13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు.. పవన్ ప్లాన్ ఇదే..

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారి పాలన అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.

Update: 2024-08-22 10:02 GMT

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారి పాలన అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు. అదే విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతంపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఆ దిశగా అన్ని చర్యలు చేపట్టామని, గ్రామాల అభివృద్ధిని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నామని, ప్రతి గ్రామంలో సంపద సృష్టించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కూడా పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ఆగస్టు 15, జనవరి 26 వేడుకలను ప్రతి పంచాయతీలో ఘనంగా నిర్వహించడానికి ఆ ఉత్సవాల నిర్వహణకు కేటాయించే నిధులను పెంచామని చెప్పారు. ఒకే రోజు 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, ఈ గ్రామసభల్లో యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మూడు దశాబ్దాలు దాటింది

‘‘దేశంలోనే పంచాయతీ వ్యవస్థను మొదలు పెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది. రెండో తరం సంస్కరణలతో పంచాయతీల నలుదిశల విప్లవం మన రాష్ట్రం నుంచే ఇప్పుడు మొదలుపెడుతున్నాం. గత మూడు దశాబ్దాలుగా పంచాయతీలకు జాతీయ పండుగల నిర్వహణకు మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా మైనర్ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.25 వేలు నిధులను పెంచి పంచాయతీలకు అండగా ఉంటాం’’ అని భరోసాను ఇచ్చాం.

మన గ్రామాన్ని మనమే పరిపాలించుకుందాం

‘‘పంచాయతీ సంస్కరణల్లో భాగంగా ఆగస్టు 23న గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తాం. మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం అనేలా వీటి నిర్వహణ ఉంటుంది. భారతదేశపు మూలాలు, జీవం పల్లెల్లోనే ఉంటుందని గాంధీ చెప్పారు. ప్రధాని మోదీ సంకల్పంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పంచాయతీలను స్వయంశక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. పంచాయతీలకు ఉండే అధికారాలను గ్రామాల అభివృద్ధికి ఉపయేపడేలా చేసి.. పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని కోరారు.

 

వైసీపీ హయాంలో పంచాయతీల నిర్వీర్యం

‘‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వైసీపీ హయాంలో రూ.40,579 కోట్లు నిధులు వచ్చాయి. ఈ పనుల పూర్తిస్థాయి ఫలితాలు మాత్రం క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. గ్రామీణాభివృద్ది కోసం ఈ నిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి. కానీ గత ప్రభుత్వంలో ఈ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేశారు. కరోనా సమయంలో ఈ నిధులను ఇష్టానికి వాడుకున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2014-19 వరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల ఆదాయం రూ.240 కోట్లు ఉంటే, 2019-23 సంవత్సరాల్లో రూ.170 కోట్లకు చేరింది. క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణం. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు సర్వ స్వతంత్రత తీసుకురావాలనే సంకల్పంతో పని చేస్తోంది’’ అని వివరించారు.

ప్రత్యేకతను బట్టి ఆదాయం సృష్టి

‘‘రాష్ట్రంలోని గొప్పదనం ఏమిటంటే ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కళలు, ఆహార పదార్ధాల తయారీ, వస్త్రాల తయారీ, ఇతర కళాకృతుల తయారీ వంటి వాటికి మన గ్రామాలు ప్రత్యేకం. విశాఖపట్నం జిల్లాలో ఆనందపురంలో పూలు ప్రసిద్ధి. అరకులో అరకు కాఫీకు ప్రత్యేకత ఉంది. మంగళగిరి చీరలు, సత్యసాయి జిల్లాలో లేపాక్షి, బాపట్లలో వేటపాలెం గ్రామం, కృష్ణాజిల్లాలో చిలకలపూడి, కొండపల్లి హస్త కళలకి ప్రసిద్ధి. ఇలాంటివి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలను గ్రామ సభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నాం. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగుమతులు చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషిస్తాం’’ అని వెల్లడించారు.

ఆదాయం పెంచేలా సామాజిక అడవులు

ఈ సందర్భంగానే పంచాయతీల్లో ఉన్న భూములపై కూడా ఆయన మాట్లాడారు. ‘‘పంచాయతీల్లో చాలా భూమి నిరు పయోగంగా ఉంటోంది. దాన్ని క్రమ పద్ధతిలో వినియోగించుకోవాలి. డెన్మార్క్ నుంచి భారత్ ప్రతి ఏటా రూ.6 వేల కోట్ల విలువైన కలపను దిగుమతి చేసుకుంటోంది. కేవలం కలప కోసం ఇంత మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం వెచ్చిస్తున్నాం. దీనిని నియంత్రించడానికి గ్రామ పంచాయతీల్లో వృథాగా ఉన్న స్థలంలో సామాజిక అడవి విభాగంలో కలపను పెంచాలని భావిస్తున్నాం. దీని ద్వారా పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నరేగా పనులను అటవీ శాఖకు అనసంధానం ఉంది. మూగ జీవాలకు నీటి వసతి కల్పించేలా గుంతలను తవ్వడం వంటి వాటికి ఉపయోగిస్తాం. గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రత్యేకతలను తిలకించేలా పర్యాటకులను ప్రొత్సహిస్తాం’’ అని తెలిపారు.

నీటి పునర్వినియోగం దృష్టి

‘‘నీటి కోసం గ్రామాల్లో బోర్లు హద్దులు దాటి వేస్తున్నారు. దీనివల్ల ఫ్లోరైడ్ ఎక్కువగా పడుతోంది. భూమి పొరలను దాటి నీటి కోసం లోతులకు వెళ్తున్న కొద్దీ ఫ్లోరైడ్ వస్తోంది. నీటిని పునర్వినియోగంపై దృష్టి సారించాలి. అప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయి. తక్కువ దూరంలోనే నీళ్లు లభిస్తాయి. ప్రస్తుతం గ్రామాల్లో పల్స్ సర్వే చేస్తున్నాం. పంచాయతీల్లో నీటి పరిస్థితిపై 16 అంశాలతో సర్వే నిర్వహిస్తున్నాం. 22 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది. ఇది రాష్ట్రం మొత్తం మీద పూర్తయితే అన్ని పంచాయతీల్లో ఉన్న వాటర్ సోర్సు మీద ఓ స్పష్టత వస్తుంది. అప్పుడు ఓ ప్రణాళిక ప్రకారం నీటి సమస్యను తీర్చేందుకు ముందుకు వెళ్తాం’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News