విదేశాల్లో స్థిరపడి సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తొలి రోజున ఆదివారం స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ‘తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా’ కార్యక్రమంలో పాల్గొ్గన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయ్ ల్యాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని.. తన సింగపూర్ పర్యటన ఉద్దేశ్యాలను వివరించారు. పపంచంలో మారుతున్న పరిణామాలను తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారు.
నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల జీవితాలను మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 120 పైగా దేశాల్లో తెలుగు ప్రజలు స్థిరపడ్డారు. ఏ దేశానికైనా వెళ్లి.. గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడున్న తెలుగు వారు పది నిమిషాల్లోనే పోగయ్యే పరిస్థితి వచ్చేసింది. ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుగు వాళ్లు వెళ్లడమే కాదు.. ఆయా దేశాల్లోని స్థానికులకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే స్థానికులకంటే.. తెలుగు వారి తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. సింగపూర్ లో 40 వేల మంది తెలుగు వాళ్లు నివాసం ఉంటున్నారు. తెలుగు వాళ్లు ఏయే దేశాల్లో స్థిర పడ్డారో.. ఆ దేశం వారికి కర్మభూమి..అవకాశాలు కల్పించిన ఆ దేశాభివృద్ధి కోసం పని చేయాలి. అదే సమయంలో పుట్టిన గడ్డను తెలుగు వాళ్లు మరువ కూడదు. భారతదేశం.. ఆంధ్రప్రదేశ్ వారి జన్మభూమి. ఆ జన్మభూమి అభివృద్ధి కోసం తెలుగు వాళ్లు పని చేయాలి. పెట్టుబడులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టిన పన్నులతో మీరు ఈ స్థాయికి ఎదిగారు. ఎన్నో అవకాశాలు పొందారు. కాబట్టి జన్మభూమి అభివృద్ధికి కృషి చేయడం.. పెట్టుబడులు పెట్టడం అనేది బాధ్యతగా తీసుకోవాలి. నేను ఏ దేశం వెళ్లినా.. అక్కడి తెలుగు వారిని తప్పకుండా కలుస్తాను అంటూ సీఎం చెప్పారు.
సింగపూర్ దేశం అంటే నాకు చాలా అభిమానం.. గౌరవం. నీతి, నిజాయితీలకు సింగపూర్ దేశం నిలువెత్తు నిదర్శనం. ఈ దేశంలో అవినీతి తక్కువ. సింగపూర్ రోడ్ల మీద ఒక్క కాగితం ముక్క కూడా కన్పించదు. చాలా కాలం క్రితమే చెత్తను కూడా ఎనర్జీగా కన్వెర్ట్ చేసే విధానాన్ని సింగపూర్ ఆచరణలో పెట్టింది. అదే తరహా విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేశాను. చాలా మంది రాజకీయ నేతలు సింగపూర్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. కానీ ఏపీ సీఎం మాత్రం ఇక్కడికి వచ్చి తాను చేసిన మంచి పనులను అమలు చేస్తున్నారని సింగపూర్ దేశ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ చెప్పారు. నేను అడిగిన వెంటనే ఉచితంగా అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది.
సింగపూర్ ప్రభుత్వం చాలా దేశాల్లో టౌన్ షిప్ లు కట్టింది. కాబట్టి సీడ్ క్యాపిటల్ నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికే అప్పగించాను. కానీ 2019లో ప్రభుత్వం మారి సింగపూర్ ను తప్పు పట్టే పరిస్థితి తీసుకువచ్చారు. వాటిని సరిదిద్ది.. రికార్డులు సరి చేయడానికే సింగపూర్ వచ్చాను. ఏపీ బ్రాండును సింగపూర్ లో తిరిగి నెలకొల్పడానికే వచ్చాను. మన రాష్ట్రంలో ఏ ఒక్కరు తప్పు చేసినా.. తెలుగు వాళ్లే చేశారంటారు. ఆ అభిప్రాయాన్ని సింగపూర్ ప్రభుత్వంలో.. సింగపూర్ కంపెనీల్లో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాను. సింగపూర్ కు కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నానని వారికి చెబుతున్నాను. సింగపూర్ ప్రభుత్వం మళ్లీ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి ముందుకు రాకపోవచ్చు. జరిగిన వాస్తవాలను మాత్రం వారికి తెలియచేస్తాను. 2019లో కూడా మన ప్రభుత్వమే కొనసాగి ఉంటే.. అమరావతి సింగపూర్ స్థాయికి చేరేది. కానీ 2019 ఎన్నికల్లో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ఈ బాధ్యత నా మీదే కాదు..మీ మీద కూడా ఉంది. అని చంద్రబాబు భావోద్వేగంగా మాట్లాడారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రకటించాం. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. పోర్టులు ఎక్కువగా నిర్మించుకోవచ్చు. పోర్టు ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున నెలకొల్పవచ్చు. ఏపీలో 20 పోర్టులు వస్తాయి. 15–20 ఎయిర్ పోర్టులకు అవకాశం ఉంది. భారత దేశానికే లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆరోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్, టాటా సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. చాలా మంది తెలుగు వాళ్లు విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. ఇలాంటి వారు తమ అనుభవాన్ని ఏపీకి అందించవచ్చు. పెట్టుబడులు పెట్టేలా ..సర్వీస్ ప్రొవైడర్లుగా ఉండొచ్చు.. మీరు ఏం చేయాలనుకున్నా.. పూర్తిగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంటుంది.
