుంటారని చెప్పటం అతిశయోక్తి కానేకాదు. ఇంతటి ఘనచరిత్ర సాధించిన రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్ కాదు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించినా తక్కువే. దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నే కాబట్టి ఆ పురస్కారంతో సత్కరించటం అంటే భారతదేశం తనను తాను సత్కరించుకోవటమే అనటంలో సందేహంలేదు. గురువారం ఉదయం జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది.

Tags:    

Similar News