నాడు సై అన్నారు.. నేడు నై అంటున్నారు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటా. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు రెండూ ఇదే తీరు. ఏమిటి ఆ మాట. ఏమిటి ఆ తీరు.

Update: 2024-05-07 06:18 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులకు మాట మీద నిలబడే నైతికత లేకుండా పోయింది. చెప్పింది చెప్పినట్లు చేస్తే ప్రజలు వారిని మరచి పోతారనుకున్నారో ఏమో. ఒకటి చెప్పి మరొకటి చేస్తే ప్రజల్లో ఎప్పటికీ గుర్తిండి పోతామని భావిస్తున్నారో ఏమో. అందుకే నాయకులు ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు.

అమరావతిని సమర్థించిన వైఎస్‌ఆర్‌సీపీ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరాతి రాజధానిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారో చూద్దాం. రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. అందరికి అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాం. అమరావతిని రాజధానిగా ఎంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి పని చేశారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు సరిపోవు. అవసరమైతే ఎక్కువ భూములు తీసుకోవాలి. వీలైనంత త్వరగా అమరావతిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలి. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. రాజధాని లేక పోవడం వల్ల నిరుద్యోగులు, యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. త్వరగా రాజధానిని నిర్మించి అందుబాటులోకి తెచ్చినట్లైతే ఇక్కడే యువతకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ పక్షాన రాజధాని అమరావతికి సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నట్లు నాడు అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
మాట మార్చిన జగన్‌
అధికారంలోకి వచ్చాక వైఎస్‌ జగన్‌ మాట మార్చారు. పనితీరు మారింది. అమరావతిలో పర్మినెంట్‌గా ఏ ఒక్క కట్టడం లేదు. అన్నీ టెంపరరీ భవనాలే. ఒక చోట రాజధాని ఉండే కంటే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుగా చేస్తే బాగుంటుందని పాట మొదలు పెట్టారు. ఆ పాటకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా వంత పాడారు. వైఎస్‌ఆర్‌సీపీ మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. వెంటనే అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు బగ్గు మన్నారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అమరావతి రాజధానిగా ఉండాలని నేటికీ ఆందోళలనలు కొనసాగిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పలువురు హైకోర్డును కూడా ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు అమరావతిని రాజధాని కాదనే హక్కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి లేదని, అమరావతే రాజధానిగా ఉంటుందని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఆ కేసు విచారణలో ఉంది. ఈ లోపు మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీ సమావేశాల్లో మరో తీర్మానం ప్రవేశ పెట్టి, వెనకడుగు వేశారు.
విశాఖ నుంచే పాలన
అయితే ఎప్పటికప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా మూడు రాజధానులు ఉంటాయనడం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ విశాఖపట్నానికి మార్చాలంటూ ఆదేశాలివ్వడం, తాను కూడా ఈ నెల, వచ్చే నెల విశాఖకు మారుతున్నానని చెప్పడంతో ఐదేళ్లు గడిచాయి. నేటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఈ ఐదేళ్ల కాలం అమరావతి రాజధాని కొనసాగాలని జగన్‌ రాజధాని ఆశలు సర్వ నాశనం చేశారని, జనానికి చెబుతూ వస్తోంది.
ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లును సమర్థించిన టీడీపీ
తెలుగుదేశం పార్టీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై నాడొక మాట.. నేడొక మాట మాట్లాతోంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లును సెంబ్లీ ప్రవేశపెట్టి దానిపై చర్చకు సమయం ఇచ్చినప్పుడు అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లుకు టీడీపీ తరఫున సంపూర్ణ మద్ధతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భూమి రికార్డులను ఆధునీకరించి భూములను రీసర్వే చేయడం ద్వారా సంబంధిత భూ యజమానులకు ఎలాంటి వివాదాలకు తావివ్వని టైటిలింగ్‌ ఇవ్వడంతో మంచి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసిందని, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే భూముల రీసర్వే ప్రారంభమైందని తెలిపారు. మంచి చట్టం, మంచి మార్గంలో అమలు జరిగితే బాగుంటుందని అభినందించారు. సభలో టీడీపీ సభ్యులు కూడా ఆయన చేసిన ప్రసంగాన్ని వింటూనే ఉన్నారు.
నేడు మాట మార్చిన చంద్రబాబు
నేడు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ టీడీపీకి ఎన్నికల ఆయుధంగా మారింది. ఈ చట్టం వల్ల పాలకులు ఏమనుకుంటే అది జరుగుతుందని, ఒకరి భూములు మరొకరు లాక్కోవడానికి అవకాశం ఉంటుందని, ఒక్క సారి ల్యాండ్‌ టైటిలింగ్‌ జరిగిన తర్వాత ఏదైనా వివాదం వస్తే కింది కోర్టులకు భూ యజమానులు వెళ్లే అవకాశం లేదని, అందువల్ల న్యాయం జరగదని, నేరుగా హైకోర్టుకు సామాన్యులు వెళ్లలేరని, ఇతందా భూములను స్వాహా చేసేందుకు జగన్‌ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని చంద్రబాబు నాయుడు ఎన్నికల సభల్లో ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వం సదుద్దేశంతో చట్టాన్ని అమలు చేస్తోంటే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదులు చేయడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. అయినా చంద్రబాబు ఆరోపణల్లో ఎలాంటి మార్పు లేదు.
నాడు సమర్థించడం, నేడు వ్యతిరేకించడం, ఎన్నికల్లో ఎవరికి వారు లబ్ధి పొందాలని ప్రయత్నించడం, ఇది నేడు జరుగుతున్న రాజకీయ తంతు. మంచి చెడుల గురించి ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు మరో మాట మాట్లాడటం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులకే సరిపోయిందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. పాలక ప్రతిపక్షాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
Tags:    

Similar News