ఒకప్పుడు తెలుగు వారు విదేశాల్లో ఉద్యోగులుగా మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. ఆయా దేశాల్లో తెలుగు వాళ్లు ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తాం. ఎన్నార్టీ విభాగం ద్వారా సేవలు అందిస్తాం. ఐటీనే కాదు.. పారిశ్రామికవేత్తలను కూడా ప్రమోట్ చేస్తాను. వివిధ దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో తెలుగు పారిశ్రామికవేత్తలను భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తాం. వారి మధ్య ఎంఓయూలు కుదుర్చుకునేలా చొరవ తీసుకుంటాం. పారిశ్రామిక వేత్తలను ఏపీ గౌరవిస్తుంది. మీ మీ గ్రామాల్లోని పేదలను దత్తత తీసుకోండి. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వాళ్లు.. పీ4లో భాగస్వాములుగా ఉంటే.. నాకు అంతకు మించిన ఆనందం వేరొకటి ఉండదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదేశాల్లో ఉన్న తెలుగు వారు మా కోసం పని చేశారు. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నాను. దేశ విదేశాల్లో నా కోసం పనులు వదిలిపెట్టి ఆందోళనలు చేశారు. నా గురించి విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువాళ్లు పడిన ఆందోళన.. తపన.. నేను ఎన్నటికీ మరువలేను. ఎన్నికల్లో కూడా స్వచ్ఛంధంగా వచ్చి పార్టీ కోసం పని చేశారు. వారి రుణాన్ని నేను తీర్చుకోలేను. అని చంద్రబాబు నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం అదృష్టం. ఎన్ని కష్టాలున్నా.. వేంకటేశ్వరస్వామిని తలుచుకుని సంకల్పం తీసుకుంటే సమస్య పరిష్కారమై పని అయిపోతుంది. ఎన్నార్టీలకు తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. ప్రతి దేశ రాజధానిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉండాలి. సింగపూర్ నుంచి ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతికి నేరుగా విమానాలు వచ్చేలా చేస్తాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. సింగపూర్ లో బెంగాలీ, హిందీ, తమిళ్ రెండో భాషగా ఉన్నాయి. తెలుగు కూడా రెండో భాషగా పెట్టాలని కోరుతున్నాను. ఇక్కడే ఉన్న భారత హైకమిషనర్ ఈ మేరకు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. అని చంద్రబాబు చెప్పారు.
ప్రస్తుతం భారత దేశానికి ప్రజలే ఆస్తి. గతంతో పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి గౌరవం పెరిగింది. ఈ సమయంలో దేశానికి సరైన నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. దేశంలో చాలా మంది ప్రధానులు..చాలా మంది సీనియర్ లీడర్లను చూశాను. రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోదీ. మోదీ మనకు పెద్ద వరం. అమెరికాకు చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో మోదీ ప్రపంచంలోనే పాపులర్ లీడరుగా నెంబర్–1 స్థానంలో నిలిచారు. ప్రధానికి 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉంది. దేశానికి గుర్తింపు, సుస్థిరత మోదీ వల్లే వచ్చింది. నరేంద్ర మోదీ వికసిత్ భారత్ నినాదంతో వెళ్తున్నారు. నేను స్వర్ణాంధ్ర సంకల్పంతో ముందుకెళ్తున్నాను. అని అన్నారు.