వైసీపీకి రెండే ప్రశ్నలు..

అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో కనీసం 60 రోజులపాటైనా జరగాలి అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.;

Update: 2025-08-14 11:47 GMT

శాసన సభ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుందని, పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి వైసీపీకి 2 ప్రశ్నలు కేటాయించామని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. అసెంబ్లీలో రూ. 1.5కోట్ల వ్యవయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక హైస్పీడ్‌ ముద్రణా యంత్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు ఆ రెండు ప్రశ్నలు సభకు సమర్పిస్తున్నారే గానీ, వాటిని అడిగేందుకు సభకు మాత్రం రావడం లేదని, అందువల్ల ఆరెండు ప్రశ్నలు వృధా అవుతున్నాయన్నారు.

ఇక మీదట ఆవిధంగా ప్రశ్నలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. ఇకనైనా వైసీపీ సభ్యులు సభకు రావాలని సూచించారు. సభకు వస్తారో రారో కూడా స్పష్టంగా తెలియ జేయాలని, లేదంటే ఆ రెండు ప్రశ్నలను వేరే పార్టీకి కేటాయించే ఆలోచన చేయక తప్పదని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో శాసన సభలోని ముద్రణా యంత్రాలకు కూడా తుప్పు పట్టించారని ఆ తుప్పును వదిలించే ప్రక్రియలో భాగంగానే నేడు ఈ ఆధునిక ముద్రణా యంత్రాలను ఏర్పాటు చేశామని ఆయన వ్యాఖ్యానించారు.

శాసన సభ సమావేశాలు ఏడాదిలో కనీసం 60 రోజులైనా జరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై సభలో చర్చించి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు అందించినట్టు అవుతుందని సభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఇదే అంశాన్ని పట్నాలో జరిగిన స్పీకర్ల సమావేశంలో స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్ళ కాలంలో అసెంబ్లీ సమావేశాలను కేవలం 78 రోజులే నిర్వహించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 31 రోజుల పాటు సభ జరిగిందని ఆయన తెలిపారు. శాసన సభకే హాజరు కాని వారు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ గతంలో నామినేషన్‌ వేసేందుకు కూడా భయపడ్డ ప్రాంతాల్లో, భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవడం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనడానికి నిదర్శనమన్నారు.
Tags:    

Similar News