నితీష్ కుమార్ చిక్కడు..దొరకడు
సామాన్య వ్యక్తి స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడిగా నితీష్ కుమార్ బీహార్ చరిత్రలో నిలిచిపోనున్నారు.
బీహార్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా నితీష్ కుమార్ హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు. బీహార్ లో గత రెండు దశాబ్దాలుగా నితీశ్ కుమార్ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా సరే సీఎం నితీష్ కుమారే. ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కినా ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం నితీశ్‌దే అన్నట్టుగా తనకంటూ ఓ మార్క్ ను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 2005 నుంచి 2025 వరకు – 2014-15లో ఒక ఏడాది మినహా – ఆయనే సీఎంగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయనే సీఎం కానున్నారు. అయితే ఎన్నికల ముందు "వయసు అయిపోయింది, ఈసారి కష్టం" అని విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ కౌంటింగ్ ట్రెండ్స్ మాత్రం ఆయనను తిరుగులేని నాయకుడిగా చెబుతున్నాయి. నితీశ్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) దాదాపు రెండింతల స్థానాలతో ముందంజలో ఉంది.
సాధారణ వ్యక్తిగా
సాధారణ కుర్మీ కుటుంబంలో 1951 మార్చి 1న నలందా జిల్లా బక్తియార్‌పూర్‌లో జన్మించిన నితీశ్, చిన్నతనంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు, తల్లి గృహిణి. ఇంజినీరింగ్ చదివి ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన, 1970ల చివర్లో జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఉద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. సైలెంట్ గా ఉండి తన పని తాను చేసుకుని పోవడం, పట్టుదల, కష్టపడి పనిచేయడం – ఇవే ఆయన ఎదుగుదలకు మూలస్తంభాలు. 1977, 1980, 1985లో హర్నాట్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేసి, మొదటి రెండు సార్లు ఓడిపోయారు. 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
నితీశ్ రాజకీయ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఒక్క రోజులో ఆయన అందలం ఎక్కలేద. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్నో ఎత్తూ పల్లాలను చూశారు. 1989లో బర్హ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అయ్యారు. 1990లో జార్జ్ ఫెర్నాండెస్‌తో కలిసి సమతా పార్టీ స్థాపించారు. 1998లో రైల్వే మంత్రిగా, 2000లో బీహార్ సీఎంగా మొదటిసారి ప్రమాణం చేశారు (కానీ కొన్ని రోజులే). 2005లో NDAతో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చి, అప్పటి నుంచి సీఎం స్థానం వదలలేదు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 20 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు – అన్నిసార్లూ ఎమ్మెల్సీగానే ఉన్నారు.
నేర్పరి నేత
పాత కూటములు వదులుకోవడం, కొత్తవి కట్టడం, మళ్లీ పాతవాటిలోకి తిరిగి రావడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి అంశాలలోె నితీశ్ రాజకీయ నిర్ణయాలు ఎప్పుడూ ధైర్యంగా, ఊహించని విధంగా ఉంటాయి. 2013లో బీజేపీతో విడిపోయి మహాగఠబంధన్‌లో చేరారు. 2017లో మళ్లీ NDAలోకి తిరిగి వచ్చారు. 2022లో మళ్లీ మహాగఠబంధన్‌లోకి వెళ్లారు. 2024లో మళ్లీ NDAలోకి వచ్చారు. ఈ "పల్టీ రాజకీయాలు" ఆయనకు కొత్తకాదు. ఈ రకమైన రాజకీయాలు నితీష్ కు "చాణక్యుడు" అనే బిరుదును తెచ్చిపెట్టాయి. ఏ సమయంలో ఏ కూటమిలో ఉండాలి, ఎప్పుడు ఎలా బయటికి రావాలి అనేది ఆయన బాగా అవగాహన చేసుకున్నారు. అందులో ఆయన పేరు గణించారు.
అయితే ఏమి చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చివరకు నితీశ్ అడుగు ముందుకే పడింది. బీహార్‌ను "జంగిల్ రాజ్" నుంచి బయటపడేశారు. వైద్యం, విద్య, రోడ్లు, విద్యుత్ – రంగాల్లో ఆయన పాలనలో ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మహిళా రిజర్వేషన్, సైకిల్ పథకం, గ్రామీణ రోడ్లు – ఇవన్నీ ఆయన పాలకు ముద్ర వేశాయి. రాష్ట్రంలో నేరాల రేటు తగ్గింది, పెట్టుబడులు పెరిగాయి. అయినా విమర్శలు లేకపోలేదు. ఉద్యోగాలు, పారిశ్రామికాభివృద్ధి లోపించాయనేే విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి.
ఈసారి ఎన్నికల్లో జేడీయూ 85+ స్థానాల్లో ముందంజలో ఉండటం, బీజేపీ 80+తో కలిసి NDA 189+ స్థానాల్లో లీడ్ చేయడం – నితీశ్ మళ్లీ సీఎంగా కొనసాగే అవకాశం దాదాపు ఖాయమైందనే చెప్పొచ్చు. మైథిలీ ఠాకూర్ వంటి యువ అభ్యర్థులతో బీజేపీ కొత్త ముఖాలు తెస్తున్నా, బీహార్ రాజకీయాలలో మకుటం లేని మహారాజు మాత్రం నితీశ్ కుమారే. ఒక సాధారణ యువకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు, బీహార్ రాష్ట్ర రాజకీయాలను మార్చే నాయకుడిగా , బీహార్ రాజకీయ చరిత్రలో నితీష్ కుమార్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.