కొండ.. కోనల్లో.. మహా సూర్య వందనం!
21,850 మందితో 108 సార్లు సూర్య నమస్కారాలు. సరిలేరు మాకెవ్వరూ అంటూ `గిన్నిస్`కు ఎక్కిన గిరి బాల బాలికలు.;
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో సోమవారం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఇప్పటి దాకా మరెవ్వరూ సాధించని ఘనతకు వేదిక అయింది. వెయ్యో, రెండు వేలో కాదు.. ఏకంగా 20 వేల మందికి పైగా గిరి విద్యార్థినీ విద్యార్థులు మహా సూర్య వందనాలతో ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. సరిలేరు మాకెవ్వరూ! అంటూ తమ ప్రతిభను చాటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి జిల్లా యంత్రాంగం ఈ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సూర్యాస్తమయం వేళ ఈ 21 వేల మందికి పైగా గిరిజన విద్యార్థినీ విద్యార్థులు 108 నిమిషాల్లో108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. వీరిలో 13 వేల మంద వరకు బాలికలే ఉండడం విశేషం! వేదిక పై నుంచి అభ్యాసకుడు సూచనలిస్తుండగా వీరంతా వివిధ భంగిమల్లో అలరించారు. నభూతో.. నభవిష్యతి.. అనే రీతిలో సూర్య నమస్కారాలతో అబ్బుర పరిచారు.
అల్లూరి జిల్లాలో 60 ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం వీరు కొన్నాళ్ల నుంచి తర్ఫీదు పొందుతున్నారు. ఈ మైదానంలో ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. తొలుత యోగా శిక్షకుడు పతంజలి శ్రీనివాస్ శంఖాన్ని పూరించి మహా సూర్య వందనాన్ని ప్రారంభించారు. వాటి వెలుతురులో అటు భానుడు అస్తమిస్తుండగా ఇటు గిరి బాల బాలికలు తమ సూర్య వందనాలకు శ్రీకారం చుట్టారు. వీరికి 200 మంది ఆశ్రమ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు సహకరించారు. వీరి మహా సూర్య వందనాలను కళ్లారా వీక్షించడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గిరి బిడ్డల అద్వితీయ సాధనా పటిమను చూసి మురిసిపోయారు.
ఐదు నెలలుగా సాధనలో..
ఈ మహా సూర్య నమస్కారాల కోసం దాదాపు ఐదు నెలల నుంచి ఈ పిల్లలు యోగ సాధనలో శిక్షణ పొందుతున్నారు. అప్పట్నుంచి ఉదయాన్నే వసతి గృహాల నుంచి నిద్ర లేపి యోగ సాధన చేయిస్తున్నారు. ఈ తరహా మరెక్కడా ఇన్ని వేల మందితో సూర్య నమస్కారాలు చేయకపోవడంతో ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది.
దీనిని రికార్డు చేయడానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి ఎలీసా రైనాడ్ బృందం ప్రతినిధులు వచ్చారు. ఈ గిన్నిస్ ప్రతినిధి బృందం మైదానమంతా కలియదిరిగి సూర్య నమస్కారాల తీరును పర్యవేక్షించారు. మహా సూర్య వందనం ఇంతమందితో ఇప్పటిదాకా ప్రపంచంలో మరెక్కడా చేయలేదని గుర్తించి రైనాడ్ బృందం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును నిర్వాహకులకు అందజేశారు. ఈ `మహా సూర్య వందనం` కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్దర్, సబ్ కలెక్టర్ సౌర్యామన్ పటేల్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.