పాఠశాలలో తమది గోల బ్యాచ్ అని, తమ ఉపాధ్యాయుల మార్గనిర్దేశనంతో బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి వెళ్లానని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన గురుపూజ ఉత్సవంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తన జీవిత గురువు తన తండ్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో వీక్ గా ఉన్నానని తన తండ్రి చంద్రబాబు తనకు బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇప్పించారని వెల్లడించారు. మంత్రి నారాయణను పిలిపించి తనకు శిక్షణ ఇప్పించారని చెప్పారు. ఆ తర్వాత యూనివర్శిటీలో రాజిరెడ్డి ఆధ్వర్యంలో చదువుకున్నట్లు తెలిపారు. సమయానికి హెయిర్ కట్ కూడా చేయించుకోవాలని తనకు తెలియదన్నారు. తన తల్లి తర్వాత తన ఉపాధ్యాయులనే గౌరవిస్తానని వెల్లడించారు. విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకునే అంశంపై టీచర్లతో చర్చించానన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని పిలుపిస్తే... స్కూటరుకు మైక్ కట్టుకుని అనౌన్స్ మెంట్ చేస్తూ అడ్మిషన్లు పెంచిన ఉపాధ్యాయులు ఉన్నారు. జీరో ఇన్వెస్టిమెంట్–హై రిటన్స్ అని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచిన టీచర్లూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి తెచ్చాం. ఎప్పుడూ లేని విధంగా మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహించాం. పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారనే అంశాన్ని పేరెంట్సుకు అర్థమయ్యేలా చెప్పేందుకు పేరెంట్–టీచర్ మీటింగ్ పెట్టాం. దీన్ని కొనసాగిస్తామని లోకేష్ చెప్పారు.
నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. అందుకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నాను. అందరితో చర్చించి... చాలా సంస్కరణలు తెచ్చాను. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని చెప్పడం లేదు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేశాం. కరిక్యులంలో మార్పులు తెచ్చాం. వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని మరింత విస్తృత పరిచాం. శనివారం నో బ్యాగ్ డే చేపడుతున్నాం. ప్రభుత్వ విద్యలో రాజకీయాలను దూరంగా పెట్టాం. వేదిక మీదున్న బోర్డులోనూ సీఎంగారి ఫొటో కూడా పెట్టలేదు. పిల్లలకు అందించే పుస్తకాలు, కిట్ల పైనా ఎవ్వరి ఫొటోలు వేయలేదు. టీచర్ ట్రాన్సఫర్ యాక్ట్ తెచ్చాం. పారదర్శకంగా ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబే నియమించి ఉంటారు.
డీఏస్సీ అంటే చంద్రబాబు... చంద్రబాబు అంటే డీఎస్సీ. 13 డీఎస్సీల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. మెగా డీఎస్సీ ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. డీఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు. కానీ సీఎం డైరెక్షన్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాం. 70 కేసులు పడ్డాయి. కానీ డీఎస్సీ మాత్రం ఆగలేదన్నారు.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగుల్లో ఆంధ్ర యూనివర్శిటీ 4 స్థానానికి చేరింది. మొదటి స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తాం. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ విద్యకు దూరమయ్యారు. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది. పోటీ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల విద్య అంటే... దేశం మొత్తం ఏపీ వైపు చూడాలి. ప్రభుత్వ పాఠశాలల విద్య అంటే ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఇక నుంచి ఏపీ వైపు చూడాలి. అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.