ఆంధ్రాలో సర్వత్రా ఉత్కంఠ...

ఒకటా.. రెండా.. ఏకంగా 21 రోజులు గ్యాప్‌. మరి టెన్షన్‌ పెరక్కుండా ఎలా ఉంటుంది. రాజకీయ నాయకులే కాదు అందరూ జూన్‌ 4 కోసం ఎదురు చూస్తున్నారు.

Update: 2024-05-22 09:01 GMT

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా ఉండిన విజయవాడలో ఏదైనా ఆటోలో ఎక్కి కూర్చోని ప్రయాణించండి, కొద్ది దూరం పోగానే  డ్రైవర్ వేసే ప్రశ్న... ఏం సార్ ఏమనుకుంటున్నారు. ఎవరు ఎన్నికల్లో  గెలిచేలా ఉన్నారు, అనే. మే 13న పోలింగ్ జరిగితే, ఓట్ల  లెక్కింపు కోసం జూన్ 4 వ తేదీక వేచి చూడాల్సి రావడం ఎవరికీ ఇష్టం లేదు. ఇంత విరామం పట్ల విసుగు వ్యక్తం చేస్తున్నారు.


ఒక్క పార్లమెంటు ఎన్నికలయితే ఇంత ఉత్కంఠ ఉండేది కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బాట వేసే  అసెంబ్లీ ఎన్నికలు కూడా తోడవడంతో  ఉత్కంఠ తీవ్రమయింది.


పెద్ద పెద్ద వ్యాపారులు, ఉన్నతాధికారుల నుంచి చిన్న చిన్న పనులు చేసుకునే వారి వరకు ఇదే డిస్కషన్‌. రాజకీయ పార్టీలు, వారి కార్యాలయాలు, నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, కిరాణ దుకాణాలు,


కూలీలు, సామాన్య ప్రజలు, హోటల్స్, టీ దుకాణాలు, ప్రయాణ స్థలాలు ఎక్కడ చూసినా హాట్‌ హాట్‌ చర్చలు. రైల్లో ప్రయాణిస్తున్నా, బస్సులో పోతున్నా ఇదే చర్చ వినిపిస్తోంది. లాజికల్‌ అనాలసిస్‌లు. బలాలు, బలహీనతలు, కలిసొచ్చే అంశాలు, వ్యతిరేకత పాయింట్లు, ప్లస్‌లు, మైనస్‌లు. ఎక్కడ చూసినా ఇచే పిక్చర్‌. ఇదే వాతావరణం.

జూన్ నాలుగో తేదీ ఎంతకు రానట్లు ఆందరిలో ఉతృత కనిపిస్తుంది.ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడి పోతారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది, చంద్రబాబు ఓడి పోతారంట కదా, జగన్‌కు ఈ సారి మెజారిటీ తగ్గుతుందంటగా, పవన్‌ కల్యాణ్‌ ఈ దఫా గెలుస్తారంటగా, లోకేష్‌కు టఫ్‌ ఫైట్‌ ఉంటుందంట, రోజాకు ఈ సారి గట్టి దెబ్బట, కపడలో షర్మిల ఎఫెక్ట్‌ ఉంటుందట, ఇలా అనేక రకాల వాడీ వేడీ చర్చలు సాగుతున్నాయి.

ఈ సారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్‌ ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది, పెరిగిన మహిళా ఓటింగ్‌ జగన్‌కు పడిందా. లేదా కూటమి వైపు మొగ్గు చూపారా? యువత ఎవరికి ఓటు వేసి ఉంటారు? వృద్ధుల ఓటు ఎటువైపు పడి ఉంటుంది.

అధికారులు, ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఎవరికి సపోర్టు చేసి ఉంటారా ఉండరా, జగన్‌ బ్రాండ్లతో విసిగెత్తి పోయిన మందుబాబులు మళ్లీ జగన్‌కు జై కొట్టి ఉంటారా? లేదా చంద్రబాబు వస్తే మంచి బ్రాండ్లు తెస్తారని మొగ్గు చూపారా? సీఎం జగన్‌కు సంక్షేమ పథకాలు వర్క్‌వుట్‌ అయ్యుంటాయా.. చంద్రబాబు కొత్త మేనిఫెస్టో ప్రభావం చూపి ఉంటుందా? ల్యాండ్‌ టైటిల్‌ చట్టం ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపి ఉంటుంది, జగన్‌ మూడు రాజధానులపై స్టాండ్‌ కావడం, చంద్రబాబు అమరావతికే స్టిక్కాన్‌ కావడం ఓటర్లపై ఎంత ప్రభావం చూపి ఉంటుంది? చంద్రబాబు స్ట్రాటజీలేమిటీ? జగన్‌ వ్యూహాలేమిటి? ఇలా అనేక రకాల లాజిక్‌లపై, టీవీ డిబేట్లలాగే అన్ని వర్గాల్లోను హాట్‌ డిస్కషన్‌ జరుగుతోంది. 2024 ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల నిర్వహణకు, ఫలితాలు వెల్లడించేందుకు మధ్య 21 రోజులు గ్యాప్‌ ఉండటంతో జూన్‌ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రోజులు దగ్గర పడేకొద్ది టెన్షన్‌లు పెరుగుతున్నాయి, చర్చలు పెరుగుతున్నాయి.

మరో వైపు ఎన్నికల పోలింగ్‌ సరళిపైన, ఫలితాలపైన ప్రధాన పార్టీలైన వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, జనసేన, బిజేపీలు ఎవరికి తగ్గట్టు వారు అంచనాలు వేసుకుంటూ ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఎన్డీఏ కూటమీ నెగ్గుతుందని, చంద్రబాబు మరో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతోంటే, ఈ సారి కూడా తామే అధికారంలోకి వస్తున్నామని, ఈ సారి 151 కంటే అధిక స్థానాల్లో గెలుస్తామని, రెండో సారి జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రమాణ స్వీకారాలకు వెన్యూలు, తేదీలు, సమయాలను కూడా ప్రకటించేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికల అనంతరం ప్రముఖ నేతలంతా విదేశీ బాట పట్టారు. జగన్‌ యూరప్‌ వెళ్లగా, షర్మిల, చంద్రబాబు, లోకేష్‌లు అమెరికా విమానం ఎక్కారు. పవన్‌ కల్యాణ్‌ కూడా విదేశాల్లోనే సేదతీరుతున్నారు. కానీ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. గెలుపు ఓటములపై అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని భావిస్తున్న నేతల్లో కూడా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బాటిల్స్‌ ఖాళీ అవుతున్నా కొంత మంది నేతలకైతే నిద్ర పడట్టం లేదనే టాక్‌ ఆ పార్టీల కేడర్‌లో నడుస్తోంది.

పోలింగ్‌ తీరుపై ఒక సంక్లిష్ట వాతావరణం నెలకొనడంతో ఫలితాలు వచ్చేంత వరకు చెప్పలేమనే భావనకు వచ్చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రముఖ నేతల్లో కూడా ఇదే రకమైన టెన్షన్‌లోనే సేదతీరుతున్నారనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. తన వద్దకు ఎవరు వచ్చినా ఎలక్షన్‌ రిజల్ట్‌పైన డిస్కషన్‌ ఉంటోందని, తెలియకుండానే చర్చ ఆవైపు వెళ్లి పోతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి చెప్పడం విశేషం. 
Tags:    

Similar News