హైదరాబాద్- వైజాగ్ మధ్య ప్రయాణంలో ఊరట, విజయవాడ ఊపిరిపీల్చుకోవచ్చా?
హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నారా. ఇక మీరు విజయవాడ వెళ్లాల్సిన పనిలేదు. విజయవాడ నగరంలోకి వెళ్లకముందే వెస్ట్ బైపాస్ మీదుగా రాకపోకలకు అనుమతించారు.;
విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సుమారుగా 20లక్షల జనాభా ఉన్నప్పటికీ బైపాస్ రోడ్డు సదుపాయం లేని నగరంగా విజయవాడ మిగిలిపోయింది. దాంతో రెండు ప్రధాన జాతీయ రహదారులు నగరం మధ్య నుంచి సాగుతుండడంతో నిత్యం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. చెన్నై కోల్ కతా మధ్య ఉన్న ఎన్ హెచ్ 16తో పాటుగా ముంబై- మచిలీపట్నం మధ్య హైదరాబాద్ మీదుగా సాగే ఎన్ హెచ్ 65 కూడా విజయవాడ నగరం గుండానే సాగుతోంది.
రెండు ప్రధాన జాతీయ రహదారులతో పాటుగా నగరంలో పెరిగిన ట్రాఫిక్ తో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికి పరిష్కారంగా బైపాస్ రోడ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలు చాలాకాలంగా ఉన్నాయి. వివిధ ప్రభుత్వాలు హామీలు ఇస్తూ వచ్చాయి. ఏపీ విభజన తర్వాత విజయవాడ పాలనా కేంద్రంగా మారడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటుగా సిబ్బంది సంఖ్య పెరగడంతో విజయవాడ ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది.
ఐదేళ్ల క్రితం మొదలయ్యి..
విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకంటూ కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో 2019లో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. అంతకుముందు 2014లోనే ప్రతిపాదించగా, భూసేకరణ, ఇతర సన్నాహాలు పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల క్రితం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
మొత్తం 47.88 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ రోడ్డు గన్నవరం సమీపంలోని చిన అవుటపల్లి నుంచి మొదలయ్యి మంగళగిరి దగ్గర చినకాకాని వరకూ ఉంటుంది. దానిని 3 భాగాలుగా విభజించి టెండర్లు పిలిచారు. చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ 30 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు ఒక భాగం. కృష్ణా నది మీద 3.2 కిలోమీటర్ల పొడవున వంతెన మరో భాగం కాగా, వంతెన దిగువన ప్రస్తుత ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని వెంకాయపాలెం నుంచి చినకాకాని వరకూ 14.2 కిలోమీటర్లు మరో ప్రాజెక్టుగా నిర్ణయించారు.
కాలపరిమితి దాటింది..
కాంట్రాక్టులు కేటాయించినప్పుడు ఈప్రాజెక్టు ను 2024 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కానీ నిర్ధిష్టకాలంలో నిర్మాణ పనులన్నీ పూర్తికాలేదు. అందులో కొంత భాగం మాత్రం 2023 చివరి నాటికే దాదాపుగా సిద్ధమయ్యింది. ముఖ్యంగా మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మించిన చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.
కృష్ణా నది మీద వంతెన నిర్మాణ పనులు 2025లోకి వచ్చినా ఇంకా కొనసాగుతున్నాయి. అమరావతి మీదుగా చినకాకాని వరకూ ఉన్న రోడ్డు కూడా పూర్తికావచ్చింది.
