గద్వాల చీరకు అంత సొగసు పాపులారిటి ఎలా వచ్చింది?

కొత్తగా పట్టు+కాటన్ కలగలిపి చీరలు నేస్తే ఎలాగుంటుందన్న ఆలోచన మహారాణికి వచ్చింది. అదే విషయాన్ని కంచి, బెనారస్ లో శిక్షణ తీసుకొచ్చిన 12 మంది చేనేతలతో మాట్లాడారు.

Update: 2024-08-13 08:00 GMT

దేశంలో ఎన్నో ప్రాంతాల్లో రకరకాల చీరలు నేస్తుంటారు. ఏ ప్రాంతంలో నేసే చీర ఆ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకం. ధర్మవరం పట్టు, కంచిపట్టు, వెంకటగిరి నేత, బెనారస్ పట్టుచీరల్లాగ. అయితే గద్వాలలో నేసే చీరలు దేశంమొత్తంమీద చాలా ప్రత్యేకం. దేశంలోని మరే ప్రాంతానికి లేనంత ప్రత్యేకత గద్వాల చీరల్లో మాత్రమే ఎందుకుంది ? గద్వాల చీరలు ఎందుకింత పాపులరైంది ? ఎందుకంటే రెండు రకాల వస్త్రాలను మిశ్రమంచేసి గద్వాలలో చీరలను నేస్తారు కాబట్టే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిచీరకు బార్డర్ తో పాటు పల్లు అంటే కొంగు ఉంటుందని అందరికీ తెలిసిందే. మామూలుగా ఏ ప్రాంతంలో చీరలు నేసినా పూర్తి కాటన్ లేదా పట్టు లేదా ఏదో ఒకరకమైన బట్టతో మాత్రమే తయారవుతాయి. కాని గద్వాలలో మాత్రం బార్డర్, కొంగును పట్టుతోను మధ్యలోని చీరమొత్తాన్ని కాటన్ తో నేస్తారు. పట్టు+కాటన్ మిశ్రమంతో చీరలు నేస్తారు కాబట్టే దేశం మొత్తంమీద గద్వాల చీరలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కాటన్+పట్టుతో కలిపి చీరను నేసే ప్రక్రియ దేశంలో గద్వాలలో తప్ప ఇంకెక్కడా కనబడదు. అందుకనే గద్వాల పట్టుచీరలు ఎంతో ప్రత్యేకం.

అసలు కాటన్, పట్టు మిశ్రమంతో చీరలను నేయాలనే ఆలోచన గద్వాలలోని చేనేతలకు ఎలాగ వచ్చింది ? ఎలాగ వచ్చిందంటే నిజానికి ఈ ఆలోచన చేనేత కార్మికులది కాదు. గద్వాల సంస్ధానం మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మది. ఆమెకు రకరకాల చీరలంటే మహా ఇష్టం. వివాహం చేసుకుని ఆదిలక్ష్మిదేవమ్మ వచ్చేనాటకే గద్వాలలో కాటన్ తో దోవతులు, చీరలు, తువాళ్ళను నేసేవారు. సహజంగానే తనకున్న ఇష్టం కారణంగా కంచి, బెనారస్ పట్టుచీరల్లాంటివి గద్వాలలో ఎందుకు నేయటంలేదన్న విషయాన్ని వాకాబుచేశారు. కాటన్ తోనే తప్ప పట్టుతో చీరలు నేయటం కార్మికులకు తెలీదన్న విషయం అర్ధమైంది. అందుకనే తనకున్న పరిచయాలతో 1930 ప్రాంతంలోనే గద్వాలలోని చేనేత కార్మికులను కంచి, బెనారస్ పంపించి పట్టుచీరలు నేయటంలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు.

