పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌పై విశాఖలో పారాహుషార్‌!

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో మరో రెండ్రోజుల్లో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌పై విశాఖ పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటోంది.

Update: 2025-11-12 08:41 GMT
వేదిక ప్రాంగణంలో తనిఖీలు చేస్తున్న డాగ్‌ స్క్వాడ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైజాగ్‌ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ కోసం భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో ఉగ్రవాదుల దాడులు, పేలుళ్ల ఘటనతో మరింత ఫోకస్‌ పెట్టింది. అంతకుముందు వేసుకున్న ప్రణాళికకంటే అధిక భద్రతకు ప్రాధాన్యమిస్తోంది.

నగరంలోకి వచ్చిన భద్రతా బలగాలు

అణువణువునా నిఘా.. తనిఖీలు..
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సుమారు 2,500 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీరిలో వెయ్యి మంది భద్రతా సిబ్బంది వేదిక వద్ద ఉంటారు. భద్రతా చర్యల్లో భాగంగా షాపులు, పబ్లిక్‌ ప్రదేశాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. ఒక్క ప్రధాన వేదిక వద్దే వంద సీసీటీవీలను అమర్చనున్నారు. సదస్సు పర్యవేక్షణకు 15 డ్రోన్లను డిప్లాయ్‌ చేశారు. మద్దిలపాలెం, సిరిపురం ప్రాంతాల నుంచి వేదిక వరకు డ్రోన్లతో నిరంతరం నిఘాను పర్యవేక్షిస్తారు. వేదిక ప్రాంగణంలోని వివిధ ప్రవేశ ద్వారాల వద్ద డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లను పెడుతున్నారు. ఇంకా వేదిక వద్ద జాయింట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి వీవీఐపీల కదలికలను నిశితంగా పరిశీలిస్తారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని పార్కింగ్‌ ప్రదేశాల్లోగాని, పరిసరాల్లో గాని ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలను అనుమతించరు. నగర వ్యాప్తంగా పది చెక్‌ పాయింట్లలో తనిఖీలు చేపడ్తారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే వెంటనే రంగంలోకి దిగడానికి ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచుతున్నారు. ఆర్కే బీచ్, తెన్నేటి పార్కు, రుషికొండ బీచ్‌ల్లో స్నానాలకు దిగి ప్రమాదాల పాలవకుండా శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను సిద్ధం చేస్తున్నారు.

సమ్మిట్‌ సమీపంలో బాంబు స్క్వాడ్‌ తనిఖీలు 

ఢిల్లీ పేలుళ్ల ఘటనతో మరింత అలెర్ట్‌..
ఈనెల 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, విదేశాల నుంచి వచ్చే వివిధ దేశాల మంత్రులు, ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈవోలు వెరసి రెండు వేల మంది వరకు వస్తున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటన నేపథ్యంలో విశాఖలో పోలీస్‌ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విశాఖ నగరంలో జనసమ్మర్థంగా ఉండే ప్రదేశాలతో పాటు ప్రధాన ప్రాంతాలను బాంబు, డాగ్‌ స్క్వాడ్లు, మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు నగర సరిహద్దుల్లో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. వాటిల్లో ప్రయాణించే వారి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ఇంకా నగరంలోని లాడ్జిలు, హోటళ్లు, అతిథి గృహాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కార్గో సర్వీస్‌ సెంటర్లు, కొరియర్‌ కార్యాలయాలనూ శోధిస్తున్నారు. అతిథులు, ప్రముఖులు బస చేసే ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
Tags:    

Similar News