పుష్పార్చనలతో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
ఏలూరు జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఐ.ఎస్.జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీసహిత లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఛైర్మన్ రాజబహదూర్ నివృతరావు, ఈఓ శ్రీ వి.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసి గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ స్థల పురాణం పుస్తకాన్ని ఆవిష్కరించారు.