ఎమ్మెల్యే జీతంపైనా క్లారిటీగా ఉన్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం చెల్లించే జీతం..దాని విలువలు.. గౌరవం గురించి పవన్ కల్యాణ్ మాటలు శభాష్ అనిపిస్తున్నాయి.
Byline : Vijayakumar Garika
Update: 2024-06-06 14:58 GMT
ప్రభుత్వం చెల్లించే జీతం, దాని ప్రాముఖ్యత, జీతం తీసుకుంటున్న వెనుక ప్రజలకు అందించాల్సిన సేవలు వంటి చాలా విలువైన అంశాలను, వాటి తాలూక గుర్తింపు, గౌరవాలను గురించి రాజకీయ నాయకులు అసలు పట్టించుకోరు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ప్రభుత్వం అందించే జీతం కోసం ఎదురు చూసే నాయకులు ఈ కాలంలో ఎవరు లేరు. ఒక వేళ ఉన్నా వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఎక్కువ మంది వ్యాపారులు, ధనవంతులు, జమిందారులు, తమ అధికార దర్పం కోసం, పదవి వ్యామోహం కోసం, సమాజంలో ఒక స్టేటస్ సంబల్ కోసం వచ్చే రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు కానీ, వారికి సేవలు చేయాలని కానీ ఆలోచనలు ఉంటాయని అనుకోవడం కూడా అత్యాశగానే మారి పోయింది. వారి వ్యాపారాలను చక్క బెట్టుకోవడం కోసం, తమ ఆస్తులను కాపాడు కోసం పాలిటిక్స్‌లోకి వచ్చే వారి సంఖ్య ఎక్కువై పోయింది.
అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అందుకు విరుద్దం. ఆయన మాట్లాడుతున్న మాటలు, సిద్ధాంతాలు చూస్తుంటే ఇలాంటి వారు కూడా ఉంటారా అనే ఆశ్చర్యం పడక తప్పదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ నేతలతో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండాలి, ఎలా ఉండ కూడదు, ఎలా ఉంటే ప్రజల సమస్యలను పరిష్కరించొచ్చు, ప్రజలకు చేరుక కావచ్చనే అంశాలపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకి ప్రభుత్వం చెల్లించే జీతం గురించి, దాని విలువ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు అక్కడనున్న నేతలను ఆశ్చర్యపరిచాయి. వారిని ఆలోచింప చేసేవిగా మారాయి. సినిమాల్లో కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నా వాటిని వదులుకొని, ఒక ఎమ్మెల్యేకి చెల్లించే జీతం గురించి ఇంత విలువలతో కూడిన మాటలు మాట్లాడారనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యేకి ప్రభుత్వం చెల్లించే జీతవం గురించి, బాధ్యత గురించి, పవన్ కల్యాణ్ చాలా అద్బుతంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలని కలలు గన్నాను. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేవాడు. దానికి మేము రుణపడి ఉన్నాం. అందుకే నేను కూడా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా మొత్తం జీతం తీసుకుంటాను. కానీ తర్వాత నేను ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తాను. ఎందుకు జీతం తీసుకుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని తింటున్నాను.. అనే బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి ప్రజలు నున్న చొక్కా పట్టుకొని నిలదీయాలి. ఒక వేళ పని చేయక పోతే మీకు మా ట్యాక్స్ మనీతో శాలరీ ఇస్తున్నాం. నువ్వు ఎందుకు పని చేయడం లేదు అని ప్రజలు అడగాలి. అందుకు నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. ప్రజల డబ్బు శాలరీగా తీసుకుంటున్నాను అనే భయంతో నేను పని చేయాలి. ఎమ్మెల్యేగా జీతం తీసుకోవాలా వద్దా అని గతంలో చాలా సార్లు అనుకున్నాను. ప్రజల కష్టం నుంచి వచ్చిన డబ్బు మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం జవాబుదారిగా ఉండాలి. అందుకే నేను జీతం తీసుకుంటాను. తర్వాత అది మళ్లీ నేను ప్రజలకు ఇచ్చేది వాళ్లకే ఇచ్చేస్తాను అని వ్యాఖ్యానించారు.