చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలి
ఈ రోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలని పవన్ కల్యాణ్ అన్నారు.;
By : Admin
Update: 2025-02-01 14:00 GMT
ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలలో చిత్తడి నేలలు ప్రధానమైనవి. ఈ రోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సందర్భంగా పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలు, కార్బన్ నిల్వ కేంద్రాలు, వర్షపు నీటిని భూగర్భానికి చేరుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే అసాధారణమైన ప్రదేశాలు. ఈ భూములు భూకంప ఉదృతిని తగ్గించడంలోను, వాతావరణ మార్పులను నియంత్రించడంలోను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలోను కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 25,000 పైగా చిత్తడి నేలలు ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది కొల్లేరు సరస్సు. ఇది రామ్‌సర్ సైట్‌గా గుర్తింపు పొందిన భారతదేశంలోని అతి పెద్ద తీపినీటి సరస్సులలో ఒకటి. అలాగే, దేశంలో రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు, సముద్ర జీవ జాలానికి కీలకమైన ఉప్పుటేరు వాతావరణ వ్యవస్థ కూడా ఉన్నాయి. ఈ భూములు పక్షుల సంరక్షణకు, మత్స్య సంపదకు మాత్రమే కాదు... వ్యవసాయానికి ఉపయోగపడుతూ వేలాది మంది ప్రజలకు జీవనాధారం అందిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ విలువైన వనరులను రక్షించడానికి మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఆక్రమణలను నివారించేందుకు, భౌగోళిక పరిమితులను ఖచ్చితంగా నిర్థారించేందుకు కృషి జరుగుతోంది. అయితే, పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు... మన అందరి బాధ్యత. మనం దానిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి అని సూచించారు.
స్వప్రయోజనాలను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే ప్రకృతిని కాపాడగలం. ప్రతి చిన్న ప్రయత్నం సమష్టిగా మొదలైతే పెద్ద మార్పుకు దారి తీస్తుంది. అవగాహన, ప్రామాణికమైన పద్ధతులు, ప్రకృతి పట్ల గౌరవం కలిగినప్పుడు మాత్రమే ఈ విలువైన పర్యావరణ వ్యవస్థలను రాబోయే తరాలకు అందించగలం. మన భవిష్యత్తు కోసం మనం ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రారంభిద్దామని పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
అయితే ఇదే విషయం మీద మాజీ ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అయిన పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. సముద్ర తీర ప్రాంతం, భావనపాడు పోర్టు సమీపంలో పెట్రో కెమికల్ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ఆ లేఖలో మాజీ ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు. టేలీనీలాపురం పక్షుల కేంద్ర పరిరక్షణ, భావనపాడు లీలలను పరిరక్షించాలని, సాల్ట్ భూముల్లో పరిశ్రమలు పెట్టడం చట్ట విరుద్ధమని ఆ లేఖలో శర్మ వివరించారు. భావనపాడు బీలల విషయంలో 1108 జీవోను వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనిని ‘భావనపాడు బీలల్లో విధ్వంసక లీలలు వద్దు’ పేరుతో ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ జవనవరి 30న ఈ వర్తాను ప్రచురించింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. పర్యావరణ పరిరక్షణ, చిత్తడి నేలలను కాపాడాలనే ఆలోచనలు, ప్రకృతిని రక్షించాలనే పట్టుదల పవన్ కల్యాణ్‌లో పెరగడానికి ఇది కూడా ఉపయోపడిందని కూడా చెప్పొచ్చు.