వచ్చే ఏడాది 13లక్షల కోట్లు మా లక్ష్యం
ఢిల్లీలో నిర్వహించిన స్వర్ణాంధ్రప్రదేశ్–2047లో సీఎం చంద్రబాబు మాట్లాడారు.;
ఈ ఏడాదిలో రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని.. వచ్చే ఏడాదికి రూ. 13లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అనుకున్న మేరకు పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఢిల్లీలో టాటా సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో బుధవారం నిర్వహించిన స్వర్ణాంధ్రప్రదేశ్–2047 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. టెక్నాలజీ అనేది ప్రస్తుత కాలంలో గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ యుగంలో అన్ని ప్రభుత్వాల వద్ద డేటా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ ద్వారా పలురకాల సేవలు అందిస్తున్నామని, ఆగస్టు 15 నుంచి ఇదే విధానంలో మరిన్ని సేవలు ఈ వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన నియోజక వర్గమైన కుప్పం నుంచి డిజిటల్ హెల్త్ కార్డుల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయని, విశాఖపట్నంతో పాటు విజయవాడ, తిరుపతి వంటి పలు నగరాలు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. త్వరలో విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదిరికాన్ని నిర్మూలించేందుకు పీ–4 పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.