మహారాణి చొరవ 



వెంటనే అందుకు అవసరమైన ఏర్పాటుచేశారు. చేనేతల్లో బాగా నైపుణ్యం ఉన్న 12 మందిని ఎంపికచేసి కంచి, బెనారస్ కు పంపించారు. దాదాపు ఆరుమాసాల పాటు పట్టుచీరలు నేయటంలో 12 మంది కంచి, బెనారస్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ లో భాగంగా కంచి, బెనారస్ లోనే పట్టుచీరలు నేయటం అలవాటు చేసుకున్నారు. పట్టుచీరలు నేయటంలో తమకు మెళకువలు బాగా వంటబట్టాయని శిక్షణ ఇప్పించిన వారు చెప్పిన తర్వాత అందరు తిరిగి గద్వాలకు వచ్చేశారు. చేనేత వస్త్రాలను నేసే మగ్గాలు మాత్రమే తెలిసిన చేనేతలకు పట్టువస్త్రాలు తయారుచేసే మగ్గాలు మొదటిసారి గద్వాల మహారాణి వల్లే పరిచయమయ్యాయి. పట్టుచీరలు నేయటానికి అవసరమైన మగ్గాలను సిద్ధం చేయించటంలోను, పట్టును గద్వాలకు తెప్పించటంలోను మహారాణి బాగా చొరవ తీసుకున్నారు. మగ్గాలు, పట్టు గద్వాలకు రావటంతో పట్టుచీరలు నేయటంలో తాము నేర్చుకున్న పద్దతులు, మెళకువలను 12 మంది ఆదిలక్ష్మి దేవమ్మకు చూపించారు. శాంపుల్ గా ఉంటుందని కొన్ని చీరలు నేసి మహారాణికి బహుమానంగా ఇచ్చారు. అప్పటికే కంచి, బెనారస్ పట్టుచీరలు మహారాణికి కొత్తేమీ కాదు.

అందుకని కంచి, బెనారస్ పట్టుచీరలకు భిన్నంగా ఏమైనా ఉంటే బాగుండేదని మహారాణి ఆలోచించారు. కంచి, బెనారస్ లో పట్టు చీరలు తప్ప ఇంకేమీ నేయరు. అలాగే గద్వాలలో కాటన్ వస్త్రాలు తప్ప రెండో రకం నేయటం తెలీదు. అందుకనే కొత్తగా పట్టు+కాటన్ కలగలిపి చీరలు నేస్తే ఎలాగుంటుందన్న ఆలోచన మహారాణికి వచ్చింది. అదే విషయాన్ని కంచి, బెనారస్ లో శిక్షణ తీసుకొచ్చిన 12 మంది చేనేతలతో మాట్లాడారు. తన మనసులోని ఆలోచనలను మహారాణి స్పష్టంగా చెప్పి కొత్తరకమైన చీరలను నేసి చూపించమని చెప్పారు. దాంతో కాటన్+పట్టుతో చీరలు ఎలా నేయాలో ముందు చేనేతలకు అర్ధంకాలేదు. అదే విషయాన్ని మహారాణితో చెప్పినపుడు ఆమే చీర బార్డర్ తో పాటు కొంగును పట్టుతోను మిగిలిన మధ్య భాగాన్ని కాటన్ తోను నేయమని చెప్పారు.

మహారాణే మూల కారణం

మహారాణి ఇచ్చిన ఆలోచనతో చేనేతలు ముందు బార్డర్ ను తర్వాత కొంగును పట్టుతో నేసి ఆ రెండింటిని మధ్య భాగమైన కాటన్ చీరకు జతచేశారు. ఎక్కడా కాటన్ చీరకు పట్టు బార్డర్, కొంగును అతికంచినట్లు ఉండకూడదని మహారాణ మొదట్లోనే చెప్పారు. అందుకనే ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి మహారాణి చెప్పినట్లుగా ఏకకాలంలో బార్డర్, కొంగును పట్టుతో నేసి దాన్ని మధ్యభాగంలోని కాటన్ చీరతో కలిపారు. ఇలా కొన్నిసార్లు ట్రయల్ రన్ నడిచిన తర్వాత చివరకు కాటన్ చీర+బార్డర్, కొంగును పట్టుతో కలిపినేసిన చీర తయారైంది. పట్టుతో నేసిన బార్డర్, పట్టుతో నేసిన కొంగును మధ్యలో కాటన్ తో నేసిన చీర భాగానికి అతికించినట్లు ఎక్కడా కనబడదు. అంటే చీరను నేసేముందే పట్టు+కాటన్ ను మగ్గాలకు ఎక్కించి పట్టు ఎక్కడ రావాలి, కాటన్ ఎక్కడుండాలి అన్న విషయాలను మగ్గానికి ఎక్కించేముందే అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో కాటన్ లేదా పట్టుతో నేసిన ఫుల్ లెంగ్త్ చీర తయారైనట్లే పట్టు+కాటన్ కలిపిన సరికొత్త చీర తయారైంది.

