తిరుపతి లడ్డూ వివాదంపై పవన్ సీరియస్.. పలువురికి వార్నింగ్

తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో తీవ్రమైన కల్తీ జరిగిందన్న వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.

Update: 2024-09-24 07:54 GMT

తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో తీవ్రమైన కల్తీ జరిగిందన్న వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్ష చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తన దీక్షలో భాగంగానే ఆలయ మెట్లను శుభ్రం చేశారు. అనంతరం మెట్ల పూజ చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ వివాదంపై కొందరు ప్రముఖలు మాట్లాడిన తీరును ఖండించారు. వారిలో నటుడు ప్రకాష్ రాజ్ సహా హీరో కార్తి కూడా ఉన్నాడు. అంతేకాకుండా మరికొందరు రాజకీయ నాయకులకు కూడా పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి లడ్డూ వివాదంపై నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ఎగతాళి చేసినా ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట మాట్లాడే ముందు విషయం తెలుసుకోవాలని, ఏదో అనేద్దాం.. ఏం చేస్తారులే అనుకునే అందుకు తగ్గ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు.

లడ్డూ ప్రసాదంపై జోకులొద్దు

హీరో కార్తీ తన తాజా సినిమా ‘సత్యం సుందరం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లడ్డు వ్యవహారంపై జోక్ చేశారు. ఈవెంట్‌లో భాగంగా యాంకర్.. లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు బదులిచ్చిన కార్తీ.. లడ్డూ లాపిక్ వద్దు... ఆ అంశం ప్రస్తుతం చాలా సెన్సిటివ్ అంటూ కామెంట్ చేశాడు. అతడు లడ్డూ వ్యవహారాన్ని జోక్‌గా తీసుకోవడమే కాకుండా.. దానిపై సెటైర్లే వేయడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ‘‘లడ్డూ విషయంపై కామెంట్ చేయడం సరికాదు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. మరోసారి అలా అనకు కార్తీ. ఓ నటుడిగా కార్తీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ లడ్డు విషయంలో కార్తీ చేసిన వ్యాఖ్యలు సరికాదు’’ అని పవన్ అన్నారు.

అందరికీ చెప్తున్నా..

‘‘సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం. మసీదులో ఏదైనా అపచారం జరిగితే ఇలానే మాట్లాడతారా. హిందువుల పట్ల మాత్రమే ఇలా ఎలా మాట్లాడతారు. పొన్నవోలు సుధాకర్ చాలా పొగరుగా మాట్లాడారు. తమాషాలుగా ఉందా.. సరదాలుగా ఉందా. అపవిత్రం జరిగిందని మాట్లాడాను.. మాట్లాడకూడదా. ప్రకాష్ రాజ్‌కు కూడా నేను చెప్పేది ఒక్కటే.. సెక్యులరిజం అనేది టూవేగా ఉండాలి. వన్ వే గా కాదు. ప్రకాష్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆయన సరిగా మాట్లాడాలి. సనాతన ధర్మంపై దాడి జరిగితే మాట్లాడకూడదా. మేము చాలా బాధపడ్డాం. మీకు ఇది హాస్యం కావొచ్చు.. మాకు కాదు. మీ ఇష్టానికి సనాతన ధర్మంపై మాట్లాడుతున్నారు. సరస్వతీ దేవి, దుర్గాదేవీలపై జోకులు వేస్తారా. సనాతనధర్మ రక్షణ అనేది గుడికి వెళ్లే ప్రతి హిందువు బాధ్యత కాదా? పొన్నవోలు మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారు. నాపై కోర్టులో కేసులు వేసుకుంటే వేసుకోండి. కానీ సనాతన ధర్మంపై చెడుగా, హాస్యం చేస్తూ మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం’’ అంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్.

 

ఫిల్మ్ ఇండస్ట్రీ సైలెంట్‌గా ఉండాలి..

‘‘భూమన కరుణాకర్ రెడ్డి నాశనం మొదలైంది. వైవీ సుబ్బారెడ్డి, భూమన కూడా విచారణకు రావాల్సిందే. ధర్మారెడ్డి ఎక్కడా కనిపించకుండా మాయమయ్యారు. ధర్మారెడ్డి హిందువా.. బిడ్డ చనిపోయిన పదకొండు రోజుల్లోపు గుడికి వస్తారా. ఇస్లాం, ముస్లింలకు ఇలా జరిగితే ఇలాగే ఉంటారు. సనాతన ధర్మం అంటే చులకనైపోయింది. ఇలానే ఇస్లాంపై మాట్లాడితే రోడ్లమీదకు వచ్చి కొడతారని మీకు భయం. సినిమా ఇండస్ట్రీ కూడా సైలెంట్‌గా ఉండాలి. మాట్లాడితే మంచిగా మాట్లాడాలి.. లేకుంటే మౌనంగా ఉండాలి. కాదు కూడదు అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తీవ్రంగా ఉంటాయి’’ అని మెచ్చరించారు.

పొన్నవోలు ఏమన్నారంటే..

‘‘తిరుపతి లడ్డూపై వస్తున్న దుర్మార్గమైన ప్రచారంతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించేలా కోర్టు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నేనే కేసు పెట్టి నేనే జడ్జి అవుతానంటే ఎలా.. ఈ వివాదంలో చంద్రబాబు తీరు అలానే ఉంది. అది న్యాయసమ్మతం కాదు. ఈ వివాదంలో నిపుణుల బృందం రంగంలోకి దిగడమే కరెక్ట్. అయినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నెయ్యి కన్నా జంతువులు, పంది కొవ్వు ధర ఎక్కువ. కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ వివాదాన్ని సృష్టించారు. భక్తుల మనోభావాలను కలుషితం చేయాలనే ఈ వివాదానికి తెరలేపారు. మూడు పరీక్షలు పూర్తికాకుండా నెయ్యి లోపలికి వెళ్లదు’’ అని అన్నారాయన.

ఉన్న గొడవలు చాలు: ప్రకాష్ రాజ్

లడ్డూ వివాదంపై స్పందించిన ప్రకాష్ రాజ్.. జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్‌తో పవన్ కల్యాణ్‌ను ట్యాగ్‌ చేసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో పవన్ కల్యాణ్‌ను తిరుపతి లడ్డూ వివాదంపై ప్రశ్నించారు. ‘‘డియర్.. పవన్ కల్యాణ్. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. కావున ఈ ఘటనపై విచారణ చేపట్టండి. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోండి. అలా కాకుండా ఆందోళన తెలుసుతూ సమస్యను జాతీయ స్థాయిలో ఊదరగొడుతున్నారు. (కేంద్రంలో ఉన్న మీ స్నేహితుల దయతో) దేశంలో ఇప్పటికే ఎన్నో మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి’’ అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News