అమరావతిలో 212 కోట్లతో రాజ్ భవన్
అమరావతి అభివృద్ధితో పాటు స్థానిక రైతులూ అభివృద్ధి చెందాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్డీఏ అథార్టీ ఆమోదం తెలిపింది. అమరావతి అభివృద్ధితో పాటు... రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను తక్షణం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 53వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. మొత్తంగా 18 అంశాలపై అథార్టీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”రాజధాని నిర్మాణ పనులు రీ-స్టార్ట్ చేశాం. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులకే మొదటగా రాజధాని అభివృద్ధి ఫలాలు అందాలి. రాజధాని రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదు. భూములిచ్చిన రైతులకు ఎక్కడ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పామో... అక్కడే ఇవ్వాలి. ఏ ఊళ్లో భూములిచ్చిన వారికి ఆ ఊళ్లోనే ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చాం.. అలాగే ఎలాట్మెంట్ చేయాలి. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరగాలి. సెక్రటేరీయేట్ టవర్లతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. వెస్ట్ బైపాస్ రోడ్డును వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ఏమైనా సాంకేతిక ఇబ్బందులుంటే.. వాటిని వెంటనే పరిష్కరించుకుని ఖాజా టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారిని చేరేలా ఉన్న రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. కరకట్ట రోడ్డును విస్తరించాలి. మూడు నెలల్లో రాజధాని నగరాన్ని ఓ రూపునకు తీసుకురావాలి.” అని సీఎం చెప్పారు.