'కాపులు, దళితులు కలిస్తే చంద్రబాబు కుర్చీని లేపేయవచ్చన్న IPS'

చంద్రబాబు సర్కార్ కే సవాల్ విసిరిన సునీల్, సస్పెన్షన్‌లో ఉన్నా తగ్గేది లేదంటున్న ఐపీఎస్

Update: 2025-12-02 02:08 GMT
Sunil Kumar, Pawan Kalyan
ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న పీవీ సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాపులు, దళితులు కలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చునన్నారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి, దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే లెక్క సరిపోతుందన్న సునీల్ కుమార్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఆయన ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నందున ఇక తనను ఏమి చేస్తార్లెమ్మని ఈ వాఖ్యలు చేసి ఉండవచ్చునని కొందరంటుంటే అఖిల భారత సర్వీసుల (ప్రవర్తన) నియమావళి ఉల్లంఘనేనని కొందరు అధికారులు అంటున్నారు. వీళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నా సునీల్ కుమార్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కాపు, దళిత సంఘాలు పెద్దఎత్తున ఆయన వ్యాఖ్యల్ని ప్రచారంలో పెట్టాయి.
అసలింతకీ ఆయన ఏమన్నారు?
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో ఆదివారం జరిగిన డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సభలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ‘మీ కాపు నాయకుణ్ణి మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి.

 మా దళిత నాయకుణ్ణి ఉప ముఖ్యమంత్రిని చేయండి. మా హర్షకుమార్, మా విజయ్‌కుమార్, మా జడ శ్రవణ్‌కుమార్‌లలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. రెండేళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రి కాదు.. ఐదేళ్లు ఉండే పదవి కావాలి’ అని పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో ప్రధానమైన, అత్యధిక జనాభా ఉన్న, అధికారం కోసం ప్రయత్నిస్తున్న, అందులో చాలా వరకూ విజయం సాధించిన కులం కాపు సామాజికవర్గం. వారూ మనం కలిస్తే మన బలం రెట్టింపవుతుంది. మన డిమాండ్‌కు సహకరించాలని కాపు సోదరులను కోరండి. అందర్ని కలుపుకొని పోయి.. అందరికీ మన ఎజెండా ఏంటో తెలియజేయండి. మీరు దళితవాడ పంచాయతీకి మద్దతుగా నిలిస్తే మేము మీకు మద్దతిస్తామని వారితో చెప్పండి’ అని పేర్కొన్నారు. ఆయన ప్రసంగ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్ అయింది.
‘నాకు ఎన్నికల్లో టికెట్‌ ఇస్తే కూడా వద్దని చెప్పి దళితవాడను పంచాయతీగా చేయాలని అడిగాను. నేను టికెట్‌ వదులుకుంటేనే చేస్తామనే హామీ లభించింది’ అని సునీల్‌ కుమార్‌ చెప్పారు.
మండిపడ్డ రఘురామ కృష్ణరాజు..
సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం లేపాయి. కాపు సీఎం, దళిత డిప్యూటీ సీఎం కొనసాగవచ్చంటూ సునీల్‌ బహిరంగంగా చేసిన సూచన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
సునీల్‌ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆలిండియా సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించిన సునీల్‌ కుమార్‌పై చర్య తీసుకోవాలని డీవోపీటీకి లేఖ రాశారు. అగ్నిమాపక శాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు.. అగ్రిగోల్డ్‌ లబ్ధిదారుల పేరుతో నిధులు పక్కదారి మళ్లించారన్న ఫిర్యాదు.. ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లడంతో ఆయన సస్పెండ్‌ అయిన విషయాలను లేఖలో పేర్కొన్నారు. అఖిల భారత సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ వర్తిస్తాయని, సునీల్‌ కుమార్‌ను సర్వీస్‌ నుంచి తొలగించాలని కేంద్రానికి రఘురామ విజ్ఞప్తి చేశారు.
సునీల్‌ కుమార్‌ ఏపీ పోలీసు శాఖలో వివిద హోదాల్లో పని చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఏడీజీగా ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వయంగా రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేసినా, వారి ఆచూకీ లభించలేదని కోర్టుకు సీఐడీ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐకి ఫిర్యాదు చేయడంతో మొత్తం 18 మందిపై చర్యలు తీసుకుంది.
విదేశాల్లో ఉన్న వారిని సైతం అరెస్టు చేసింది. అప్పటి ప్రతిపక్ష టీడీపీకి చెందిన వారిని అర్ధరాత్రి అరెస్టులు చేయించి చితకబాదించినట్లు సునీల్‌ కుమార్‌ పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడం, కస్టోడియల్‌ హింసకు గురిచేయడంతో సునీల్‌ చర్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 4న పోలీసుల ముందు విచారణకు సునీల్‌ హాజరు కావాల్సి ఉంది.
రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం నిషేధమా?
సర్వీసు నియమావళి ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం నిషేధం. వారు ఏ పార్టీలోనూ సభ్యుడిగా ఉండరాదు. రాజకీయాల్లో పాల్గొనే ఏ పార్టీతోనూ, సంస్థతోనూ సంబంధం, అనుబంధం పెట్టుకోకూడదు. రాజకీయ ఉద్యమాల్లో, కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఆర్థికంగా మద్దతివ్వకూడదు. రాజకీయ తటస్థత కలిగి ఉండాలి. నైతికత పాటించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, చర్యలను విమర్శించేలా బహిరంగ ప్రకటనలు చేయకూడదు. అయితే సునీల్‌ కుమార్‌ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, భావప్రకటనా స్వేచ్ఛ ఆయనకూ ఉంటుందని, వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేస్తే తప్పు ఎలా అవుతుందని కొందరు దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు.
Tags:    

Similar News