నంద్యాల శివ.. నట్టేట ముంచాడు!
కాసినా కుసినా.. రూ.14 కోట్లతో పరార్, బాధితుల లబోదిబో..;
By : The Federal
Update: 2025-09-06 04:15 GMT
అతడే ఓ బ్యాంకు, ఓ పోస్టాఫీసు, ఓ చిట్ ఫండ్ కంపెనీ.. తెలివైన వాళ్లు వడ్డీలు, రికవరింగ్ డిపాజిట్ల (ఆర్డీలు) వ్యాపారం చేస్తుంటే తెలివిలేని వాళ్లు వడ్డీలు కడుతున్నట్టే ఈ ఇతడు కూడా పేదల్ని, మహిళల్నీ నమ్మించి మోసం చేశాడు. ఓ 13,14 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. బాధితులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. పోలీసుల్ని ఆశ్రయించారు.
నంద్యాల ఓల్డ్ టౌన్ లో శివ అనే మధ్యవయస్కుడు ఈ నేరానికి పాల్పడ్డారు. ఇతని స్వగ్రామం ముత్యాలపాడు. ఆ ఊర్నుంచి పొట్టబోసుకునేందుకు నంద్యాల వచ్చాడు. ఇంటింటికి వెళ్లి రికవరింగ్ డిపాజిట్లు (ఆర్డీలు) కట్టుకోండి, మీ జీవితాల్ని బాగుచేసుకోండని చెప్పేవాడు. ఏదైనా బ్యాంకుకో, పోస్టాఫీసుకో వెళ్లమనే వాడు. అలా అందరికీ తలలో నాలుకలా తయారైన తర్వాత సొంతంగా చీటీల వ్యాపారం మొదలు పెట్టాడు. మొదట్లో అందరిలాగానే సక్రమంగానే చెల్లింపులు చేసేవాడు.
నిత్యం దుకాణాల వద్ద ఆర్డీలు తీసుకుంటూ, చీటీలు నిర్వహిస్తూ అందరికీ నమ్మకం వచ్చేలా చేశాడు. దీంతో చాలామంది అతడికి అప్పులు ఇచ్చారు. కొన్నాళ్లకు సుంకులమ్మ వీధిలో ‘శివ’ పేరుతో నగల దుకాణాన్ని ప్రారంభించాడు.
బ్యాంకుల్లో రుణాలతోపాటు ఇతర దుకాణాల యజమానుల నుంచీ ఆభరణాలు తీసుకున్నాడు. బంగారు దుకాణాల వద్దకు శివ వెళ్లి వినియోగదారులు వచ్చారంటూ బంగారం తీసుకెళ్లేవాడు. అనంతరం వారికి 50 శాతం నగదు ఇచ్చేవాడు. ఇలా ఒక్కో దుకాణదారుడి నుంచి 500 గ్రాములకుపైగా తీసుకున్నాడు. అందినకాడికి అప్పులు చేశాడు. ఇలా సుమారు రూ.13 నుంచి 14 కోట్ల మధ్య వసూలు చేసి పరారయ్యాడు.
నెలలు గడిచినా అతని జాడ లేకపోవడంతో చివరికి మోసపోయినట్లు తెలుసుకుని బాధితులు రెండు నెలల కిందల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేట మొదలుపెట్టి ఎట్టకేలకు పట్టుకుని నంద్యాలకు తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసి బాధితులు నంద్యాల టూ టౌన్ పోలీసుస్టేషన్‌కు పెద్దఎత్తున చేరుకున్నారు.
బాధితుల్లో కూలీ నాలీ చేసుకునే వారే ఎక్కువ. కూతురి పెళ్లి కోసం డబ్బు దాచుకున్న వారు కొందరైతే కొడుకు చదువు కోసం దాచుకున్న వారు మరికొందరు.
బ్యాంకు అధికారులు అతడి దుకాణాన్ని సీజ్ చేశారు. నిందితుడికి భార్య, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు ముగిస్తే గాని అసలు డబ్బులు ఏమయ్యాయో తెలుస్తుంది.