బీఆర్ఎస్ ఛైర్మన్ను కాను..గుత్తా సంచలనం

తనకు ఏ పార్టీతో కూడా సంబంధాలు లేవన్నారు. తాను బీఆర్ఎస్ మండలి ఛైర్మన్ కాదని స్పష్టంగా ప్రకటించేశారు.

Update: 2024-10-09 07:37 GMT

బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పార్టీతో కూడా సంబంధాలు లేవన్నారు. తాను బీఆర్ఎస్ మండలి ఛైర్మన్ కాదని స్పష్టంగా ప్రకటించేశారు. గుత్తా వ్యాఖ్యలు ఇపుడు రాజకీయంగా వైరల్ అవుతున్నది. వాస్తవానికి గుత్తా వ్యాఖ్యలు ఒకరకంగా కరెక్టే అనటంలో సందేహంలేదు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో గుత్తా వ్యాఖ్యలను ఎవరూ నమ్మటంలేదు. ఎలాగంటే ఒకసారి అసెంబ్లీ స్పీకర్ గా శాసనమండలి ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ఒకపుడు పార్టీలకు అతీతంగా వ్యవహరించేవాళ్ళు కాని ఇపుడు అది సాధ్యంకాదని అందరికీ తెలిసిందే. సభాపతి అంటే ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇప్పటి స్పీకర్ అయినా మండలి ఛైర్మన్ అయినా పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యం.

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి శాసనమండలిలో విప్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గుత్తా మీడియాతో మాట్లాడుతు పై వ్యాఖ్యలు చేశారు. పట్నంను బీఆర్ఎస్ విప్ గా చూడాలా ? లేకపోతే కాంగ్రెస్ విప్ గా చూడాలా అని మీడియా అడిగిన ప్రశ్నకు గుత్తా సమాధానమిస్తు అఫీషియల్ విప్ గానే పట్నంను చూడాలన్నారు. పనిలోపనిగా తనను శాసనమండలి ఛైర్మన్ను చేసిన బీఆర్ఎస్ పైన కూడా గుత్తా ఫుల్లుగా ఫైరయ్యారు. ఎంఎల్ఏల ఫిరాయింపుల అంశంలో ఇదివరకు బీఆర్ఎస్ ఏమిచేసిందో గుర్తుచేసుకుంటే మంచిదని హితవు పలికారు.

మూసీనది సుందరీకరణపై ఇంకా డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం కాకముందే అవినీతి జరిగిందని ఆరోపణలు చేయటం సరికాదన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనపై మాట్లాడేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఆర్ధికవనరులు ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగానే పనిచేస్తోందని కితాబిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తిచేస్తున్నట్లు చెప్పారు. నాయకులు వాడుతున్న భాష ఏమీ బావోలేదని అబిప్రాయపడ్డారు. హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్లు పడిపోయాయని, ఆదాయం తగ్గిపోయిందని ఆరోపించటం, విమర్శలు చేయటం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News