’మావోయిస్టులు లేని ఆంధ్రప్రదేశ్‘ లక్ష్యం
ఏపీలో 'ఆపరేషన్ సంభవ్' విజయం సాధించిందని, మావోయిస్టుల కార్యకలాపాలను దెబ్బ కొట్టేందుకు పోలీసులు అసాధారణ కృషి చేశారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
’మావోయిస్టులు లేని ఆంధ్రప్రదేశ్‘ తమ లక్ష్యమని, మావోయిస్టులు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గురువారం (నవంబర్ 20, 2025) ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం చేరుకున్నారు. ఏవోబీ (ఏజెన్సీలు) ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన తర్వాత, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రెండు వరుస ఎన్‌కౌంటర్ స్థలాలను పరిశీలించారు. అక్కడ మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. ఇందులో ఎకే-47 గన్స్, రైఫిల్స్, IEDలు (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్) వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేపట్టిన ఈ క్షేత్ర స్థాయి పరిశీలన కార్యక్రమంలో పోలీసు అధికారులు, గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలు పాల్గొన్నారు.