అనంతరం కేంద్రమంత్రి జువల్ ఓరమ్ ని రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి సన్మానించారు. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయనకు బహూకరించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి ఓరమ్ ను ఈఎంఆర్ఎస్ విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆయన సభా ప్రాంగణం వద్ద గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. బొమ్మలను పరిశీలించారు. విల్లును పట్టుకుని బాణాన్ని ఆకాశానికి ఎక్కుపెట్టి కేంద్రమంత్రి ఓరమ్ సందడి చేశారు. అక్కడే ఏర్పాటైన గిరిజనుల ఉత్పత్తిగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరకు కాఫీ స్టాల్ ను సందర్శించారు. దాంతో పాటు గిరిజనుల ఉత్పత్తి అయిన తేనే బాటిళ్లను పరిశీలించారు.
గొప్ప మార్పుకు వేదిక
ఉద్భవ్-2025 అంటే వేడుక కాదు..గొప్ప మార్పుకు వేదిక అని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. చిన్నారులలోని ప్రతిభ, సృజనాత్మకతను బయటకి తీసి విశ్వాసం నింపాలనేదే లక్ష్యమన్నారు. కొత్త పరిచయాలు, కొత్త సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ఈ ఉత్సవం వల్ల సాధ్యపడుతుందన్నారు. 405 ఈఎంఆర్ఎస్ స్కూళ్ల నుంచి 1647 మంది తరలివచ్చారని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొనే వేదిక ఏపీ కావడం సంతోషకరమన్నారు. 110 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
గిరిజనుల అభివృద్ధికోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఉద్భవ్ -2025 వేదికగా మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు సీఎం నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. గిరిజన చిన్నారులు కూడా డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్ల వంటి గొప్ప చదువు చదవడమే కాకుండా మంచి పౌరులుగా నిలవాలన్నారు. గెలుపు ముఖ్యమే..కానీ ఓటమికి మాత్రం భయపడకూడదంటూ ప్రసంగంతో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలోని గిరిజన బిడ్డల చదువు, పాఠశాల వసతులకు మరిన్ని నిధులివ్వాలని కేంద్రమంత్రి ఓరమ్ కు విన్నవించారు. గిరిజనులుండే రిమోట్ ఏరియాలో రోడ్డు నిర్మాణం, అనుసంధానానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఏపీకి మరిన్ని ఈఎంఆర్ఎస్ స్కూళ్లను మంజూరు చేయాలన్నారు.
తెలుగులో పలకరించి, ప్రసంగించి నెస్ట్స్ కమిషనర్ అజిత్ కుమార్ శ్రీవాత్సవ ఆశ్చర్య పరిచారు. నెస్ట్స్ ఆధ్వర్యంలో కళా ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యంతో ఈ వేడుకలు మరింత ప్రతిధ్వనిస్తాయన్నారు. 2019లో గిరిజన సంప్రదాయానికి తగిన గుర్తింపు దక్కిందన్నారు. గతంలో కన్నా ఎక్కువ కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. గతంలో లేని విధంగా ఉద్భవ్-2025ను నిర్వహిస్తున్నందుకు ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన గౌతమి,ఐఏఎస్ కు అభినందనలు తెలియజేశారు.
28 లక్షల మంది గిరిజనులున్న ఏపీలో ఉద్భవ్ -2025కు ఆతిథ్యమిస్తున్నందుకు గర్వపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్ పేర్కొన్నారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల మనలోని వైవిధ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 740 ఈఎంఆర్ఎస్ లు ఉన్నాయన్నారు. 440 ఈఎంఆర్ఎస్ భవనాలను కేంద్రం నిర్మిస్తోందన్నారు. రాష్ట్రాలవారీగా గిరిజనుల జీవన వైవిధ్యం, సంస్కృతిని దేశవ్యాప్తంగా తెలిపే వేదికగా ఉద్భవ్-2025 మారుతుందన్నారు. ఇటువంటి ఉత్సవాలలో సినీ ప్రముఖులను కూడా భాగస్వామ్యం చేస్తే మరింత బాగుంటుందన్నారు. 20 ప్రత్యేక బృందాలను నియమించి పోటీలకు తగిన వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మూడు రోజుల పాటు జరిగే పోటీలకు తగ్గ భోజన, వసతి సదుపాయాలు సిద్ధంగా ఉందన్నారు. కేఎల్ యూనివర్శిటీలో 2 థియేటర్లు, 3 సెమినార్ హాల్స్, 10 తరగతి గదులు, ఓపెన్ ఎయిర్ థియేటర్, పెద్ద సెమినార్ హాల్ లలో వివిధ కేటగిరీలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. గ్రూప్ ఈవెంట్లు, స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్ రైటింగ్ పోటీలు కూడా జరగనున్నాయన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. నెస్ట్స్ ఆధ్వర్యంలో 36 బృందాలను సంసిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. క్లినిక్, అంబులెన్స్ వంటి అత్యవసర సదుపాయాలు కల్పించామన్నారు. చిన్నారుల రక్షణ, రవాణాకు లోటు రాకుండా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలను ఏ ఇబ్బంది రాకుండా నిర్వహించేందుకు రాష్ట్రమంత్రి సంధ్యారాణి నిరంతరం సమీక్షించారన్నారు.
అతిథుల ప్రసంగాల అనంతరం కేంద్రమంత్రి జువల్ ఓరమ్, రాష్ట్ర మంత్రి సంధ్యారాణి, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ, లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ హసన్ బాష , నెస్ట్స్ కమిషనర్ అజిత్ కుమార్ శ్రీవాత్సవ, తదితరులను సన్మానించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశుని విగ్రహాలను వారికి జ్ఞాపికలుగా బహూకరించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలనతో ఉద్భవ్ ఉత్సవాలను ముఖ్య అతిథి కేంద్ర మంత్రి ఓరమ్, రాష్ట్ర మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ప్రార్థన గీతంతో పాటు మారేడుమిల్లి ఈఎంఆర్ఎస్ బాలికల ప్రారంభ గీతం ప్రత్యేకార్షణగా నిలిచింది. వేదికపై సంప్రదాయ థింసా సంగీత, నృత్య ప్రదర్శనతో అరకువ్యాలీ ఈఎంఆర్ఎస్ బాలబాలికలు ప్రశంసలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్, పిల్లి మాణిక్య రావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ హసన్ బాషా,టీడీపీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ దారు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి M.మల్లికార్జున నాయక్, నెస్ట్స్ కమిషనర్ అజిత్ కుమార్ శ్రీవాత్సవ, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి, గురుకులం కార్యదర్శి ఎం.గౌతమి, నెస్ట్స్ జాయింట్ కమీషనర్ బిపిన్ చంద్ర రటూరీ, కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీ డీన్, ప్రొఫెసర్ జీపీఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.