క్లాస్‌ రూమ్‌ లోనే అత్యాచారం

బాలికను క్లాస్‌లో ఉన్న బాలుడు ఎవ్వరూ లేని సమయంలో అక్కడే అత్యాచారం చేశాడు. దీనిని వీడియో తీసి నలుగురు యువకులు వాట్సాప్ లో పోస్టు చేశారు. తర్వాత ఏమి జరిగింది?

Update: 2024-05-23 11:41 GMT

కొందరు యువకుల చెడు ప్రవర్తన వల్ల ఆ ఊరికి, ఊర్లోని స్కూలుకు చెడ్డపేరొచ్చింది. పదో తరగతి చదువుతున్న బాలికను అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలుడు క్లాస్‌రూమ్‌లోనే అత్యాచారం చేశాడు. అత్యాచారం జరుగుతున్న సమయంలో చూసి ఆపాల్సిన నలుగురు యువకులు వారికి తెలియకుండా వెనుకవైపు దాక్కుని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశారు. దీంతో ఆ ఊరు, స్కూలు పేరు సోషల్‌ మీడియాకు ఎక్కింది. పోలీసు రికార్డుల్లో నమోదైంది. నేరం చేసిన వాడితో పాటు నేరాన్ని చూసి మరింత చెడు ప్రచారం చేసిన వాడు కూడా అంతే శిక్షకు అర్హుడని పోలీసులు చెబుతున్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఈ సంఘటన ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం చింతపాడు హైస్కూలులో ఈనెల 15న జరిగింది.

సర్టిఫికెట్ కోసం వచ్చి..

స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చారు. ఇటీవలే పదో రతగతి పరీక్షలు జరిగి రిజల్ట్‌ వచ్చాయి. పాసైన వారికి సర్టిఫికెట్లు స్కూల్లోనే తీసుకోవాల్సిందిగా హెడ్‌మాస్టర్లు చెప్పడంతో ఆయా స్కూళ్ల వద్దకు వెళ్లి సర్టిఫికెట్లు తీసుకునే పనిలో విద్యార్థులు ఉన్నారు. చింతపాడు హైస్కూలులో పదో తరగతి చదివిన బాలిక సర్టిఫికెట్లు తీసుకునేందుకు మధ్యాహ్నం స్కూలుకు వెళ్లింది. ఆబాలికతో పాటే అదే క్లాసుకు చెందిన విద్యార్థి కూడా సర్టిఫికెట్ల కోసం వచ్చాడు. స్కూల్లో సర్టిఫికెట్లు ఇచ్చే టీచర్‌ లేకపోవడంతో బాలిక వెనుదిరిగింది. బాలిక వెనకే వస్తూ బాలుడు (ఇరువురి వయస్సు 15 సంవత్సరాలు) క్లాస్‌రూమ్‌లోకి అమ్మాయిని లాక్కుపోయాడు. ఆ సమయంలో స్కూలు గ్రౌండ్‌లో సిగరెట్లు, మందు తాగుతూ కూర్చున్న నలుగురు యువకులు చూశారు. వీరి వెనుకవైపు నుంచి దగ్గరగా వచ్చి రేప్‌ జరుగుతున్న సీన్‌ను సెల్‌ఫోన్‌లో బంధించారు. బాలుడు బయటకు రాగానే నలుగురు యువకులు రూము వద్దకు వచ్చి మా కోర్కె తీర్చాలని, ఇక్కడ జరిగిన వ్యవహారం వీడియో తీశామని బాలికను బెదిరించారు. బాలిక ఏడ్చుకుంటూ పరుగులు తీసింది. చిన్నగా ఇంటికి చేరుకుని జరిగిన విషయం తల్లికి బాలిక చెప్పింది. వీడియో తీసిన నలుగురు యువకులు బాలిక తల్లి వద్దకు వెళ్లి మాకు డబ్బులు ఇవ్వాలని, కనీసం పది లక్షలు ఇస్తే విషయం బయట పెట్టకుండా వుంటామన్నారు. మా వద్ద అంత డబ్బులు లేవని, రెండు లక్షలు ఇస్తామని తల్లి ప్రాధేయపడింది. అందుకు వారు అంగీకరించలేదు. వీడియోను వాట్సాప్‌లో వారి స్నేహితులకు పంపించారు. అది కాస్త అన్ని గ్రూపుల్లోకి షేర్‌ అయింది. దీంతో బాలిక తల్లి మండవల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది.
ఎవరీ నలుగురు... అక్కడ వారికేంపని..
చింతపాడు స్కూలు గ్రౌండ్‌లో ఈనెల 15న మందు, సిగరెట్లు తాగుతూ కూర్చున్న నలుగురు యువకులు చేపలు పట్టే (వల పనులు) కుటుంబాల వారు. భలే సుబ్రమణ్యం (22), గంటసాల చంద్రశేఖర్‌ (22), పెద్దిశెట్టి ధర్మ నాగ తేజ (19), జయమంగళ హరికృష్ణ (20)లు ఆకతాయిగా తిరగటం అలవాటు చేసుకున్నారు. వీరిలో గంటసాల చంద్రశేఖర్‌ క్రిమినల్‌ రికార్డు ఉన్న వాడు. ఒక హత్య కేసులో, మూడు కొట్లాట కేసుల్లో నిందితుడు. చంద్రశేఖర్‌ పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పరువు పోతుందని వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇతని పోకడ నచ్చక భార్య విడాకులు తీసుకుంది. చిల్లరగా తిరగటం మొదలు పెట్టాడు. ఎవరినంటే వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు గుంజే కార్యక్రమాలు చేస్తున్నాడు. భలే సుబ్రమణ్యం ఇటే వలే ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరు యువకులకు పెళ్లి కాలేదు. స్కూలు కొల్లేరు లంక గ్రామాల మధ్య ఉంటుంది. మెయిన్‌ రోడ్డుకు కొద్ది దూరంలో ఉన్నందున ప్రత్యేకంగా అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. చదువుకునే విద్యార్థులు మాత్రమే స్కూలు సమయంలో వెళ్లి వస్తుంటారు. స్కూలు సమయం ముగిసిన తరువాత, సెలవు రోజుల్లో ఈ స్కూలు గ్రౌండ్‌ పనికి మాలిన పనులకు అడ్డాగా మారింది. మందుతాగే బ్యాచ్‌ల వారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. స్కూలు ఆవరణ పూర్తిగా కాంపౌండ్‌ వాల్‌ ఉంటే కొంత కంట్రోల్‌ ఉండేది. అటువంటిదేమీ లేకపోవడంతో రేకుల షెడ్లు వేసిన చోట కూర్చుని మద్యం సేవించడం ఇక్కడి ఆకతాయిలకు పరిపాటిగా మారింది.
ఈ నలుగురిలో చంద్రశేఖర్‌ నేర స్వభావం ఉన్న వాడు కావడంతో మిగిలిన వారిని కూడా అలాగే తయారు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. స్కూల్లోనే బాలికపై అత్యాచారం జరగటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చింతపాడు స్కూలుకు పంపించాలంటేనే హడలి పోతున్నారు.
బాలికపై అత్యాయారానికి పాల్పడిన మైనర్‌ బాలుడితో పాటు నలురుగురు యువకులను మండవల్లి ఎస్ఐ రామచంద్రరావు అరెస్ట్‌ చేశారు. బుధవారం వీరిని కోర్టుకు హాజరు పరచగా నలుగురు యువకులకు 14 రోజులు కోర్టు రిమాండ్‌ విధించింది. అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జువైనల్‌ హోంకు తరలించారు.
Tags:    

Similar News