సైన్యానికి మద్దతుగా ప్రతిజ్ఞ
ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్ధతుగా నర్సీపట్నంలో ర్యాలీ;
నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా బుధవారం భారీ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భారత సైన్యానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. పహాల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ఖండించారు. ‘ఉగ్రవాదులకు తగిన శాస్తి తప్పదు’ అని స్పష్టమైన వ్యాఖ్య చేశారు. దేశ భద్రత కోసం ప్రజలు ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. "భారతదేశం శాంతియుత దేశం, కానీ శత్రువుల దాడులకు తగిన బుద్ధి చెప్పగలదు" అని స్పీకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సైన్యానికి దేశవ్యాప్తంగా మద్దతు ఉన్నదని స్పీకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, యువత, మహిళలు, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సింధూర్ ఆపరేషన్ గర్వకారణం...
ఆపరేషన్ సిందూర్ భారతదేశాన్ని సగౌరవంగా తలెత్తుకునేలా చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందని, పహేల్గాం ముష్కరుల దాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఉగ్రవాదం అంతమయ్యేంతవరకు ఇది కొనసాగుతుందన్నారు. పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి, ఉగ్రవాదులకు స్థావరాలను కల్పించడం మానేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్తుందని నిరూపితమయ్యిందన్నారు. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాదులను తెల్లవారుజామున మట్టుబెట్టిన భారతసైన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు.