పవన్, జగన్ పొటాపోటీ పర్యటనలు–డైవర్షన్ కోసమేనా?
గురువారం పవన్ పిఠాపురంలోను, జగన్ అనకాపల్లిలోను పర్యటించనున్నారు.
By : Vijayakumar Garika
Update: 2025-10-08 10:52 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
2025 సెప్టెంబర్ 9, గురువారం ఒకే రోజు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనలు జరగనున్నాయి. పవన్ కల్యాణ్ తన అసెంబ్లీ నియోజక వర్గమైన పిఠాపురంపరిధిలోని ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులతో సమావేశం కానుండగా, జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. ఈ రెండు పర్యటనలు ఒకే రోజు సంభవించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ సెప్టెంబరు 10న ఉప్పాడ గ్రామంలో పర్యటిస్తారని ఇది వరకు ప్రకటించారు. అయితే జగన్ పర్యటనతో దానికి ఒక రోజుకు ముందుకు మార్చకున్నట్లు కూటమి పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ ఉప్పాడ పర్యటన
పిఠాపురం ఎమ్మెల్యే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కల్యాణ్, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులతో సమావేశం కానున్నారు. సముద్ర కాలుష్యం, పరిశ్రమల పొల్యూషన్ వల్ల మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఇటీవల ఉప్పాడ మత్స్యకారులు పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాల కారణంగా సముద్రం కలుషితమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసి ఆందోళన చేశారు. పవన్ కల్యాణ్ తమ సమస్యలకు శ్రద్ధ చూపుతూ, అక్టోబర్ 10న పర్యటన చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ పర్యటనను ముందుకు తీసుకువచ్చారని జనసేన శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు.
ఈ పర్యటన ప్రాముఖ్యత ఏమిటంటే.. పవన్ కల్యాణ్ గ్రామీణ సమస్యలపై తన ప్రభుత్వం దష్టి పెడుతున్నట్లు స్పష్టం చేస్తుంది. మత్స్యకారుల ఆదాయం, సముద్ర పరిరక్షణపై దృష్టి సారించి, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వవచ్చని అంచనా. ఇది జనసేన పార్టీ బలోపేతానికి, రాజకీయంగా పవన్ కల్యాణ్‌కు మరింత మద్దతు తెచ్చిపెట్టవచ్చు. పర్యటన సమయంలో మత్స్యకారులతో స్థానిక అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగనున్నాయి.
జగన్‌మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన
మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని మాకవరపాలెం సమీపంలోని మెడికల్ కాలేజీని గురువారం సందర్శించనున్నారు. ఈ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవటైజ్ చేయాలనే ప్రణాళికపై విమర్శిస్తూ, ఒక కోటి సంతకాల పోరాటాన్ని ప్రారంభించనున్నారు. జగన్ ప్రభుత్వం స్థాపించిన 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం ద్వారా పేదల వైద్య సేవలు, విద్యార్థుల ఉచిత విద్యను దెబ్బతీస్తోందని ఆరోపిస్తున్నారు.
ఈ పర్యటన ప్రాముఖ్యత ఏమిటంటే.. జగన్ తమ ప్రభుత్వ కాలంలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగాల్లో తీసుకువచ్చిన మార్పులను రక్షించుకోవాలనే పోరాటానికి ఇది మొదటి అడుగు. ప్రైవటైజేషన్‌పై రచ్చబండా కార్యక్రమాల ద్వారా ఒక కోటి సంతకాలు సేకరించి, గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఇది వైఎస్సార్సీపీ పార్టీని రాజకీయంగా బలోపేతం చేస్తూ, ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. విశాఖ పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చినా, ర్యాలీలు, సమావేశాలకు నిషేధం విధించారు.