రాయలసీమ బీసీల ముద్దుబిడ్డ పాలకొండ్రాయుడు

పేదల నేస్తం పాలకొండ రాయుడు ఇక మన మధ్యలేరు. కానీ ఆయన సేవలు, మానవీయత ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి.;

Update: 2025-05-07 13:25 GMT
Palakondrayudu
ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, సోషలిజాన్ని బోధించలేదు. మానవత్వాన్ని నమ్మారు. తనను నమ్మి వచ్చిన వారిని ఆదరించారు, అభిమానించారు, వాళ్లు అడిగిన పని చేసిపెట్టి తలలో నాలుకలా నిలిచారు. ఆయనే సుగవాసి పాలకొండ్రాయుడు. రాయలసీమ ముద్దుబిడ్డ, బలహీనవర్గాల గొంతుక, రాయచోటి ప్రజల ఆశాజ్యోతి. 2025 మే 5న బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల బలహీన వర్గాలు తల్లడిల్లాయి. ఓ మంచి నాయకుణ్ణి కోల్పోయామే అని కుమిలిపోయాయి. ఆయన్ను కడసారి చూసి కన్నీటి బొట్లు రాల్చాయి.
రాజకీయ ప్రస్థానం..
పాలకొండ్రాయుడి స్వగ్రామం రాయచోటి. అక్కడే జిల్లా పరిషత్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. రాజకీయ ప్రస్థానాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక సాధనంగా మలచుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్న దశలో 1978లో జనతా పార్టీ తరఫున రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారు.

ఎవరైనా తనతో పని ఉందని వస్తే అది పూర్తయ్యేంత వరకు వదిలే పెట్టే రకం కాదు ఆయన. పేదరికాన్ని స్వయంగా అనుభవించడం వల్లనో ఏమో బలహీన వర్గాల పట్ల ప్రేమ. "అందువల్లనే ఏమో ఆయనే నేరుగా అధికారుల వద్దకు వచ్చి ప్రజాపయోగ పనులు చేసి పెట్టేవారని" ఆయన్ను బాగా ఎరిగిన డాక్టర్ దిలీప్ చెప్పారు. ఆయన ఎన్నడూ తన నియోజకవర్గం దాటి వెళ్లలేదని, ఆ నియోజకవర్గ ప్రజలే తన సర్వస్వం అనుకుని పని చేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
జనతా పార్టీ చీలికలు పీలికలు అయి పోయిన తర్వాత 1983లో స్వతంత్ర అభ్యర్థిగా రాయచోటి నుంచి పోటీ చేసి మళ్లీ గెలవడం ఆయన ప్రజాధరణకు నిదర్శనం.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 1984లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999, 2004 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి ప్రజాసేవకు అంకితం అయ్యారు. తాను ఢిల్లీలో ఉండి చేసే దానికన్నా రాయచోటిలో ఉంటేనే ప్రజలకు ఎక్కువ పనులు చేయగలనని గట్టిగా విశ్వసించే వారు.
బలహీనవర్గాల కలల బాటలో సాగిన నేత
పాలకొండ్రాయుడు రాజకీయ బాటలో ఎల్లప్పుడూ బలహీన వర్గాల అభ్యున్నతికే కృషి చేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా – సామాజిక న్యాయాన్ని నిలబెట్టే విషయంలో రాజీపడలేని నాయకుడు ఆయన. బీసీల సమస్యలు ఆయన గుండెల్లో మిగిలేవి. ఆయన మృతి బీసీల పక్షాన గొప్ప నాయకుని కోల్పోయినట్లే.
1968 డిసెంబరు 3న వివాహితుడైన పాలకొండ్రాయుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ విలువల్ని కాపాడుతూ, ప్రజా జీవితాన్ని నడిపిన అరుదైన నాయకుడు.
తలలో నాలుకలా – అదే ఆయన శైలి
బలహీన వర్గాలకు తలలో నాలుకలా ఉండేవారు. పై అధికారులు పేద ప్రజలను పట్టించుకోకపోతే వారి గదుల ముందు కూర్చునేవారు. పై స్థాయి అధికారులతో తగువులు పడినా, పేదల సమస్య పరిష్కారం కోసం వెనుకడుగు వేయలేదు. అధికారం పొందినవారిలో చాలామందికి సాధారణ ప్రజల బాధలు, కష్టాలు అసహజంగా కనిపిస్తాయి. కానీ పాలకొండ్రాయుడికి మాత్రం ప్రజలే దేవుళ్లలాంటి వారు. ఒక బీసీ రైతు తాగునీటి సమస్యకు అధికారులను వెంటాడి చెరువు నుంచి పైపులైన్ వేయించేవారు. ఓ విద్యార్థికి స్కాలర్షిప్ లేదంటే ఆయనే అధికారులు ఎదురుచూసేవారు. ఆయన పేరు ఒక విశ్వాస చిహ్నంగా మారింది. అందుకే ఆయనంటే పేదలకు ఓ భరోసా. ప్రజలలో తిరుగుతూ, వారి భాషలో మాట్లాడుతూ, వారి కన్నీటిని తుడిచిన నేతగా ఎదిగారు. అలాంటి నాయకుడు ఇక లేరన్న వార్త బీసీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రజల మధ్యే జీవించిన పాలకొండ్రాయుడు – ఈ రోజు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. రాజకీయ గెలుపులు, పదవులతో ఆయనకు గొప్పతనం రాలేదు. పేదలు “మనవాడు” అనుకునే పిలుపే ఆయన బహుమతి.
“రాజంపేట ఎంపీగా, రాయచోటి ఎమ్మెల్యేగా పాలకొండ్రాయుడు చేసిన సేవలు వెలకట్టలేనివి” అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారంటేనే ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది.
జీవితాంతం ప్రజల పక్షాన నిలిచి, రాజకీయాన్ని సేవామార్గంగా మలిచిన నేత పాలకొండ రాయుడు. ఆయన భౌతికంగా లేకపోవచ్చు గాని ఆయన చేసిన మంచి పనులు, పేదల అభివృద్ధి కోసం ఆయన పడిన తపన, చూపిన నిబద్ధత ఓ స్ఫూర్తిగా మిగిలిపోతుంది.
Tags:    

Similar News