అయితే చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ పూర్తయిన రోడ్డు మీద వాహనాలు అనుమతిస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం రాకపోకలకు అనువుగా ఉంటుంది. విజయవాడ నగరంలో ప్రవేశించాల్సిన అవసరం లేకుండా ఇబ్రహీంపట్నం తర్వాత గొల్లపూడి వద్ద బైపాస్ ఎక్కి, గన్నవరం తర్వాత ఎన్ హెచ్ 16కి చేరుకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ బైపాస్ రోడ్డు మీదుగా ఉన్న ల్యాంక్ పవర్ ప్రాజెక్ట్ కి చెందిన హైటెన్షన్ టవర్ల కారణంగా రోడ్డుని అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. దాదాపు ఏడాది కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు హెచ్ టీ లైన్ వ్యవహారం కొలిక్కిరావడంతో 2025 జనవరి నుంచి ప్రయాణానికి అనుమతించారు.
దూరం, కాలం కూడా కలిసివస్తుంది
ఇప్పుడిక హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వైజాగ్, కాకినాడ, అమలాపురం, భీమవరం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు విజయవాడ నగరంలో ప్రవేశించాల్సిన అవసరం లేదు. 2025 జనవరి 10వ తేదీ నుంచి దానికి అనువుగా ట్రాఫిక్ ను మళ్లించారు. వాహనాలన్నీ ఇప్పుడు విజయవాడ, గన్నవరం కూడా రావాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లేందుకు మార్గం సుగమమయ్యింది.
తద్వారా సుమారు 30 కిలోమీటర్ల దూరం కలిసివస్తుంది. అదే సమయంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా దాదాపు గంట సమయం అదనంగా వెచ్చించాల్సి ఉండేది. ఇక ఆ సమస్య కూడా తీరిపోయినట్టే. విజయవాడలో అవసరం ఉన్న వారికి తప్ప నగరంలో ప్రవేశించాల్సిన అవసరం లేకుండా ప్రయాణాలకు అవకాశం రావడం అనేక మందికి ఊరటనిస్తోంది. అదే సమయంలో భారీ వాహనాలు, ప్రయాణీకుల వాహనాలు కూడా నగరంలోకి వచ్చేవి తగ్గడంతో విజయవాడ ప్రజలకు కూడా కొంత మేరకు ఊరటనిస్తుంది.
చెన్నై ప్రయాణాలకు ఎప్పుడూ..
కోల్ కతా, వైజాగ్ వైపు నుంచి విజయవాడ మీదుగా తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఈ వెస్ట్ బైపాస్ పూర్తయితే ఎంతో అనువుగా ఉంటుంది. కానీ కృష్ణా నది మీద వంతెన పనుల కారణంగా కొంత జాప్యం జరగింది. ఇప్పుడు వంతెన పూర్తయ్యే దశలో ఉన్నప్పటికీ అమరావతి మాస్టర్ ప్లాన్ కారణంగా మరికొంత కాలం పడుతుందన్న అభిప్రాయం ఉంది.
అమరావతి రాజధాని ప్రాంతం మీదుగా చినకాకాని వరకూ ఉన్న రోడ్డుకి గత ప్రభుత్వ హయంలో జంక్షన్లు ఏర్పాటు కాలేదు. అది ఇప్పుడు రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి వాటి ప్రణాళికలకు ఆటంకంగా ఉంది. దాంతో ఇప్పుడు రింగ్ ఏర్పాటు చేసేందుకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం, ఎన్ హెచ్ ఏ ఐ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. దాంతో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది.
"ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కొన్ని చోట్ల రోడ్డు నిర్మాణంలో మార్పులు చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అది కూడా పూర్తయితే మొత్తం వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తుంది. అది ఎప్పటికి జరుగుతుంది, ఎంత సమయం పడుతుందన్నది నిర్ధిష్టంగా తేలాల్సి ఉంది. వీలయినంత త్వరగా ప్రజలందరికీ వెస్ట్ బైపాస్ పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం" అంటూ విజయవాడ ఎన్ హెచ్ ఏ ఐ రీజనల్ అధికారి కార్యాలయం ది ఫెడరల్ కి తెలిపింది.
హైదరాబాద్- వైజాగ్ మధ్య రోడ్డు ప్రయాణంలో ఊరట, విజయవాడ వాసులు ఊపిరిపీల్చుకోవచ్చా