చీరలకు మహారాణి బ్రాండ్ అంబాసిడరేనా ? 



చీరను చూసి పూర్తి సంతృప్తి వ్యక్తంచేసిన మహారాణి అలాంటివే మరికొన్ని చీరలను తయారుచేయించారు. అలా తయారైన చీరలను ముందుగా తమ పుట్టింటి, అత్తింటి వారికి బహుమానాలుగా పంపించారు. వారంతా చీరలు చాలా బాగున్నాయని అన్న తర్వాత మరికొన్ని చీరలు నేయించి హైదరాబాద్ లోని ప్రముఖులకు పంపారు. వాళ్ళ నుండి కూడా ఫీడ్ బ్యాక్ వచ్చింది. బహుమానంగా అందుకున్న చీరల్లాంటివే మరికొన్ని కావాలని అడిగారు. ఎంత ఖరీదైనా సరే కొనటానికి ఇబ్బంది లేదని, చీరలైతే కావాల్సిందే అని మహారాణిని పదేపదే అడిగారు. దాంతో చీరలకు పెరుగుతున్న డిమాండు మహారాణికి అర్ధమైంది. అందుకనే కంచి, బెనారస్ లో శిక్షణ తీసుకొచ్చిన చేనేతలతోనే గద్వాలలోని కొన్ని వందలమందికి అలాంటి శిక్షణే ఇప్పించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారందరిని తర్వాత కాటన్+పట్టుతో చీరలు నేయటంలో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. దాంతో కాటన్+పట్టుతో చీరలు నేయటం పెద్దఎత్తున మొదలైంది. 1946 ప్రాంతంలో హైదరాబాద్ లోని అబిడ్స్ లో గద్వాల చీరల కోసమే మహారాణి ప్రత్యేకంగా షోరూమ్ ను ఏర్పాటు చేశారు.

ప్రపంచవ్యాప్తమైన గద్వాల చీరలు 



గద్వాలలో నేసే చీరలను అబీడ్స్ లోని షోరూముకు తరలించి అక్కడి నుండి దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా పంపించారు. అంటే గద్వాల పట్టు చీరలు ప్రపంచవ్యాప్తం అవటానికి గద్వాల సంస్ధానం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ ఎంత కృషిచేశారో అర్ధమవుతోంది. కొంగు, బార్డర్ కు వాడే పట్టు 80 కౌంటులో ఉంటుంది. మధ్యలో కాటన్ భాగం కౌంట్ కూడా సరిగ్గా 80 ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకున్నారు. లేదంటే రెండింటి కౌంట్ లో తేడాలుంటే చీర కొంగు, బార్డర్- మధ్య భాగానికి తేడా తెలిసిపోతుంది. రెండూ ఒకే కౌంట్ లో ఉండబట్టి కొంగు దగ్గర, బార్డర్, మధ్య భాగంలో ఎక్కడా తేడా తెలీదు. మొదట్లో కొంగు, బార్డర్ కు ప్యూర్ గోల్డ్, సిల్వర్ నేసేవారు. మహారాణి కాలంచేసిన తర్వాత, పరిస్ధితులకు అనుగుణంగా బంగారం, వెండి జరీని తగ్గించేశారు.

