పులివెందులలో ఎవరు ఎంత ఇస్తారన్నదే హాట్ టాపిక్

మద్య, మాంసం, నోట్ల వర్షం… పులివెందుల ఎన్నికల హీట్ పీక్స్‌లో;

Update: 2025-08-10 12:53 GMT

కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్ల ప్రలోభాలకు తెర లేచింది. ఎక్కడికక్కడ గ్రూపు సమావేశాలు, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే వ్యూహాలు, తెర వెనుక మూడో కంటికి తెలియకుండా మద్య, మాంసాల పంపిణీ, నోట్ల అలజడి వంటి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు కడప జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. వాస్తవానికి కడప జిల్లాలో ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నా ప్రజల చూపంతా పులివెందులపైన్నే ఉంది. మరోపక్క ఓటర్లు కూడా ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారా అనే దాన్నే చర్చిస్తున్నారు.

ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బు పంచడం అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్లలో ఎవరెవరు ఎంతెంత పంచుతారనే దానిపై ఓటర్లు ఎదురుచూస్తున్నారని ఓ సీనియర్ జర్నలిస్టు చెప్పారు.
ఈనేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. వాళ్లు డబ్బులు పంచుతున్నారంటే వీళ్లు పంచుతున్నారని ఇరు పక్షాలు ఆరోపించుకున్నాయి. ఒక్కో ఓటుకు వైసీపీ వాళ్లు సుమారు 5 వేల రూపాయలు ఇస్తున్నారని టీడీపీ ఆరోపిస్తే 6 వేలు ఇస్తున్నారంటూ వైసీపీ టీడీపీపై ప్రత్యారోపణ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
'YCP నేతల వద్ద నోట్లు తీసుకోండి.. TDPకి కు ఓట్లు వేయండి' అంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు కూటమి నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ పులివెందుల అని, గతంలో అక్కడ నామినేషన్‌ వేసే పరిస్థితి లేదన్నారు. ఎంపీ అవినాశ్‌రెడ్డికి కూటమి నేతలను విమర్శించే హక్కు లేదన్నారు.
మరోపక్క, వైసీపీ కూడా ఇదే తరహా అప్పీల్ చేసింది. టీడీపీ వాళ్లు ఇస్తే డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం వైసీపీకే వేయండి అని ఎంపీ అవినాశ్ రెడ్డి అప్పీల్ చేశారు. పులివెందుల రూరల్‌ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోంది. చివరికి అరాచకానికి కూడా తెరలేపింది. ఉప ఎన్నిక గండం గట్టెక్కేందుకు శత విధాలా ప్రయత్నిస్తోందని, నిజానిజాలు ఓటర్లు గమనించి వైసీపీని గెలిపించాలని కోరారు.
వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మండలం రాయలపురంలో సోమవారం జడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. 10,601 మంది ఓటర్లు ఉన్నారు. 15 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News