ఎన్ని మగ్గాలు పనిచేస్తున్నాయి

గద్వాల నేత, పట్టు చీరల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు అక్కల శ్రీనివాస్ తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ఇపుడు గద్వాల-జోగులాంబ జిల్లాలో 4 వేల మగ్గాలున్నట్లు చెప్పారు. 4500 మగ్గాలపైన సుమారు 12 వేలమంది చేనేతలు పనిచేస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో మహారాణి చేసిన ఏర్పాటు వల్లే ఇపుడు కూడా చీరలకు అవసరమైన పట్టు బెంగుళూరు నుండే వస్తోందన్నారు. చీరల డిజైన్లు బట్టి ఒక చీర నేయాలంటే తక్కువలో తక్కువ 7 రోజులు పడుతుందని చెప్పారు. 22 మంది చేనేతలు అవిశ్రాంతంగా పనిచేస్తే ఒక చీర 7 రోజుల్లో తయారవుతుందట. చీర డిజైన్ సింపుల్ గా ఉంటే 7 రోజులు డిజైన్ బాగా ఎక్కువుంటే మరిన్ని రోజులు పడుతుందన్నారు.

చీరలకు గుర్తింపు తెచ్చిన డిజైన్లు 



గద్వాల చీరల్లో మామిడి పిందెలు, హంసలు, నెమళ్ళు, గొల్లభామ, భరతనాట్యం, వాయిద్యాల డిజైన్లు చాలా ఫేమస్ అన్నారు. ఒక నెలలో 4500 మగ్గాలపైన సుమారు 15 వేల పట్టుచీరలు తయారవుతున్నట్లు చెప్పారు. చీర డిజైన్, పట్టు కౌంట్ బట్టి రు. 10 వేల నుండి లక్ష రూపాయల వరకు ధరలుంటాయని అక్కల తెలిపారు. గద్వాల సంస్ధానం మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ చొరవచూపించకపోతే గద్వాల పట్టుచీరలకు ఇప్పుడున్న ప్రాముఖ్యత దక్కేది కాదన్నారు. అమెరికా, లండన్, జపాన్, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలుగువాళ్ళంతా గద్వాల చీరలను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు అక్కల చెప్పారు. గద్వాల చీరల విలువ తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి కొంటారని గర్వంగా చెప్పారు.

శ్రీవారికి ఏరువాడ జోడు పంచెలు 



గద్వాలలోనే నేస్తున్న ‘ఏరువాడ జోడుపంచెలు’ తిరుమలలోని శ్రీవారికి బహుమానంగా పంపటం కూడా మహారాణి హయాంలోనే మొదలైందన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు వెంకటేశ్వరస్వామికి గద్వాల నుండి పట్టుతో నేసిన జోడు పంచెలు బహుమానంగా వెళ్ళటం దశాబ్దాలుగా ఆనవాయితీగా ఉందన్నారు. జోడు పంచెలను తయారుచేసే చేనేతలు ప్రత్యేకంగా దీక్ష తీసుకుని 41 రోజుల పాటు ప్రత్యేకమైన మగ్గంలోనే నేస్తారని చెప్పారు. శ్రీవారికి నేసే జోడు పంచెల మగ్గాన్ని ఏడాది మొత్తం మీద దేనికీ వాడరని కూడా చెప్పారు. అంటే శ్రీవారికి జోడు పంచెలను నేసే మగ్గాన్ని తాము చాలా పవిత్రంగా చూస్తామన్నారు. అందుకనే శ్రీవారికి పంచెలు నేసిన మగ్గాన్ని ఇతరత్రా ఇంక ఏ బట్ట నేయటానికి కూడా ఉపయోగించమని చెప్పారు. మహారాణి వారసులు కొడుకు, కోడలు లతా భూపాల్ ప్రతి ఏడాది గద్వాల నుండి జోడు పంచెలను నేయించి ప్రత్యేకంగా తిరుమలకు పంపుతారని అక్కల చెప్పారు.

Tags:    

Similar News